భూ సమస్యపై రైతు వినూత్న నిరసన

తన భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా కంభం ప్రాంతానికి చెందిన ఓ రైతు మార్కాపురం ఉప కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం వినూత్నంగా నిరసన చేపట్టారు.

Published : 31 Jan 2023 03:15 IST

మార్కాపురం, న్యూస్‌టుడే: తన భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా కంభం ప్రాంతానికి చెందిన ఓ రైతు మార్కాపురం ఉప కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. ‘స్పందన’ కార్యక్రమంలో వినతి అందజేశారు. రైతు ఉప్పులదిన్నె రమేష్‌.. బేస్తవారపేట ఇలాకాలోని చింతలపాలెంలో 0.86 సెంట్ల ఎసైన్‌మెంట్‌ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. గత మూడు దశాబ్దాలుగా పంటలు సాగుచేస్తున్నారు. అవగాహన లేక ఆ భూమిని తన పేరిట మార్పిడి చేసుకోలేదు. ఆ భూమి ప్రభుత్వానిదంటూ అధికారులు ఇటీవల చెప్పడంతో విస్తుపోయాడు. తనదేనని, సాగు చేసుకొని జీవిస్తున్నానని రైతు చెప్పినా పట్టించుకోలేదు. అరటి తోట, భారీ వేపచెట్లను యంత్రాలతో తొలగించేశారు. అదే సమయంలో వైకాపా నాయకులు ఆ పొలంలోని మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మట్టిపై కన్నేసిన నేతలే అధికారుల ద్వారా పంటను ధ్వంసం చేయించారని రమేష్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పంటను తొలగించిన దృశ్యాలు, అధికారుల పరిశీలన, నేతల మట్టి దందా, సమస్యపై గతంలో కలెక్టర్‌కు వినతి ఇచ్చిన ఫొటోలను ఫ్లెక్సీలో ముద్రించి ఇలా నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని