విషమ పరీక్ష

రాష్ట్రంలో బోధనాసుపత్రుల స్థాయిని బట్టి ఇన్‌పేషెంట్‌, అవుట్‌ పేషెంట్లు కలిపి రోజూ 2-3 వేల మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రుల్లోనూ రద్దీ ఎక్కువగానే ఉంటోంది.

Updated : 07 Dec 2022 05:40 IST

సర్కారీ ఆసుపత్రుల్లో అరకొర సేవలే
వేధిస్తున్న పరికరాలు, రసాయనాల కొరత
చాలాచోట్ల రోగులకు ప్రైవేట్‌ ల్యాబులే దిక్కు
పేదలపై ఆర్థిక భారం
రాష్ట్రవ్యాప్తంగా ‘ఈనాడు’ పరిశీలన
ఈనాడు-అమరావతి, యంత్రాంగం

రాష్ట్రంలో బోధనాసుపత్రుల స్థాయిని బట్టి ఇన్‌పేషెంట్‌, అవుట్‌ పేషెంట్లు కలిపి రోజూ 2-3 వేల మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రుల్లోనూ రద్దీ ఎక్కువగానే ఉంటోంది. ఉచిత చికిత్స అందుతుందని ఇక్కడికి వచ్చే పేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. ల్యాబ్‌లలో కిట్ల కొరత, పాడైన పరికరాలకు మరమ్మతులు చేయకపోవడం, కొత్తగా వచ్చినవి వాడకపోవడం వల్ల రోగులు పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో వైద్యులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే మందులు రాసిచ్చి సరిపెడుతున్నారు. అనివార్యమైనప్పుడు బయట చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. రాష్ట్రంలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరును ‘ఈనాడు’ ప్రతినిధులు నవంబరు 20-30 తేదీల మధ్య పరిశీలించగా, పలుచోట్ల నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. థైరాయిడ్‌, మూత్రపిండాలు, కాలేయం పనితీరు పరీక్షలు, అల్ట్రా సౌండ్‌, సీటీ స్కాన్‌ వంటివి అరకొరగా అందుతున్నట్లు వెల్లడైంది. వీటికి రూ.300 నుంచి రూ.2,000 వరకు రోగులపై భారం పడుతోంది. ఆసుపత్రుల్లో ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయి, ఏవి లేవన్న సమాచారం తెలియడం లేదు.


ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం. ఖాళీలను భర్తీ చేస్తాం. సౌకర్యాలు సమకూరుస్తున్నాం.

2021 జూన్‌ 21న వైద్యారోగ్యశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌


అనంతపురంలో ఇన్‌పేషంట్ల తిప్పలు

అనంతపురం జీజీహెచ్‌లో థైరాయిడ్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌, సీరం క్రియాటినైన్‌, కాల్షియం స్థాయిలను పరీక్షించే పరికరాలు నెలలుగా పనిచేయడంలేదు. ఇందులో నాలుగు సెమీ ఆటో ఎనలైజర్లు ఉన్నాయి. పరీక్షల ఖర్చును ప్రభుత్వమే భరిస్తున్నా, ఇన్‌పేషెంట్లు, కదల్లేని స్థితిలో ఉన్నవారు ప్రైవేట్‌ ల్యాబ్‌లకు రెండు మూడుసార్లు వెళ్లిరావడానికి అవస్థలు పడుతున్నారు. ‘అల్ట్రాసౌండ్‌’ అవసరమైన గర్భిణులకు ప్రైవేట్‌ ల్యాబ్‌లో చేయించుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. వీరిపై రవాణా ఖర్చుల భారం పడుతోంది. దీనిపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌ మాట్లాడుతూ కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలకు మాత్రమే రోగులను బయటకు పంపుతున్నామని, సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. మంగళవారం కొన్ని యంత్రాలు వచ్చాయని, వీటిని వాడకంలోకి తెస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు.

పనిచేయని యంత్రాలు

కాకినాడ జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐని ఏడాదిన్నరగా పక్కన పెట్టారు. పిల్లల ఐసీయూ వార్డులోని వెంటిలేటర్లు, ఫొటోథెరపీ పరికరాలు, వార్మర్లలో కొన్ని పనిచేయడంలేదు. ఒంగోలులో గ్యాస్ట్రోస్కోపీ యంత్రం ఉన్నా వైద్యులు, సాంకేతిక సిబ్బంది లేకపోవడంతో వాడకంలో లేదు. అల్సర్ల గుర్తింపునకు రోగులు ఎండోస్కోపీకి రూ.1,000 వరకు వెచ్చిస్తున్నారు. తిరుపతిలోని రుయా-అత్యవసర విభాగం, ప్రసూతి, చిన్నపిల్లల విభాగాల్లో 8 అల్ట్రాసౌండ్‌ యంత్రాల్లో రెండు పనిచేయడంలేదు. శ్రీకాకుళం జీజీహెచ్‌లో ఎలక్ట్రోలైట్‌ మెషిన్‌, బయోకెమిస్ట్రీ ఎనలైజర్లదీ అదే పరిస్థితి. ఇక్కడున్న మూడు లిఫ్టులూ పనిచేయనందున రోగులు వార్డులు, ల్యాబ్స్‌కు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. దీనిపై సూపరింటెండెంట్‌ స్వామినాయుడు మాట్లాడుతూ సమస్యలపై ఏజెన్సీల వారికి చెప్పామని, త్వరలో పరిష్కారమవుతాయని తెలిపారు. నెల్లూరు జీజీహెచ్‌లో థైరాయిడ్‌ పరీక్షలు జరగడంలేదు. డీ-డైమర్‌ కొవిడ్‌ రెండో దశ నుంచి ఆపేశారు. ఈ విషయమై సూపరింటెండెంట్‌ సిద్ధానాయక్‌ స్పందిస్తూ త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చేలా చూస్తామన్నారు.

జిల్లా ఆసుపత్రుల్లోనూ అంతే!

రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో రేడియాలజిస్టుల కొరతతో అల్ట్రాసౌండ్‌, 2డీ ఎకో చేయడంలేదు. నెల రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని సూపరింటెండెంట్‌ రమేష్‌ తెలిపారు. తణుకులో అల్ట్రా స్కానింగ్‌ యంత్రాలు ఉన్నా, రేడియోలజిస్ట్‌ లేక రోగులు ప్రైవేట్‌ ల్యాబ్స్‌కు వెళ్తున్నారు. అనకాపల్లిలో సీటీస్కాన్‌ యంత్రం రెండేళ్లుగా పనిచేయడంలేదు. ఈ పరీక్ష అవసరమైన ఇన్‌పేషెంట్లను కేజీహెచ్‌కు పంపిస్తున్నారు. మచిలీపట్నంలో దాతలిచ్చిన డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రం అలంకారప్రాయంగా ఉంది. చిత్తూరులో థైరాయిడ్‌ పరీక్షల యంత్రాన్ని అమర్చనందున ఒక్కో రోగిపై రూ.500 వరకు భారం పడుతోంది. మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఎక్స్‌రే విభాగంలో 300 ఎంఏహెచ్‌ యంత్రం నిరుపయోగంగా ఉంది. రూ.కోటి విలువ చేసే పరికరాలతో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ను ఏర్పాటుచేసినా ప్రారంభించలేదు. వైరల్‌ పరీక్షల నమూనాలను తిరుపతి వైరాలజీ ల్యాబ్‌కు పంపుతున్నారు. ఇక్కడి రక్తనిధి కేంద్రంలో రక్తం నుంచి సెల్స్‌ వేరుచేసే యంత్రం లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు.

కీలక రక్తపరీక్షలు అయినా..

* విజయవాడ జీజీహెచ్‌లో లివర్‌ ప్రొఫైల్‌, రక్తంలోని యూరియా శాతాన్ని గుర్తించే పరీక్షలు, మధుమేహ బాధితులకు చేసే హెచ్‌బీఏ1సీ, థైరాయిడ్‌ పరీక్షలు రోగుల అవసరాలకు తగ్గట్లు జరగడంలేదు. గుండె జబ్బుల బాధితులకు నిర్వహించే ట్రోపోనిన్‌-ఐ పరీక్షలనూ ఆపేశారు. ఒంగోలు, కర్నూలులో థైరాయిడ్‌ టెస్ట్‌కు రసాయనాల కొరత ఉంది.

* విజయవాడ ప్రసూతి ఆసుపత్రిలో థైరాయిడ్‌, బ్లడ్‌ గ్రూపింగ్‌, హెచ్‌ఐవీ, హెచ్‌బీ పర్సంటేజీ, జాండిస్‌, లివర్‌ ఫంక్షన్‌, యూరిన్‌, ఈఎస్‌ఆర్‌ పరీక్షలు చేయడం లేదు. కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరులోని బాధితులు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది.

* తిరుపతి రుయాలో కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు అరకొరగా చేస్తున్నారు. ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ పరీక్ష జరగడంలేదు. ఎస్వీ వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకట్‌ మాట్లాడుతూ కిట్ల కొరతతో నిర్వహణలో సమస్యలొస్తున్నాయని, జిల్లా కలెక్టర్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

* మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో థైరాయిడ్‌, ఎలక్ట్రోలైట్స్‌ పరీక్షలు చేయడంలేదు. కాలేయానికి సంబంధించి రెండు మాత్రమే చేస్తున్నారు. ఏలూరులో నిపుణులు, కిట్లు లేకపోవడంతో శరీరంలో గడ్డల ప్రభావాన్ని గుర్తించలేకపోతున్నారు. హెపటైటిస్‌-బీ చేయడం లేదు. తణుకులో ఆటో ఎనలైజర్‌ లేక కిడ్నీ, లివర్‌, థైరాయిడ్‌ పరీక్షలు ఆగిపోయాయి.


సమస్యకు మూలాలేంటి?

* ఆసుపత్రుల్లో పరీక్షల నిర్వహణ, ఫలితాల విశ్లేషణ, రికార్డుల నిర్వహణను పరిశీలించే వ్యవస్థ అచేతనంగా ఉండటం.

* ఆరోగ్యశ్రీ కేసుల ద్వారా వచ్చే నిధులకు భారీ కోత, ల్యాబ్‌లలో అవసరమైన రసాయనాలు, ఇతరాలకు సకాలంలో బిల్లులు రాకపోవడం. నిధుల్లేవంటూ సూపరింటెండెంట్లు చేతులెత్తేయడం.

* యంత్రాలు, పరికరాలు చాలాచోట్ల పడకేశాయి. మరమ్మతుల కోసం ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం ఎంపికచేసిన సంస్థ ఈ మధ్యే వాటి వివరాల సేకరణ ప్రారంభించింది.


ఎవరెవరికి ఎలాంటి పరీక్షలంటే?

* ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న మహిళల్లో 30-40% మందికి థైరాయిడ్‌ పరీక్షలు అవసరం. ఇటీవల పురుషులకూ ఎక్కువగానే చేయాల్సి వస్తోంది.

* పక్షవాతం, గుండెపోటుతో వచ్చేవారికి లిపిడ్‌ ప్రొఫైల్‌, ఈసీజీ, 2డీ ఎకో చేస్తారు.

* దీర్ఘకాల మధుమేహ బాధితులకు మూత్రపిండాలు, కాలేయ పరీక్షలు (రీనల్‌ ఫంక్షన్‌ టెస్టు- క్రియాటినైన్‌, ఎలక్ట్రోలైట్‌, బ్లడ్‌ యూరియా) చేస్తారు.

* ఎంఆర్‌ఐతో పూర్తి శరీరం, పొత్తికడుపు, ఛాతీ, ఎముకలను పరీక్షిస్తారు.

* కడుపులో అల్సర్లను గుర్తించడానికి ఎండోస్కోపీ అవసరం.


కడపలో ప్రైవేట్‌ ల్యాబ్‌లే దిక్కు

సీఎం జగన్‌ సొంత జిల్లా వైయస్‌ఆర్‌ లోని జీజీహెచ్‌లో ప్రైవేట్‌ ల్యాబ్‌ నిర్వాహకులు మకాంవేశారు. ఫోన్‌ చేస్తే నిమిషాల్లో రోగుల వద్ద ప్రత్యక్షమవుతున్నారు. వీరి సెల్‌నంబర్లు ప్రధాన వార్డుల్లో ప్రదర్శిస్తున్నారు. వారు థైరాయిడ్‌కు రూ.400, హెచ్‌బీఏ1సీ పరీక్షకు రూ.500, ఆర్‌బీఎస్‌కు రూ.300, ఎల్‌ఎఫ్‌టీకి రూ.600 చొప్పున వసూలు చేస్తున్నారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావును ప్రశ్నిస్తే ప్రైవేట్‌ ల్యాబ్‌ల వ్యక్తులు వార్డుల్లోకి రాకుండా చూడాలని ఆదేశాలిస్తామని తెలిపారు.


నెరవేరని మంత్రి హామీ

విశాఖ కేజీహెచ్‌లో ఎంఆర్‌ఐ యంత్రం తొమ్మిది నెలలుగా పని చేయడంలేదు. ప్రైవేటుగా చేయించుకుంటే వ్యాధి తీవ్రతను బట్టి ఒక్కో రోగికి రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చవుతుంది. ఆరోగ్యశ్రీ వర్తించే వారికి ప్రైవేట్‌ ల్యాబ్‌లో ఉచితంగా చేయిస్తున్నప్పటికీ, ఇతరులపై భారం పడుతోంది. ఎంఆర్‌ఐ యంత్రాన్ని బాగు చేయిస్తామని విశాఖ జిల్లాకు ఇన్‌ఛార్జిగా కూడా ఉన్న వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఇచ్చిన హామీ ఆచరణలోకి రాలేదు.


సమస్యలు పరిష్కరిస్తాం

వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరుపై మరో వారంలో నిశితంగా పరిశీలించి, గుర్తించిన లోపాలను అధిగమిస్తాం. అనకాపల్లి నుంచి అదనపు బడ్జెట్‌ కోసం విజ్ఞప్తులు రాగా, ప్రభుత్వ అనుమతులు రాగానే నిధులు కేటాయించాం. ఇందులో రియజెంట్స్‌ వంటి పదార్థాల కొనుగోలుకు కేటాయించిన నిధులూ ఉన్నాయి. జేసీల ఆధ్వర్యంలోని జిల్లా కొనుగోళ్ల కమిటీలు ఆసుపత్రుల్లో అవసరమైన రియజెంట్స్‌, రసాయనాలను స్థానికంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో సమస్యలుంటే పరిష్కరిస్తాం. విశాఖ కేజీహెచ్‌, కాకినాడ జీజీహెచ్‌లో కొత్తగా ఎంఆర్‌ఐలు పెట్టేందుకు టెండర్లు పిలిచాం.

- డాక్టర్‌ వినోద్‌కుమార్‌
కమిషనర్‌, వైద్య విధాన పరిషత్‌, ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని