CM Jagan: అస్మదీయుల కోసం అన్న రివర్స్‌!

రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థను మెరుగుపరిచి.. పెట్టుబడిదారులకు స్నేహపూర్వకంగా తీర్చిదిద్దుతాం. దీనికోసం పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి భూముల కేటాయింపు విధానంలో మార్పులు తెస్తున్నాం.

Updated : 20 Mar 2024 06:23 IST

పరిశ్రమలకు భూకేటాయింపుల్లో మళ్లీ పాతపాట
లీజు కాదు... నేరుగా రిజిస్ట్రేషన్లకే అనుమతి
తనవారి కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చడమే జగన్‌ లక్ష్యం?
ఎన్నికల ముందు రిజిస్ట్రేషన్లపై అనుమానాలు


రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థను మెరుగుపరిచి.. పెట్టుబడిదారులకు స్నేహపూర్వకంగా తీర్చిదిద్దుతాం. దీనికోసం పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి భూముల కేటాయింపు విధానంలో మార్పులు తెస్తున్నాం. ప్రతిపాదిత సేల్‌ డీడ్‌ విధానం ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే వెసులుబాటు లభిస్తుంది.

గత ఏడాది నవంబరు 9న ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలివీ..


అధికారంలోకి రాగానే రివర్స్‌ టెండరింగ్‌లన్నారు... కొత్త పారిశ్రామిక విధానాలన్నారు... రాష్ట్ర సంపదను కాపాడుతున్నామన్నారు... తీరా ఇప్పుడు ఎన్నికల ముందు మాట మార్చారు... తన వారికి లబ్ధి చేకూర్చేందుకు రూటు మార్చారు. ఇదీ జగనన్న విశ్వసనీయత, చిత్తశుద్ధి!


‘వడ్డించేది మనవాడైతే..’ చందంగా ప్రభుత్వమే మనదైతే ఇక కానిదేముంది? కోరుకుంటే కొండ మీది కోతినైనా తీసుకొచ్చి ఆడించవచ్చు. వైకాపా సర్కారు నిర్ణయాలే అందుకు నిదర్శనం. జగన్‌ తలచుకుంటే రాత్రికి రాత్రే నిబంధనలు మారిపోతాయి. మంత్రిమండలి ఆమోదమూ జరిగిపోతుంది. ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ అవుతాయి. అస్మదీయ కంపెనీలకు భారీగా లబ్ధి కలుగుతుంది. పరిశ్రమలకు విక్రయించే భూములపై యాజమాన్య హక్కుల బదిలీ నిబంధనలనూ అస్మదీయ కంపెనీల కోసం జగన్‌ ప్రభుత్వం మార్చేయటం విశేషం. కంపెనీల పేరిట భూములను నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసేలా హడావుడిగా పాలసీ నిబంధనలు సవరిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ  అయిదేళ్లలో సీఎం జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) సమావేశాల్లో అనుమతించిన కంపెనీలకు లీజు విధానం కింద ప్రభుత్వం భూములను కేటాయించింది. కానీ, ఆ భూములను ఆయా కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడానికే ఇప్పుడు    హడావుడిగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

లీజు పోయి మళ్లీ ఓఆర్‌ఎస్‌ వచ్చే!

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పారిశ్రామిక పాలసీలను (2020-23, 2023-27) తీసుకొచ్చింది. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపు, ఇతర అంశాల్లో వర్తించే నిబంధనలను వాటిల్లో పేర్కొంది. గత తెదేపా ప్రభుత్వ 2015-20 పారిశ్రామిక విధానం ప్రకారం పరిశ్రమలకు అవుట్‌ రైట్‌ సేల్స్‌ (ఓఆర్‌ఎస్‌) కింద భూములను కేటాయించే నిబంధన ఉంది. దానిలో మార్పులు చేసి ముందుగా లీజు విధానంలో భూములను కేటాయించి.. 10 ఏళ్ల నిర్వహణ తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసేలా (లీజు కం బై) కొత్త విధానాన్ని 2020-23లో జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత 2023-27 పాలసీలోనూ ఇదే విధానాన్ని కొనసాగించింది. లీజు విధానంతో భూముల కొనుగోలు కోసం పారిశ్రామికవేత్తలు చేసే ఖర్చు మిగులుతుందని ప్రభుత్వం చెప్పింది. పదేళ్ల నిర్వహణ తర్వాత భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. లీజు విధానాన్ని అమలు చేసి పెట్టుబడి భారాన్ని తగ్గిస్తామని చెప్పి.. అప్‌ఫ్రంట్‌ పేరుతో ప్రభుత్వం నిర్దేశించిన ధర మేరకు భూముల పూర్తి విలువను పారిశ్రామికవేత్తల నుంచి ఏపీఐఐసీ వసూలు చేసింది. పూర్తి మొత్తాన్ని చెల్లించినా.. పదేళ్ల తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేస్తామనడం గమనార్హం. లీజు విధానం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఇబ్బందులు వస్తున్నాయని పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక అసోసియేషన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అయినా పట్టించుకోని జగన్‌ ఎన్నికల ముందు స్పందించడం గమనార్హం. గత ఏడాది నవంబరులో లీజు విధానానికి బదులుగా.. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఓఆర్‌ఎస్‌ పద్ధతినే తీసుకొస్తూ సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. 2023 అక్టోబరు 30న నిర్వహించిన సమావేశంలో దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పాలసీల్లోని కొన్ని అంశాల్లో ఏళ్లు గడుస్తున్నా మార్గదర్శకాలు ఇవ్వని జగన్‌ ప్రభుత్వం.. ఈ భూముల రిజిస్ట్రేషన్లపై మాత్రం హడావుడి చేస్తుండటం విశేషం.


కావాల్సిన కంపెనీలకు ప్రయోజనం

ప్రభుత్వ తాజా నిర్ణయంతో చిన్న పరిశ్రమల కంటే.. జగన్‌ అస్మదీయ కంపెనీలకే భారీ ప్రయోజనం దక్కనుంది. ప్రభుత్వం ఐదేళ్లలో పలుమార్లు నిర్వహించిన ఎస్‌ఐపీబీ సమావేశాల ద్వారా భారీ సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిసింది. వాటికి కేటాయించిన భూములను వైకాపా సర్కారు తీసుకొచ్చిన పాలసీ మేరకు రిజిస్ట్రేషన్‌ చేయడం సాధ్యం కాదు. అందుకే మళ్లీ పాత విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. జగన్‌కు దగ్గరి వాళ్ల కంపెనీ అని చెబుతున్న షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీకి 8,348  ఎకరాల సేకరణకు అనుమతులు ఇచ్చింది. నెల్లూరు జిల్లా తమ్మినపట్నంలో జిందాల్‌ స్టీల్స్‌కు 860 ఎకరాలు, తాడేపల్లిలోని మెగా రిటైల్‌ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు 5 ఎకరాలు కేటాయిస్తూ సీఎం అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశం ఆమోదించింది. విశాఖలో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు కేటాయించిన 130 ఎకరాల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడంతో అప్పట్లో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా.. అంతకుముందున్న ఓఆర్‌ఎస్‌ విధానాన్నే మళ్లీ తీసుకొచ్చింది.


ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని