వైకాపా సైన్యం బరితెగింపు

ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు.

Updated : 19 Mar 2024 06:48 IST

 వాలంటీర్ల జగన్‌ అనుకూల ప్రచారం
యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన
ప్రేక్షకపాత్రకు పరిమితమవుతున్న కలెక్టర్లు

ఈనాడు, అమరావతి, యంత్రాంగం: ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. ప్రజాధనాన్ని వేతనాలుగా తీసుకుంటున్న వాలంటీర్లు.. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా  అధికార పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తు కలెక్టరైనా, ఎన్నికల అధికారైనా తమ ముందు    దిగదుడుపే అనేలా బరితెగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి 3 రోజులవుతున్నా, ఇప్పటికీ బహిరంగంగానే జగన్‌కు ఓటేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదేంటని  ఎవరైనా ప్రశ్నిస్తే ‘మా ఇష్టం.. మేం ఏమైనా’ చేస్తామంటూ ఎదురు తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్లు, ఎన్నికల సంఘం అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
వైకాపా అభ్యర్థి ప్రచారంలో వాలంటీర్లు: మళ్లీ వైకాపాకు పట్టం కట్టాలంటూ ఆ పార్టీ అభ్యర్థితో వాలంటీరు కూడా ప్రచారం చేసిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటుచేసుకుంది. సోమవారం పట్టణంలోని 99వ పోలింగ్‌ కేంద్రం పరిధిలోని 29వ వార్డులో వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ప్రచారం నిర్వహించారు. ఇందులో ఆ వార్డుకు చెందిన వాలంటీరు నరసింహులు ఆమె వెంట ప్రచారం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని తెదేపా నాయకులు కృష్ణ, డి.నరసింహులు, పందికోన ఈరన్న ఆరోపించారు. అధికార పార్టీకి వత్తాసు పలికిన వాలంటీరుపై చర్య తీసుకోవాలని వారు ఆర్వోకు ఫిర్యాదు చేశారు.

  • అన్నమయ్య జిల్లా పీలేరు మండలం అగ్రహారం పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి వైకాపా స్థానిక నాయకులు నిర్వహించిన ప్రచారంలో వాలంటీర్లు శివ, సతీష్‌లు పాల్గొన్నారు.
  • శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17న 589 కార్డులు అందజేశారు. రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో 104, 18న 209 కార్డులు పంపిణీ చేశారు. వీటిని గతంలోనే అందజేయాల్సి ఉంది. ఓటర్లను ప్రభావితం చేసేలా మొత్తం 798 మంది లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయడం గమనార్హం.

సిద్ధం సభల్లో వాలంటీర్లు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండ గ్రామాల్లో సోమవారం వైకాపా నిర్వహించిన సిద్ధం గ్రామస్థాయి సమావేశాల్లో ఆయా గ్రామాలకు చెందిన కొందరు వలంటీర్లు పాల్గొని ‘మేము సిద్ధం’ అంటూ నినాదాలు చేశారు.


వైకాపాకు ఓటేయాల్సిందేనని ఒత్తిడి

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండలం కొత్తమల్లంపేట సచివాలయ పరిధిలో మహిళా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పథకాల పేర్లు చెప్పి, మళ్లీ జగన్‌కే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. ఇదేంటి మీ పని పథకాల గురించి చెప్పడం వరకే కదా.. ఏ పార్టీకి ఓటేయాలో మీరెలా చెబుతారని స్థానికుడొకరు ప్రశ్నించారు. దీంతో మా ఇష్టం అంటూ వాలంటీర్లు ఎదురుతిరిగారు. వాలంటీర్ల బరితెగింపు వెలుగులోకి రావడంతో స్థానిక ఎంపీడీవో రత్నకుమారి సోమవారం విచారణ చేపట్టారు. వైకాపాకు ఓటేయాలని చెప్పిన వాలంటీరు ప్రస్తుతం అందుబాటులో లేరని, వీడియోలో ఉన్న మిగతా ముగ్గురు వాలంటీర్లు మేం అలా చెప్పలేదనే వివరణతో మొక్కుబడి నివేదికను కలెక్టర్‌కు పంపించేశారు.

కొత్తమల్లంపేటలో నలుగురు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైకాపాకు ఓటేయాల్సిందేనని గ్రామస్థులపై ఒత్తిడి తెస్తున్నారంటూ గొలుగొండ మండలం లింగంపేటకు చెందిన తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకుడు శ్రీకాంత్‌ సోమవారం నర్సీపట్నం ఆర్‌డీవో జయరాంకు ఫిర్యాదు చేశారు.


ప్రశ్నిస్తే కేసులు పెట్టండి

‘వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వారిపై ఎదురు తిరగండి.. కేసులు పెడతామని బెదిరించండి. ఆ తరువాత మేం చూసుకుంటాం’ అని వైకాపా నేతలే వారికి అభయం ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వాలంటీర్లతో తెదేపా, జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టించాలని అంతర్గతంగా వారికి మార్గదర్శనం చేసినట్లు సమాచారం. ఒకరిద్దరు అలా చేస్తే మిగతా ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించడానికి ముందుకురారని మాడుగులకు చెందిన ఓ నేత వాలంటీర్లకు ఇటీవల సూచించినట్ల్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని