ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ను నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీచేసింది.

Published : 13 Feb 2023 04:41 IST

బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ
13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
ఇందులో ఆరుగురు తొలిసారి నియామకం
ఏడుగురికి స్థానచలనం
ఈనాడు - దిల్లీ

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ను నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీచేసింది. మొత్తం 13 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఇందులో ఆరుగురు కొత్తవారు. ఏడుగురు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయ్యారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 1958 జనవరి 5న కర్ణాటకలోని మూడబిదరి తాలూకా బెలువాయిలో జన్మించారు. బాల్యం అంతా మూడబిదరిలోనే సాగింది. అక్కడి మహావీర కళాశాలలో బీకాం చేసిన ఆయన, మంగళూరు కొడియాల్‌బెయిల్‌ ఎస్‌డీఎం లా కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్‌ 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి నాలుగో తేదీ వరకు సర్వోన్నత న్యాయస్థానంలో సేవలందించారు.

కీలక ధర్మాసనాల్లో సభ్యుడిగా..

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా త్రిపుల్‌ తలాక్‌, రామ జన్మభూమి, పెద్దనోట్ల రద్దు వంటి ప్రాధాన్యమున్న కేసులను విచారించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ సభ్యుడు. త్రిపుల్‌ తలాక్‌ కేసును విచారించిన అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు ఆ విధానాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొంటూ 2017 ఆగస్టు 22న తీర్పునివ్వగా, ధర్మాసనానికి నేతృత్వం వహించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌, జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ త్రిపుల్‌ తలాక్‌ విధానాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. అందుకు ముస్లిం షరియా చట్టంలో అనుమతి ఉందని పేర్కొన్నారు. 2019లో రామ జన్మభూమి కేసును విచారించిన అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ నజీర్‌ వివాదస్పద స్థలంలో హిందూ మత సంప్రదాయాన్ని అనుసరించిన నిర్మాణం ఉండేదని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇచ్చిన నివేదికను సమర్థిస్తూ రామ మందిరానికి అనుకూలంగా ధర్మాసనం ఏకగీవ్రంగా ఇచ్చిన తీర్పుతో ఏకీభవించారు. దాంతో సుదీర్ఘకాలంగా సాగుతూ వచ్చిన ఆ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం 5-0 న్యాయమూర్తుల మద్దతుతో తెరదించింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పులేదని ఈ ఏడాది జనవరి 2న 4:1 నిష్పత్తితో తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వం వహించారు. నాటి ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌లు పెద్దనోట్లను రద్దుచేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పగా, జస్టిస్‌ బి.వి.నాగరత్న మాత్రం భిన్నమైన తీర్పు ఇచ్చారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సరళతకు మారుపేరని ఆయన పదవీ విరమణ రోజు జరిగిన వీడ్కోలు సమావేశంలో ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. 2019 వరకు ఆయనకు కనీసం పాస్‌పోర్టుకూడా లేదని, అధికారిక కార్యక్రమం నిమిత్తం సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో తొలి విదేశీ పర్యటన కింద మాస్కోకు వెళ్లారని గుర్తుచేశారు. ఆయన అన్ని విషయాల్లో అత్యంత సరళంగా ఉంటారని, ఇటీవలి వరకు ఆయనకున్న గుర్తింపు కార్డులు డ్రైవింగ్‌ లైసెన్సు, జడ్జి ఐడీ మాత్రమేనని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆరేళ్ల కాలంలో ఆయన 93 తీర్పులు ఇచ్చారు. వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని జస్టిస్‌ కె.ఎస్‌.పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 2017లో తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగీవ్రంగా ఇచ్చిన తీర్పులోనూ జస్టిస్‌ నజీర్‌ సభ్యుడిగా ఉన్నారు. ఆధార్‌ చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూపిటిషన్‌ 4:1 నిష్పత్తితో కొట్టేసిన అయిదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం చేసిన సామాజిక, ఆర్థిక వెనుకబడిన తరగతుల చట్టం-2018 సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% రిజర్వేషన్ల పరిమితికి విరుద్ధంగా ఉందంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ జస్టిస్‌ నజీర్‌ సభ్యుడిగా ఉన్నారు. ఒక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీగా గుర్తింపు పొందినవారు మరో రాష్ట్రంలో ఆ వర్గాల కింద రిజర్వేషన్లు పొందలేరని బీర్‌సింగ్‌ వర్సెస్‌ దిల్లీ జల్‌బోర్డు కేసులో 4:1మెజార్టీతో తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ప్రభుత్వ అధికారుల భావప్రకటనా స్వేచ్ఛను ఇతర ప్రాథమిక హక్కుల ద్వారా నియంత్రించలేరని జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కౌశల్‌ కిశోర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యూపీ కేసులో 4:1 మెజార్టీతో జనవరి 3న ఆయన పదవీవిరమణ చేయడానికి ఒక రోజు ముందు తీర్పునిచ్చింది.

గవర్నర్‌గా నియమితులైన రెండో న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన అనంతరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న రెండో వ్యక్తిగా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నిలువనున్నారు. ఈ తొలిరికార్డు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి తమిళనాడుకు చెందిన జస్టిస్‌ పి.సదాశివంకి దక్కుతుంది. ఆయన 2014 ఏప్రిల్‌ 26న పదవీ విరమణ చేయగా 2014 సెప్టెంబర్‌ 5న కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినవారు గవర్నర్‌గా నియమితులవడం అదే తొలిసారి. నరేంద్రమోదీ ప్రభుత్వం జరిపిన తొలి గవర్నర్‌ నియామకం కూడా అదే. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు దక్కింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌కోశ్యారి, లద్దాఖ్‌ లెఫ్టినెంటర్‌ గవర్నర్‌ ఆర్‌.కె.మాథుర్‌లు పదవులకు రాజీనామా చేయగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు