Gundlakamma Reservoir: గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్‌ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్‌)కు చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది.

Updated : 09 Dec 2023 13:53 IST

ఏడాది కిందట ఒక గేటు ధ్వంసం
ఇప్పటికీ బాగు చేయించలేకపోయిన ప్రభుత్వం
ఇప్పుడు మరోదానికీ చేటు
జలాశయంలో నీళ్లన్నీ సముద్రంపాలు
గేట్లన్నీ కొట్టుకుపోతే కానీ పట్టదా జగన్‌?

ఈనాడు- ఒంగోలు, న్యూస్‌టుడే - సంత  నూతలపాడు: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్‌ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్‌)కు(Gundlakamma Reservoir) చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. ఇప్పటికే ఒక గేటు కొట్టుకుపోయి ఏడాది గడిచిపోయినా దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయలేదు. మిగిలిన గేట్ల మరమ్మతుల్నీ జగన్‌ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో శుక్రవారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో మరో (2వ నంబరు) గేటు విరిగి కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో నీళ్లన్నీ వృథాగా సముద్రం పాలవుతున్నాయి. గుండ్లకమ్మ జలాశయం కింద కుడి, ఎడమ కాలువల పరిధిలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వాయర్‌లో చేపల వేటతో 2వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జలాశయాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది.

విలువైన జలాలు కడలిపాలు

గుండ్లకమ్మ జలాశయం పూర్తి సామర్థ్యం 3.8 టీఎంసీలు. గతేడాది ఆగస్టులో 3వ గేటు కొట్టుకుపోయే నాటికి జలాశయంలో 3 టీఎంసీల నీళ్లున్నాయి. గేటు కొట్టుకుపోవడంతో 1.5 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోయాయి. గేటు మరమ్మతులు చేయాలంటే మొత్తం జలాశయం ఖాళీ చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులు సూచించారు. తాత్కాలికంగా మరమ్మతు చేసిన తర్వాత జలాశయంలో నిల్వను 1.7 టీఎంసీలకే పరిమితం చేశారు. మిగ్‌జాం తుపానుకు ముందు జలాశయంలో 1.3 టీఎంసీలే ఉన్నాయి. తుపాను నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా రావడంతో జలాశయంలోకి 2.5 టీఎంసీల నీరు చేరింది. బుధవారం రెండు గేట్లు ఎత్తి కొంత నీరు దిగువకు వదిలారు. ఉద్ధృతి తగ్గిందనుకొని తిరిగి మూసివేశారు. పైనుంచి ప్రవాహం ఎక్కువ కావడంతో మరమ్మతులకు నోచక తుప్పుపట్టి ఉన్న రెండో గేటులోని అడుగు భాగం కొంత శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. శుక్రవారం రాత్రి వరకు అర టీఎంసీ నీళ్లు వృథాగా పోయాయి. గేటు కొట్టుకుపోయిందని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటుండటంతో అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. వరద నీరు దిగువకు పెద్ద ఎత్తున వస్తుండటంతో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తాజాగా ఆయా గ్రామాల్లో దండోరా వేయించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మూడేళ్ల కిందటే గుర్తించినా..

  • గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి 15 ఏళ్లు పూర్తి కాకముందే గేట్లు తుప్పు పట్టేశాయి. మొత్తం 15 గేట్లలో చాలావరకు పాడయ్యాయని, వాటిని మార్చాలని మూడేళ్ల కిందటే నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. 6, 7 నెంబరు గేట్లు మరీ ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటికి తక్షణ మరమ్మతులు చేయాలని భావించారు. మొత్తంగా మరమ్మతులకు రూ.3 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
  • 2022 జూన్‌ నెలలో రూ.98 లక్షలు మంజూరు చేశారు. సకాలంలో నిధులందక ఆ సీజనులో పనులు చేపట్టేందుకు ఆస్కారం లేకపోయింది.
  • గత ఏడాది ఆగస్టు 31న రాత్రి మూడో నంబరు గేటు కొట్టుకుపోయింది. స్టాప్‌ లాగ్‌ గేటు పెట్టేలోపు ప్రాజెక్టులోని నీళ్లన్నీ వృథాగా కడలిలో కలిసిపోయాయి.  
  • ఆ గేటు కొట్టుకుపోయిన తర్వాత కేంద్ర ఆకృతుల సంస్థ అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. మొత్తం 12 గేట్లు బాగు చేయాలని తేల్చి చెప్పారు. రూ.9.4 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటికీ మొదట కొట్టుకుపోయిన గేటునే పెట్టలేకపోయారు.
  • ఈ ప్రాజెక్టులో 12 గేట్లు బాగు చేయాలని మూడేళ్ల కిందటే గుర్తించినా జగన్‌ సర్కార్‌ దీన్ని పట్టించుకోలేదు. ఫలితంగా శుక్రవారం రాత్రి మరో గేటు కొట్టుకుపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని ససాక్ష్యంగా నిరూపించింది.  

తరచూ తప్పులు.. అయినా మారని తీరు

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసిన జగన్‌ ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయింది. పింఛా ప్రాజెక్టు మట్టి కట్ట తెగిపోయింది. పులిచింతల ప్రాజెక్టులో గేటు కొట్టుకుపోయింది. గుండ్లకమ్మలో ఇలా గేటు కొట్టుకుపోవడం ఇది రెండోసారి. ఇంత జరుగుతున్నా జగన్‌ సర్కార్‌ మేల్కోలేదని, ముఖ్యమంత్రి హామీలు మాటలకే పరిమితమవుతున్నాయని తాజా గుండ్లకమ్మ ఉదంతం రుజువు చేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు