ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌పై క్యాట్‌ తీర్పు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వివాదంపై హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) తీర్పును వాయిదా వేసింది.

Updated : 30 Apr 2024 06:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వివాదంపై హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) తీర్పును వాయిదా వేసింది. తనను సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై క్యాట్‌ జ్యుడిషియల్‌ సభ్యురాలు లతా బస్వరాజ్‌, నాన్‌జ్యుడిషియల్‌ సభ్యురాలు శాలినీ మిస్త్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫు అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు వినిపిస్తూ సస్పెన్షన్‌ ఎత్తివేస్తే పిటిషన్‌దారు సాక్షులను బెదిరిస్తారన్నారు. గతంలో ప్రెస్‌మీట్‌ పెట్టి ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారని తెలిపారు. ఏపీ వాదనతో వెంకటేశ్వరరావు తరఫు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు విభేదించారు. ప్రెస్‌మీట్‌లో ఎవరినీ బెదిరించలేదని, ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలూ చేయలేదని పేర్కొన్నారు. రెండేళ్లపాటు సస్పెన్షన్‌లో ఉన్నారని, తరువాత ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ శాఖలో పోస్టు ఇచ్చినా ఎలాంటి అసంతృప్తీ వ్యక్తం చేయలేదన్నారు. మొదటిసారి సస్పెండ్‌ చేసినపుడు పేర్కొన్న కారణాలనే రెండోసారి పేర్కొనడం చట్టవిరుద్ధమన్నారు. పిటిషన్‌ను అనుమతిస్తూ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం.. తీర్పు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని