రాజధాని గ్రామాల్లో భూసేకరణ ప్రకటన ఉపసంహరణ తగదు

రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

Updated : 01 May 2024 06:52 IST

అమరావతి ధ్వంసానికి సీఎం జగన్‌, ఉన్నతాధికారి శ్రీలక్ష్మి యత్నిస్తున్నారు
గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులను రద్దు చేయండి
హైకోర్టులో పిల్‌ వేసిన రాజధాని ప్రాంత రైతు సంఘాలు
వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా జగన్‌, శ్రీలక్ష్మి

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దురుద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి నోటిఫికేషన్లు జారీచేశారన్నారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు, సీఆర్‌డీఏ చట్టం, భూసమీకరణ పథకం నిబంధనలకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ నిర్ణయం విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ భూముల వ్యవహారంలో అవార్డు జారీచేశారన్నారు. రాజధాని నగరం అమరావతిని ధ్వంసం చేయాలన్న ఏకైక లక్ష్యంతో దురుద్దేశపూర్వకంగా భూసేకరణ ప్రక్రియను ఉపసంహరించుకున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి.. రాజధాని అమరావతిని ధ్వంసం చేసేందుకు నిరంతరం యత్నిస్తున్నారన్నారు.

హైకోర్టు పలు సందర్భాల్లో రాజధాని అమరావతిని కాపాడుతూ ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నోటిఫికేషన్ల కారణంగా రాజధాని ప్రాంతంలో అక్కడక్కడ వ్యవసాయ భూములు మిగిలిపోతాయన్నారు. దీంతో రాజధాని నగర అభివృద్ధికి అవరోధం కలుగుతుందని తెలిపారు. రాజధాని బృహత్తర ప్రణాళికకు(మాస్టర్‌ ప్లాన్‌) మార్పులు చేయడానికి వీల్లేదన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలి తప్ప.. దానిని ఉపసంహరించడానికి వీల్లేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉపసంహరణ కోసం కలెక్టర్‌ ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. 625 ఎకరాల భూసేకరణ ఉపసంహరణ నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లను కోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలని కోరారు.  

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్‌, టౌన్‌, కంట్రీప్లానింగ్‌ డైరెక్టర్‌, గుంటూరు జిల్లా కలెక్టర్‌, వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని