వాహనాల ద్వారా... రేషన్‌ పంపిణీ సరిగా లేదు

వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ... క్షేత్రస్థాయిలో సరిగా జరగడం లేదని వైకాపా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు.

Updated : 24 Mar 2023 05:56 IST

బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవడంలో విఫలం
తూనికలు, కొలతల శాఖ ఎక్కడుంది?
శాసనసభలో వైకాపా ఎమ్మెల్యేలు మహీధర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి

ఈనాడు, అమరావతి: వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ... క్షేత్రస్థాయిలో సరిగా జరగడం లేదని వైకాపా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. ‘ఒక్కో వాహనంపై నెలకు రూ.18 వేలకు పైగా ఖర్చు పెడుతున్నాం. అన్నింటినీ కేంద్రీయ వ్యవస్థ ద్వారా సీసీ కెమెరాలతో అనుసంధానించామంటున్నా.. తగినంత సిబ్బంది లేని కారణంగా పంపిణీ సరిగా జరగడం లేదు. దీన్ని సరిచూసుకోవాలి. రాష్ట్రంలో శాశ్వత చౌక దుకాణ డీలర్లు తక్కువ మంది ఉన్నారు. ఖాళీల్ని వెంటనే భర్తీ చేయాలి’ అని సూచించారు. ‘రేషన్‌ బియ్యం తరలింపుదారులపై కఠిన చర్యలకు విధి విధానాల్లేవు. ఈ వ్యవస్థను అడ్డుకోవడంలో విఫలం అవుతున్నాం. 100% కఠిన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయాల్సిన అవసరాన్ని పరిశీలించాలి’ అని కోరారు. ‘మండల, జిల్లా స్థాయి ఆహార సమీక్ష సమావేశాలు జరగడం లేదు. అడిగేవారు లేరనే ధోరణి ప్రబలక ముందే వాటిని పునరుద్ధరించాలి. మండలానికి ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దారు ఉండేలా చూడాలి’ అని మహీధర్‌రెడ్డి సూచించారు.

అక్రమార్కుల్ని చూస్తే హడల్‌

‘15 ఏళ్ల కిందట తూనికలు, కొలతలశాఖ అంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఇప్పుడు అక్రమార్కుల్ని చూస్తే ఆ శాఖ గుండెల్లోనే రైళ్లు పరిగెత్తుతున్నాయనే భావన ప్రజల్లో ఉంది’ అని మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘తూనికలు, కొలతల శాఖ ఎక్కడుందో... తెలియడం లేదు, పెట్రోలు బంకుల్లో తక్కువ పరిమాణంలో ఇంధనం వస్తోంది. దీనిపై ఫిర్యాదు చేయాలన్నా అధికారులు ఎక్కడుంటారో తెలియదు. ఈ శాఖ ఉన్నట్లు సగం మందికి తెలియదు’ అని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. ‘సస్పెండ్‌ అయిన చౌకదుకాణ డీలర్లు... హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి? వారిని ఎలా తొలగించాలనే విషయాన్ని పరిశీలించాలి’ అని కోరారు.

గడప గడపలో ఈ సమస్యలే అధికం

‘గడప గడప కార్యక్రమంలో ఎక్కువగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సమస్యలే వస్తున్నాయి. పిల్లల పేర్లను రేషన్‌ కార్డుల్లో చేర్చడం లేదు. చేర్పులు, తొలగింపుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి నిర్దేశిత సమయం పెట్టి పరిష్కరించాలి’ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ‘వివిధ కారణాలతో రాజీనామా చేసిన మొబైల్‌ వాహన ఆపరేటర్లకు వారు చెల్లించిన డిపాజిట్‌ను వెనక్కి ఇచ్చేలా చూడాలి. వడ్లను ఎక్కువ రోజులు నిల్వచేసి మర పట్టిస్తే బియ్యం నాణ్యత పెరుగుతుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి’ అని ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచించారు.

భయాన్ని తెచ్చాం...

రేషన్‌ పంపిణీలో అవకతవకలు జరగకుండా కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ చూస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వివరించారు. తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో వరుస దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం ద్వారా అక్రమార్కుల్లో భయాన్ని తెచ్చామని చెప్పారు. బడ్జెట్‌ పద్దులపై ఓటింగ్‌ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పెట్రోలు బంకులు, బంగారం దుకాణాలు, ఎరువుల దుకాణాలపై తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశామన్నారు. ‘చిరుధాన్యాల పంపిణీకి 10 వేల టన్నుల రాగులు, 5 వేల టన్నుల జొన్నలను సేకరిస్తున్నాం. కర్ణాటక నుంచి వీటిని కొనుగోలు చేసి కార్డుదారులకు ఇవ్వబోతున్నాం. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ గోధుమ పిండి పంపిణీ చేస్తాం’ అని తెలిపారు. న్యాయస్థానాల నుంచి స్టే తెచ్చుకుని కొనసాగుతున్న రేషన్‌ డీలర్ల విషయంలో జిల్లా యంత్రాంగం అచేతనంగా ఉంటోందని, దీనిపై ప్రభుత్వ న్యాయవాదులతో సమీక్షించాలని సభాపతి తమ్మినేని సీతారాం మంత్రికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని