APSRTC: ఆర్టీసీ ఉద్యోగుల పాత పింఛను ఆశలు ఆవిరి

ప్రభుత్వంలో విలీనం కావడంతో తమకు ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగా పాత పింఛను అందుతుందని ఎదురుచూస్తున్న ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) సిబ్బంది ఆశలు ఆవిరిచేస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Updated : 21 Nov 2023 09:02 IST
ఆర్టీసీ ఉద్యోగులను.. సీపీఎస్‌లో చేరేందుకు ఆప్షన్‌ కోరిన యాజమాన్యం
వారంలో తెలపాలంటూ సర్క్యులర్‌ జారీ
మండిపడుతున్న సిబ్బంది
ఈనాడు, అమరావతి: ప్రభుత్వంలో విలీనం కావడంతో తమకు ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగా పాత పింఛను అందుతుందని ఎదురుచూస్తున్న ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) సిబ్బంది ఆశలు ఆవిరిచేస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీరికి అమల్లో ఉన్న ఈపీఎఫ్‌-95 పింఛనులో కొనసాగుతారా? కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌)లో చేరడం ద్వారా గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌) పొందుతారా? అనేది ఆప్షన్‌ ద్వారా తెలియజేయాలంటూ సోమవారం సర్క్యులర్‌ జారీచేసింది. అది కూడా ఈ నెల 27వ తేదీ నాటికి కేవలం వారంలోనే 51 వేల మంది ఉద్యోగులు ఆప్షన్‌ తెలపాలంటూ అందులో పేర్కొంది. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో 2020, జనవరి ఒకటి నుంచి విలీనం అయ్యారు. వీరంతా పాత పింఛను కావాలని కోరుకుంటున్నారు. అసలు విలీనం కోరుకోవడానికి ప్రధానకారణం కూడా పాత పింఛను కోసమే అని ఉద్యోగులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 2004, సెప్టెంబరుకు ముందు ఉద్యోగం పొందినవారికి పాత పింఛను అమల్లో ఉంది. ఆర్టీసీలోనూ ఆ సమయానికి విధుల్లో చేరినవారికి పాత పింఛను ఇవ్వాలని కోరుతున్నారు. ఇదేమీ పట్టించుకోకుండా సీపీఎస్‌లో చేరండి, జీపీఎస్‌ పొందండి అంటూ సర్క్యులర్‌ జారీచేయడంపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇంత కాలం ఏం చేశారు?

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలుచేస్తూ గత ఏడాది జూన్‌లో ప్రభుత్వం 113 జీవో జారీచేసింది. అందులో పీటీడీ ఉద్యోగులు ఈపీఎఫ్‌-95లో కొనసాగుతారా? సీపీఎస్‌లో చేరుతారా? అనేది ఆప్షన్‌ తీసుకోవాలని పీఆర్సీ కమిషనర్‌ సూచించారు. ఉత్తర్వులో కూడా ఇదే పేర్కొన్నారు. కానీ ఇంతకాలం ఈ అంశాన్ని పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం.. ఇప్పుడు సర్క్యులర్‌ జారీచేసి, వారంలో ఆప్షన్‌ తెలపాలంటూ ఎలా ఆదేశిస్తుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇంత హడావుడిగా ఎందుకు ఆప్షన్‌ తీసుకుంటున్నారో అర్థంకావడం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం తాము ఇప్పుడు కొత్తగా సీపీఎస్‌లో చేరినా.. జీపీఎస్‌ వర్తిస్తుందనే స్పష్టత లేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై అనేక సందేహాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని