జగన్‌ పాలనలో హిందువులపై ముప్పేట దాడి

‘జగన్‌ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి.

Published : 01 May 2024 05:52 IST

ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతిస్వామి ధ్వజం

ఈనాడు, అమరావతి: ‘జగన్‌ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి. 300 దేవాలయాలపై దాడులు జరిగాయి. ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ప్రభుత్వానికి మళ్లీ అవకాశమిస్తే హిందూ సనాతన ధర్మాన్ని కోల్పోతాం. రాష్ట్రంలోని హిందువులంతా ఏకమై అన్ని మతాలను సమానంగా చూసే తెదేపా, జనసేన, భాజపా కూటమిని గెలిపించాలి..’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురంలోని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతిస్వామి పిలుపునిచ్చారు. ఏపీ సాధు పరిషత్‌, హిందూధార్మిక సంఘాలు, అట్లూరి నారాయణరావు ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘ఆంధ్రాలో హిందువుల ఆత్మగౌరవ పరిరక్షణ- భవిష్యత్తు కార్యాచరణ’ సదస్సులో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను వైకాపా ప్రభుత్వం మంటకలిపిందని శ్రీనివాసానంద మండిపడ్డారు. ‘తిరుమలలో అన్యమత ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ప్రసాదాల ధరలు విపరీతంగా పెంచారు. అన్నప్రసాదం నాణ్యత కోల్పోయింది. హిందూ దేవాలయాల సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీయాలనే ఇలా చేస్తున్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును ఖండించినా ఇంతవరకూ నిందితులను పట్టుకునేవారు లేరు. అందుకే హిందువులు, మఠాధిపతులు, పీఠాధిపతులంతా ఏకమై ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు. జగన్‌ తన భార్యతో కలిసి కనీసం ఆలయాలకు వెళ్లకపోవడమేంటి?’ అని ప్రశ్నించారు. కార్యక్రమంలో శ్రీరామసేన అధ్యక్షుడు తురగ శ్రీరామ్‌, హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు కార్యదర్శి తోట సురేష్‌బాబు, హిందూ జనశక్తి ప్రతినిధి లలిత్‌కుమార్‌, శివశక్తి చిట్లపల్లి కల్యాణ్‌, భక్తి చైతన్యానంద స్వామి, మాతాజీ గీత, స్కంద దేవానందస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని