ఒంగోలులో భూదందాలపై సీఐడీ దృష్టి

ఒంగోలులో భూదందాలపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడం, దీనిపై సీఐడీ అదనపు డీజీ స్పందించి పూర్తి వివరాలతో హాజరుకావాలని తహసీల్దారుకు నోటీసులు జారీ చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

Updated : 04 Dec 2022 06:13 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలులో భూదందాలపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడం, దీనిపై సీఐడీ అదనపు డీజీ స్పందించి పూర్తి వివరాలతో హాజరుకావాలని తహసీల్దారుకు నోటీసులు జారీ చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. రూ.వందల కోట్ల విలువైన భూముల విషయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఒంగోలుకు చెందిన న్యాయవాది ఎం.సుధీర్‌కుమార్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. అందులో 12 సర్వేనంబర్లను ప్రస్తావించారు. లంచాలు తీసుకుని రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని, నకిలీ పట్టాలు సృష్టించి అక్రమార్కులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గతంలో పనిచేసిన ఒక కలెక్టర్‌, నలుగురు తహసీల్దార్లు, ఒక ఆర్‌ఐ ప్రమేయమున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ భూములకు సంబంధించిన అన్ని పత్రాలతో ఈ నెల తొమ్మిదో తేదీలోగా నెల్లూరులోని తమ కార్యాలయానికి రావాలని ఒంగోలు తహసీల్దారుకు సీఐడీ అదనపు డీజీ నోటీసులిచ్చారు. ఇక్కడి భూదందాల్లో వైయస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన కొందరితోపాటు, ఓ మాజీ మంత్రి, ఆయన కుమారుడు, ఒక ఎంపీపీ భర్త, బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు ప్రాంతానికి చెందిన కొందరి ప్రమేయమున్నట్లు ఆరోపణలున్నాయి. తహసీల్దార్‌కు నోటీసులిచ్చిన విషయాన్ని సీఐడీ నెల్లూరు డీఎస్పీ కె.వేణుగోపాల్‌ ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని