రైతుల తలరాత ఇంతేనా?

పక్కపక్కనే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత తేడా? అక్కడి సీఎం కేసీఆర్‌ యుద్ధప్రాతిపదికన పొలాల్లోకి వెళ్లి రైతు కష్టాలను ఆలకించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Updated : 26 Mar 2023 06:59 IST

విపత్తు నష్టాలకు తొమ్మిదేళ్లుగా పెరగని పెట్టుబడి సాయం
అధిక శాతం పంటలకు పరిహారం ఎకరాకు రూ.6వేలే
తెలంగాణలో పంట నష్టాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌
దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటన
రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో నష్టం
అయినా పొలంబాట పట్టని సీఎం జగన్‌
ఈనాడు - అమరావతి

క్కపక్కనే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత తేడా? అక్కడి సీఎం కేసీఆర్‌ యుద్ధప్రాతిపదికన పొలాల్లోకి వెళ్లి రైతు కష్టాలను ఆలకించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలు తమకు 151 సీట్లు ఇచ్చారని, ఎవరూ తననేమీ చేయలేరంటూ చెప్పుకొనే జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రం రైతుల గోడు పట్టలేదు. దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ఒక్క పూట కూడా తీరిక చిక్కలేదు. వడగళ్ల వానలతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 22 జిల్లాల్లో లక్షల మంది రైతులు భారీగా నష్టపోయినా ప్రభుత్వంలో చలనం లేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు నిండుతున్నా.. పెట్టుబడి సాయం పెంచాలనే ఆలోచనా రాదు. దెబ్బతిన్న రైతులను పరామర్శించాలన్న ఆలోచనా ఉండదు..


రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లు, భారీ వర్షాలకు మూడు లక్షలకు పైగా ఎకరాల్లో పంటలకు భారీ నష్టం జరిగింది. రూ.లక్షల్లో నష్టపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పొలం గట్టు తొక్కలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా.. తీరిక చేసుకుని మరీ ‘దిల్లీ’కి వెళ్లొచ్చారు. 19న ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో విద్యాదీవెన నిధుల విడుదలకు వెళ్లారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో ఆసరా కార్యక్రమంలో పాల్గొనేందుకూ వీలు దొరికింది. వడగళ్ల వానలతో సర్వం కోల్పోయిన రైతుల్ని పలకరించి.. భరోసా ఇవ్వడానికి మాత్రం తీరిక దొరకలేదు. అకాల వర్షాలపై సీఎం సమీక్షించారంటూ ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులిపేసుకుంది.


తెలంగాణలో వడగళ్ల వానలతో 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా నాలుగు జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయశాఖ కార్యదర్శి తదితర ఉన్నతస్థాయి బృందంతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సహా బస్సులో పొలాల్లోకి వెళ్లారు. కేంద్రంతో పనిలేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తుందంటూ రైతుకు భరోసా ఇచ్చారు. తొలిసారిగా కౌలు రైతుకు కూడా సాయం చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఉత్తర్వులూ విడుదలయ్యాయి.

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పొలాల్లోకి వెళ్లి రైతులకు భరోసా ఇస్తే.. మన సీఎం జగన్‌కు మాత్రం అన్నదాతల గోడు చెవికెక్కడం లేదు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన తీవ్ర నష్టంతో ఒక్క రోజులోనే రైతుల తలరాతలు మారిపోయినా.. వారంలో పంట అమ్ముతామంటూ వ్యాపారులతో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలతో చేసుకున్న ఒప్పందాలూ ఈదురుగాలులు, భారీ వర్షాల్లో కొట్టుకుపోయినా.. ప్రభుత్వ పెద్దల మనసు కరగలేదు. క్వింటాలు మిరప రూ.25 వేలు పలుకుతున్న తరుణంలో ప్రతి కాయనూ బంగారంలా కాపాడుకుంటున్న కర్షకులకు కన్నీరే మిగిలినా.. సీఎం కంటికి కనిపించడం లేదు. తెచ్చిన అప్పులు తీర్చేదెలాగో అర్థ్ధంకాక రైతు కుటుంబాలు మానసికంగా నలిగిపోతున్నా ఆయన మనసు చలించడం లేదు. కొన్నేళ్లుగా సాగు వ్యయం భారీగా పెరిగినా పెట్టుబడి రాయితీ పెంచలేదు. గత ప్రభుత్వం తిత్లీ తుపాను వేళ పెంచిన పెట్టుబడి రాయితీని ఇప్పుడు మరింత తగ్గించారు. తొమ్మిదేళ్ల కిందట నిర్ణయించిన పెట్టుబడి సాయాన్నే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. తెలంగాణలో అన్ని రకాల పంట నష్టానికి ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తామని, కౌలు రైతులకూ సాయం అందిస్తామని అక్కడి సీఎం కేసీఆర్‌ ప్రకటించినా.. అంతకంటే ఎక్కువ పంట నష్టం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అన్నదాతకు అండగా నిలవాలనే ఆలోచన కొరవడింది. రకరకాల నిబంధనలతోపాటు.. 33% పంట నష్టం ఉండాలంటూ నమోదుకు సతాయిస్తున్నారు.

ఎకరా వరికి నాడు రూ.8వేలు సాయం.. ఇప్పుడు రూ.6వేలే

అయిదేళ్ల కిందటి తిత్లీ తుపాను వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం వరికి ఎకరాకు రూ.8వేలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం దాన్ని రూ.2 వేలు తగ్గించి రూ.6 వేలే ఇస్తోంది. అప్పటి ప్రభుత్వం అరటికి ఎకరాకు రూ.12 వేలు ఇవ్వగా.. ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం పెంపుపై ప్రభుత్వానికి ఏ మాత్రం సానుభూతి లేదనడానికి ఇదే నిదర్శనం. విపత్తు నష్టాలకు 2014లో కేంద్రం నిర్ణయించిన సాయం చాలా తక్కువగా ఉండేది. దీంతో హుద్‌హుద్‌ సమయంలో తెదేపా ప్రభుత్వం పెట్టుబడి రాయితీని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచింది. తిత్లీ తుపాను వేళ మరింత పెంచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఎన్నికల హామీ మేరకు.. తిత్లీ సమయంలో దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు రూ.3 వేలు, జీడిమామిడికి రూ.20 వేల చొప్పున నిర్ణయించింది. తర్వాత 2014 నాటి ఉత్తర్వుల ప్రకారం తగ్గించే ఇస్తోంది. 

ఇచ్చేదే తక్కువ..

పెట్టుబడి రాయితీ పెంచకపోగా.. పంట నష్టం నమోదులోనూ రైతుల్ని సతాయిస్తున్నారు. మొక్కజొన్న వేళ్లతో సహా పడిపోతే నమోదు చేయొద్దని చెబుతున్నారు. మామిడి, నిమ్మ తదితర పంటలు కాపు రాలిపోయినా పరిగణనలోకి తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 33% పంట నష్టం ఉంటేనే నమోదు చేయాలనే నిబంధన రైతులకు శాపంలా మారింది. ఎకరాకు 11 బస్తాల ధాన్యం దిగుబడి తగ్గితేనే నమోదు చేయాలంటున్నారు. చిన్న, సన్నకారు రైతులకు పది బస్తాలు తగ్గినా కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఈ అంశాన్నీ ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

మాండౌస్‌ నష్టానికీ మొక్కుబడి సాయమే

గతేడాది డిసెంబరు రెండో వారంలో మాండౌస్‌ తుపాను కారణంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు సుమారు 16 జిల్లాల్లో వరితోపాటు ఇతర పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. సుమారు 4 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడి ఉంటుందని అంచనా. అంచనాలు పూర్తయ్యేసరికి ప్రభుత్వం.. 1.51 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు తేల్చింది. పెట్టుబడి రాయితీగా రూ.76.99 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అందులోనూ బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోనే 1.14 లక్షల ఎకరాలున్నాయి. అంటే మొత్తం పంటనష్టంలో ఈ రెండు జిల్లాల పరిధిలో 75% ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన  జిల్లాల్లో కలిపి 37 వేల ఎకరాలు దెబ్బతిన్నట్లు తేల్చారు. ఇప్పటికైనా పెరుగుతున్న పెట్టుబడులు, వాస్తవ పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని సాయం అందించేలా ప్రభుత్వం నిబంధనలు సడలిస్తేనే రైతుకు న్యాయం జరుగుతుంది. 


2014 ఫిబ్రవరి నాటికి కేంద్ర విపత్తు నిబంధనల ప్రకారం అధిక శాతం వ్యవసాయ పంటలు, పండ్ల, పూలతోటలకు పరిహారం ఎకరాకు రూ.4 వేలు మాత్రమే ఉండగా.. అప్పటి ప్రభుత్వం రూ.6 వేలకు పెంచింది. ఇప్పటికీ అదే సాయాన్ని కొనసాగిస్తున్నారు తప్ప..పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో పరిహారాన్ని మరింత పెంచి రైతుల్ని ఆదుకుందామనే ఆలోచన ఈ ప్రభుత్వంలో కొరవడింది. పొలం బాటే పట్టని ప్రభుత్వాధినేతలకు పెరిగిన పెట్టుబడులు, జరిగిన పంట నష్టం ఏం తెలుస్తుంది? కర్షకుల గోడు ఏం వినిపిస్తుంది


ఈదురుగాలులు, వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలు

వ్యవసాయ: వరి, మొక్కజొన్న, మినుము, సెనగ, పెసర, పొద్దుతిరుగుడు, నువ్వు, పొగాకు

ఉద్యాన: అరటి, బొప్పాయి, మామిడి, బత్తాయి, నిమ్మ తదితర పండ్ల తోటలు, మిరప, కూరగాయ పంటలు, పూలతోటలు
నష్టం అపారం

దెబ్బతిన్న విస్తీర్ణం: సుమారు 3 లక్షల ఎకరాలు (అంచనా)

పంట నష్టం: రూ.2 వేల కోట్లకు పైనే

ఎకరాకు నష్టం: వ్యవసాయ పంటలకు రూ.15 వేల నుంచి రూ.35 వేలు. ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష

* 10 నుంచి 15 ఏళ్ల వయసున్న మామిడితోపాటు బత్తాయి, నిమ్మ తదితర చెట్లూ వేళ్లతో సహా పడిపోయాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని