Sajjala Ramakrishna reddy: ఆ రోజు అవినాష్‌ ఇంట్లో సునీల్‌ లేరు

‘వివేకానందరెడ్డి హత్యకు ముందు సునీల్‌ యాదవ్‌ అవినాష్‌ రెడ్డి ఇంట్లో ఉన్నారనేది అబద్ధం. అందుకు పక్కా ఆధారాలే ఉంటే గతంలో రెండు సిట్‌ల విచారణలో బయటకొచ్చేది కదా?’

Updated : 25 Feb 2023 08:23 IST

శివశంకర్‌రెడ్డి మా పార్టీ కార్యదర్శి
ఆయన కోసం అవినాష్‌ వెళితే తప్పా?
వివేకా రెండో పెళ్లి, కుటుంబకలహాల కోణంలో  సీబీఐ ఎందుకు చూడట్లేదు?
చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలపై విచారించరేం?

ఈనాడు, అమరావతి: ‘వివేకానందరెడ్డి హత్యకు ముందు సునీల్‌ యాదవ్‌ అవినాష్‌ రెడ్డి ఇంట్లో ఉన్నారనేది అబద్ధం. అందుకు పక్కా ఆధారాలే ఉంటే గతంలో రెండు సిట్‌ల విచారణలో బయటకొచ్చేది కదా?’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘గూగుల్‌ టేకౌట్‌ అంటూ చంద్రబాబు కొత్తగా మాట్లాడుతున్నారు. భౌగోళికంగా చూస్తే సీఎం జగన్‌ (వైఎస్‌ రాజశేఖరరెడ్డి), వైఎస్‌ వివేకానందరెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డిల ఇళ్లు దగ్గర దగ్గరనే సుమారు 50- 100 మీటర్ల దూరంలోనే ఉంటాయి. గూగుల్‌ టేకౌట్‌లో ఏం చూపిస్తుందో తెలియదు. అతను (సునీల్‌) ఎక్కడున్నాడో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం సజ్జల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ‘సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో అసలు విషయాలను వదిలేసి వారు (సీబీఐ) విచారించిన వారి వాంగ్మూలాలను మార్చి కేసును ఒకవైపుగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐలోని కిందిస్థాయి అధికారులు ఇదే పనిగా పెట్టుకున్నారు. అవినాష్‌ వైపే మొత్తమంతా ఎందుకు చూపిస్తున్నారు? వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు అవినాష్‌రెడ్డే తనకు  చెప్పారని శశికళ అనే మహిళ వెల్లడించినట్లు సీబీఐ పేర్కొంది. కానీ, తానలా చెప్పనే లేదని ఆమే ఖండించారు. వివేకా హత్యపై రెండు సిట్‌ల విచారణ నివేదికలను సీబీఐ ఎందుకు బయటపెట్టడం లేదు? వాటిని పట్టించుకోకుండా మరో దారిలో ఎందుకు వెళుతోంది? అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వివేకాను వైకాపా అభ్యర్థిగా ఎంపిక చేసిన సమావేశంలో శివశంకర్‌రెడ్డి కూడా ఉన్నారు. కానీ ఆ టికెట్‌ విషయంలోనే శివశంకర్‌రెడ్డి, భాస్కరరెడ్డి వివేకాపై కక్ష పెంచుకున్నారని సీబీఐ పేర్కొంది. మా పార్టీ కార్యదర్శి అయిన శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేస్తే ఎంపీగా అవినాష్‌ ఆయన వద్దకు వెళ్లడం తప్పా? వివేకా రెండో పెళ్లి చేసుకున్నారని, ఆ విషయంలో ఆయన్ను కుటుంబమంతా పక్కన పెట్టిందన్న విషయాన్నీ సీబీఐ చూడాలి కదా? వివేకా బావ శివప్రకాష్‌రెడ్డే తనకు ఫోన్‌ చేసి బావ గుండెపోటుతో చనిపోయాడని చెప్పారని ఆదినారాయణరెడ్డి సీబీఐని కలిసిన తర్వాత వెల్లడించలేదా? దాన్ని పరిగణనలోకి తీసుకోలేదేం? హత్య జరిగిన సమయంలో చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలపై సీబీఐ ఎందుకు విచారించదు? ఇక్కడ (వివేకా ఇంట్లో) ఓ లేఖ ఉందని ఆయన పీఏ కృష్ణారెడ్డి వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డికి ఫోన్‌ చేసి చెబితే.. ఆ లేఖ బయటపెట్టొద్దు, ఫోన్‌ కూడా ఎవరికీ ఇవ్వద్దు. మేం వచ్చేవరకు వాటిని దాచిపెట్టాలని చెప్పలేదా? తర్వాత ఆ ఫోన్‌లో సందేశాలను డిలీట్‌ చేసి విచారణాధికారులకు ఎందుకిచ్చారు? వివేకా హత్య జరిగినప్పుడు అవినాష్‌ జగన్‌ ఇంటికి ఫోన్‌ చేశారన్న విషయం చంద్రబాబు హయాంలోని సిట్‌ విచారణలో ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడే ఎందుకొచ్చింది? కల్పిత కథనాలు సిద్ధం చేసి, వాటి ఆధారంగానే ఎంపీ అవినాష్‌ను అరెస్టు చేస్తామంటే అంత కంటే ఘోరం మరోటి ఉండదు’ అని అన్నారు.

సీబీఐ తీరుపై కేంద్రం దృష్టికి

సీబీఐ విచారణ సరిగా జరగడం లేదనుకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేయొచ్చు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. సజ్జల స్పందిస్తూ ‘సరైన సమయంలో సరైన పద్ధతిలో చేస్తాం. విచారణకు పిలిచినప్పుడు వచ్చినవారు చెప్పిందీ చెప్పనిదీ కూడా సీబీఐ రిపోర్ట్‌ చేస్తోంది. అదే మీడియాలో వస్తోంది. వివేకా కేసులో సీబీఐ విచారణపై చంద్రబాబు ప్రభావం కచ్చితంగా ఉంది. చంద్రబాబు కోరుకుంటున్న దారిలో సీబీఐ విచారణను తోయడమే పనిగా ఆ సంస్థలోని కింది స్థాయి అధికారులు చేస్తున్నారని విస్పష్టంగా కనిపిస్తోంది. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’ అని జవాబిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని