ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దెలు చెల్లించని సర్కారు

ఆరోగ్య ఉప కేంద్రాలకు గత ఆరేడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించడంలేదు. విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకూ నిధులు ఇవ్వడం లేదు.

Published : 01 May 2024 06:44 IST

విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకూ నిధుల్లేవ్‌!
భవనాలు ఖాళీ చేయాలని యజమానుల ఒత్తిళ్లు

ఈనాడు, అమరావతి: ఆరోగ్య ఉప కేంద్రాలకు గత ఆరేడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించడంలేదు. విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకూ నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఆ భవనాల యజమానులకు ఏం సమాధానం చెప్పాలో తెలీక.. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు(సీహెచ్‌వోలు) సతమతమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఒక్కొక్క కేంద్రానికి నెలకు సుమారు రూ.3వేల వరకు చెల్లించాలి. నాడు-నేడు కింద చేపట్టిన కేంద్రాల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాలతో ఇవి కొనసాగుతున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద మంజూరయ్యే నిధుల ద్వారా ఈ కేంద్రాల నిర్వహణ జరుగుతోంది. కేంద్రం నిధులు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నా.. పట్టించుకోవడంలేదని సీహెచ్‌వోలు వాపోతున్నారు.

సీహెచ్‌వోల ప్రోత్సాహకాల్లోనూ కోతలు..

సీహెచ్‌వోలకు గత సెప్టెంబరు నుంచి ప్రోత్సాహకాల చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోతలు పెడుతోంది. వేతనానికి అదనంగా పనితీరు ప్రతిపాదికన నెలకు సుమారు రూ.15వేల వరకు చెల్లింపులు ఉంటాయి. అయితే, ఏఎన్‌ఎంలు యాప్‌ ద్వారా గర్భవతుల వివరాల నమోదు చేయకపోతే తమల్ని బాధ్యులు చేస్తూ.. ప్రోత్సాహకాల్లో కోతలు విధిస్తున్నారని సీహెచ్‌వోలు మండిపడుతున్నారు. ప్రతి కేంద్రం ద్వారా టెలీ మెడిసిన్‌ కాల్స్‌ ఎన్ని చేయించారో కూడా పరిగణనలోనికి తీసుకుని ప్రోత్సాహకాలు ఖరారు చేస్తుండడం గమనార్హం. సీహెచ్‌వోలు గత కొద్దినెలల నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అదనంగా అప్పగించే విధులకూ హాజరవుతున్నారు. దీంతో టెలీ మెడిసిన్‌ కాల్స్‌ చేయించడంలో కొందరు వెనుకబడ్డారు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలు గ్రహించకుండా కోతలు విధించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని