వీటికెలా ముసుగేస్తారు?

సార్వత్రిక ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ఎన్నికల కోడ్‌ కూసిందని ఎన్నికల అధికారులు అప్రమత్తమై రాజకీయపార్టీ ఫ్లెక్సీలు పీకేసి.. విగ్రహాలకు ముసుగులు వేసేసి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు ప్రాంగణాల్లో రాజకీయ నాయకుల చిత్రాలు ఉండకూడదని.. జెండాలు ఎగరకూడదని హకుం జారీ చేస్తున్నారు.

Updated : 19 Mar 2024 13:44 IST

స్కూలు పుస్తకాల నుంచి ఇళ్ల పట్టాల వరకూ అన్నింటిపైనా జగన్‌ చిత్రాలే
వైకాపా జమానాలో అంతేలేని ప్రచార యావ
ఎన్నికల సంఘానికి సవాలుగా సర్కారు సిత్రాలు

ప్రచార యావతో గత అయిదేళ్లూ ఎక్కడ వీలుంటే అక్కడ సీఎం జగన్‌ ఫొటోలు ముద్రించేశారు. చిన్నారులకు ఇచ్చే చిక్కీలు... పిల్లలు చదివే పుస్తకాలు, ట్యాబ్‌లు... స్కూలు బ్యాగులు... రోగులకు చీటీలు... పేదలకిచ్చే ఇళ్ల పట్టాలు.. ఆస్తిపత్రాలు.. ఇలా ఎక్కడ చూసినా జగన్‌ బొమ్మే.. వైకాపా రంగుల హంగులే. చివరకు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రజలు కూర్చునే బల్లలు మొదలుకొని చిన్నచిన్న నిర్మాణాలకూ వైకాపా రంగులు వేసేశారు. ఇప్పడు ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఈ అడ్డగోలు ప్రచారానికి ఎన్నికల సంఘం ఎలా కట్టడి చేస్తుందన్నదే పెద్ద ప్రశ్నగా తయారైంది.

ఈనాడు, అమరావతి. కాకినాడ, గుంటూరు : సార్వత్రిక ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ఎన్నికల కోడ్‌ కూసిందని ఎన్నికల అధికారులు అప్రమత్తమై రాజకీయపార్టీ ఫ్లెక్సీలు పీకేసి.. విగ్రహాలకు ముసుగులు వేసేసి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు ప్రాంగణాల్లో రాజకీయ నాయకుల చిత్రాలు ఉండకూడదని.. జెండాలు ఎగరకూడదని హకుం జారీ చేస్తున్నారు. అయితే.. జగన్‌ జమానాలో వ్యవస్థలు జరిపిన అతిక్రమణలపైనా.. ఎన్నికల సంఘానికే సవాల్‌గా మారిన కోడ్‌
ఉల్లంఘనలపైనా ఇప్పుడు అధికారులు ఏ రీతిన స్పందిస్తారన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది.

ప్రవీణ్‌ ప్రకాశ్‌ స్వామి భక్తి.. ఉపాధ్యాయులకు తలనొప్పి

వైకాపా ప్రభుత్వ హయాంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 47 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు. వీటి తయారీలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ చూపిన స్వామి భక్తి.. ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది నోటుపుస్తకాలపై సీఎం జగన్‌ ఫొటోతో పాటు విద్యా కార్యక్రమాల ఫొటోలను ముద్రించేలా ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశించారు. దీన్ని ఓ అధికారి వ్యతిరేకించినా వినకుండా అమలు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున ఇప్పుడు జగన్‌ ఫొటో కనిపించకుండా ఉండేందుకు నోటుపుస్తకాలకు అట్టలు వేయాలంటూ ప్రధానోపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.దీంతో ఏం చేయాలో తెలియక ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.

  • విద్యార్థులకు ఇచ్చిన బెల్టు, బ్యాగ్‌లపైన ‘జగనన్న విద్యాకానుక‘ అని రాశారు. ఉపాధ్యాయులు ఫిర్యాదులు చేస్తుండటంతో బెల్టులు ధరించకుండా చూడాలని చెబుతున్నారు. బ్యాగ్‌లపైనా ఇదే విధంగా ఉందని, వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
  • పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా ఇస్తున్న చిక్కీలపై ఉండే కవర్లపైనా సీఎం జగన్‌ ఫొటోను ముద్రించారు. ఇప్పటికే చాలా బడులకు వీటిని పంపిణీ చేశారు. బడుల్లోని నిల్వలు 15 రోజుల వరకు వస్తాయి.
  • పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్లపైనా ‘జగనన్న గోరుముద్ద’ అని స్టాంపులు వేశారు. ఇప్పుడు ఇవి బడుల్లో ఉన్నాయి. ఎన్నికల కోడ్‌ వచ్చినందున వీటిని ఏం చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
  • బైజూస్‌ కంటెంట్‌తో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లపైనా జగన్‌ ఫొటో ముద్రించారు. వీటిపై వేసిన స్టిక్కర్లను తొలగించడం లేదు. ఉపాధ్యాయులు వీటిని తొలగించాలా లేదా అనేదానిపై స్పష్టత లేదు.
  • బడుల్లో జగనన్న గోరుముద్ద, విద్యాకానుక ఇతరత్రా ఇలాంటి కార్యక్రమాలు, జగన్‌ ఫొటోలను చాలా బడుల్లో పెయింట్లు వేశారు. ఇప్పుడు వీటిని మూసివేసేందుకు రూ.లక్షల్లో వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
  • విద్యార్థులకు అందించిన డిక్షనరీలపైనా జగన్‌ బొమ్మతో నవరత్నాల వివరాలు ముద్రించారు. పదో తరగతి విద్యార్థులకు అందించే స్టడీ మెటీరియల్‌పైనా జగన్‌తోపాటు, మంత్రుల చిత్రాలు ముద్రించారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్‌ కళ్లకు కనిపించవా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.

బెల్లంపొడి.. రాగిపిండి.. బియ్యం సంచులపై స్టిక్కర్లు వేయాలని ఆదేశం

బెల్లం పొడి.. రాగిపిండి.. బియ్యం సంచులు.. సీఎం ఫొటో కన్పించకుండా స్టిక్కర్‌/టేప్‌ అంటించాలని సూచిస్తూ పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే ఎండీయూ వాహనాలపైనున్న  జగన్‌, నవరత్నాల స్టిక్కర్లు కన్పించకుండా చూడాలని.. అయితే ఆ స్టిక్కర్లు, వాహన రంగు దెబ్బతినకుండా చూడాలని పేర్కొన్నారు. ఎండీయూ వాహనాలను రేషన్‌ పంపిణీకి తప్ప మరే ఇతర అవసరాలకూ ఉపయోగించకూడదని సూచించారు.

లక్షల ప్యాకెట్లపై స్టిక్కర్లు

మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలో టేక్‌ హోం రేషన్‌ కింద.. ప్రతి నెలా 17 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బెల్లం పొడి, రాగిపిండి, బియ్యం సంచులతో కూడిన పౌష్టికాహార ప్యాకెట్లు అందిస్తున్నారు. వాటన్నింటిపైనా ఉన్న సీఎం జగన్‌ బొమ్మలు కన్పించకుండా స్టిక్కర్‌ అంటించాలి. అదనపు ఖర్చు అవుతుంది. ఇవన్నీ మళ్లీ పౌర సరఫరాలశాఖే భరించాలి.

ప్రతిపక్ష హోర్డింగులే కనిపిస్తాయా

ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచ్చి 48 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ చాలా చోట్ల ముఖ్యమంత్రి జగన్‌, వైకాపా నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫొటోలు అలాగే కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫొటోలను యుద్ధ ప్రాతిపదికన తొలగించిన యంత్రాంగం...సీఎం ఫొటోలున్న వాటిని తొలగించే అంశంలో మీనమేషాలు లెక్కిస్తోంది. తూర్పుగోదావరి సహా పలు జిల్లాల్లో.. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే వాహనాలు (ఎండీయూ వెహికల్స్‌)పై ఉన్న నవరత్నాలు లోగో, ముఖ్యమంత్రి బొమ్మలు తొలగించలేదు.

జగన్‌ ఫొటోతో ఉన్న సిద్ధం హోర్డింగులు బహిరంగ ప్రదేశాల్లో ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ‘‘మా నమ్మకం నువ్వే జగన్‌’’ పేరిట దుకాణాలు, ఇళ్లపై ఏర్పాటు చేసిన హోర్డింగులు తీయలేదు. అదే సమయంలో తెదేపా నాయకుల ఇళ్లు, ప్రైవేటు స్థలాలపై ఉన్న వాటిని మాత్రం తొలగించేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇళ్లపై కట్టుకున్న తెదేపా జెండాలను తొలగించిన అధికారులు.. వైకాపా నాయకుల ఇళ్లపై ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లను మాత్రం తీయలేదు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలపై ఉన్న జగన్‌ బొమ్మలకు చాలా చోట్ల ముసుగు వేయలేదు. శిలాఫలకాలపై ఉన్న జగన్‌, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల ఫొటోలను కనిపించకుండా చేయలేదు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆయన ఫొటోలతో ఉన్న రైటింగ్‌ ప్యాడ్‌లను విద్యార్థులకు పంపిణీ చేశారు. పదో తరగతి విద్యార్థులు వాటిని తీసుకుని సోమవారం పరీక్షలకు హాజరయ్యారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


చంద్రబాబు నివాసం వద్ద అధికారుల ‘అతి’

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్దకు వచ్చే పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు, ఇతర సందర్శకులు కూర్చునేందుకు వీలుగా కరకట్ట రోడ్డు పక్కన గతంలో సిమెంట్‌ బల్లలు ఏర్పాటు చేశారు. వాటికి పసుపు రంగు ఉందంటూ అధికారులు సోమవారం ఆ బల్లలను కూల్చేశారు. వాటికి పసుపు రంగు ఉండటం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని భావిస్తే తెలుపు సున్నం వేయిస్తే సరిపోతుంది.

లేదంటే ఆ రంగు కనిపించకుండా కాగితాలైనా అతికించొచ్చు. కానీ మున్సిపల్‌ అధికారులు ఏకంగా వాటిని ధ్వంసం చేసేశారు. రాష్ట్రంలోని ఊరూరా విద్యుత్తు స్తంభాలు, చెత్తకుండీలు, తోపుడు బండ్లు, తాగునీటి ట్యాంకులు, టిడ్కో గృహాలకు వైకాపా రంగులు ఉన్నా వాటిని తొలగించలేదు.


కోడ్‌ అమల్లో పక్షపాతం

గుంటూరు కార్పొరేషన్‌ సిబ్బంది తీరుపై తెదేపా ధ్వజం

ఎన్నికల కోడ్‌ అమలు చేయడంలో గుంటూరులో నగరపాలక సంస్థ అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. మంత్రి విడదల రజిని పేరుపై గుంటూరు పశ్చిమలోని పలు ప్రాంతాల్లో సిమెంటు బెంచీలు వేయించారు. కోడ్‌ అమల్లోకి వచ్చాక ఆ బెంచీలకు ఆమె పేరు, వైకాపా రంగులు కనిపించకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని చూసీచూడనట్లుగా వదిలేశారు. అదే సమయంలో సోమవారం తెదేపా గుంటూరు పశ్చిమ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర కార్యాలయం వద్ద ప్రహరీకి ఉన్న తెదేపా జెండాలు, ఫ్లెక్సీలను తొలగించేందుకు మాత్రం అత్యుత్సాహం చూపారు. పబ్లిక్‌ ప్రాంతంలో లేనప్పటికీ సొంత ఇళ్లకు ఉన్న జెండాలు, ఫ్లెక్సీలు ఏవిధంగా తొలగిస్తారని తెలుగు యువత నాయకులు పట్టణ ప్రణాళిక సిబ్బందిని నిలదీశారు. మంత్రి రజిని ఏర్పాటు చేసిన బెంచీలకు రంగులు, ఆమె పేరు కనిపించకుండా చేశాక.. ఇక్కడకు రావాలని పట్టుబట్టడంతో వారు వెళ్లిపోయారు. అధికారులు పక్షపాత ధోరణితో అవలంబిస్తున్న విషయంపై ఎన్నికల సంఘం ఫిర్యాదుల విభాగానికి తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో సాయంత్రానికి మంత్రి రజిని ఏర్పాటు చేసిన బెంచీలకు కంటితుడుపు చర్యగా తెలుపు రంగు వేసి చేతులు దులిపేసుకున్నారు. మరోవైపు రవీంద్ర కార్యాలయం వద్ద తెదేపా జెండాలను తొలగించేందుకు మళ్లీ కార్పొరేషన్‌ అధికారులు పోలీసులతో కలసి చేరుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని