NRI Yashasvi: ఎన్‌ఆర్‌ఐ యశస్వికి పాస్‌పోర్టు తిరిగిచ్చేయండి

ప్రవాసాంధ్రుడు, తెనాలికి చెందిన బొద్దులూరి యశస్వికి హైకోర్టులో ఊరట లభించింది. స్వాధీనం చేసుకున్న యశస్వి పాస్‌పోర్టును తక్షణం తిరిగి అప్పగించాలని మంగళగిరి సీఐడీ ఎస్పీ, తిరుపతి సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌స్పెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

Updated : 27 Dec 2023 12:46 IST

సీఐడీకి హైకోర్టు ఆదేశం
నిబంధనలు పాటించకుండా స్వాధీనం చేసుకోవడంపై ఆక్షేపణ

ఈనాడు, అమరావతి: ప్రవాసాంధ్రుడు, తెనాలికి చెందిన బొద్దులూరి యశస్వికి హైకోర్టులో ఊరట లభించింది. స్వాధీనం చేసుకున్న యశస్వి (NRI Yashasvi) పాస్‌పోర్టును తక్షణం తిరిగి అప్పగించాలని మంగళగిరి సీఐడీ ఎస్పీ, తిరుపతి సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌స్పెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. పాస్‌పోర్టు స్వాధీనం చేసుకునే క్రమంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 91, 102 నిబంధనలను పాటించలేదని ఆక్షేపించింది. వీసా రెన్యువల్‌ కోసం పిటిషనర్‌ కాన్సులేట్‌ ముందు హాజరుకావాల్సి ఉన్నందున, పాస్‌పోర్టు తక్షణ విడుదలకు తామిచ్చిన ఉత్తర్వులను అధికారులకు తెలియజేయాలని సీఐడీ ప్రత్యేక పీపీకి సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌ను అపకీర్తి పాల్జేసేలా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో... అమెరికా నుంచి వచ్చిన యశస్విని ఏపీ సీఐడీ హైదరాబాద్‌లో అరెస్టు చేసి బలవంతంగా గుంటూరుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు యశస్వి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని, తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ చేసిన విమర్శలపై కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవన్నారు. సీఆర్‌పీసీ చట్ట నిబంధనలు పాటించకుండా పాస్‌పోర్టును సీజ్‌ చేసే అధికారం సీఐడీకి లేదన్నారు. వీసా రెన్యువల్‌ కోసం కాన్సులేట్‌ వద్ద పిటిషనర్‌ హాజరుకావాల్సి ఉందన్నారు. గైర్హాజరైతే స్లాట్‌ కోసం మూడు నెలలు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని వెంటనే పాస్‌పోర్టును అప్పగించేలా సీఐడీని ఆదేశించాలని కోరారు. సీఐడీ ప్రత్యేక పీపీ శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా పిటిషనర్‌ తరచూ పోస్టులు పెడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని 41ఏ నోటీసిచ్చి, వదిలిపెట్టామన్నారు. 41ఏ నోటీసు షరతులను ఉల్లంఘిస్తూ మీడియాతో మాట్లాడారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పాస్‌పోర్టు స్వాధీనంలో సీఆర్‌పీసీ నిబంధనలను పాటించినట్లు కనిపించడం లేదన్నారు. పాస్‌పోర్టును వెంటనే పిటిషనర్‌కు అప్పగించాలని సీఐడీని ఆదేశించారు.(

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని