సిమ్‌ ఇచ్చి.. తెర వెనుక చక్రం తిప్పాలని!: చిత్తూరు జిల్లాలో ఓ పోలీసు అధికారి పన్నాగం

చిత్తూరు జిల్లాలో పోలీసు శాఖ కీలక విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి వైకాపా అభ్యర్థులను గెలిపించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 09 Apr 2024 07:54 IST

వైకాపాకు అనుకూలంగా శతవిధాలా ప్రయత్నాలు

ఈనాడు, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పోలీసు శాఖ కీలక విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి వైకాపా అభ్యర్థులను గెలిపించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో నంబరు-2గా చలామణి అవుతున్న నాయకుడి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇటీవల పక్కన పెట్టిన ఎస్పీ జాషువా ఉన్నంత కాలం జిల్లా పోలీసులపై ఈ అధికారి పెత్తనం చెలాయించారు. అతని నిష్పాక్షికతపై ఆరోపణలు రావడంతో తాజాగా కొత్త ఎత్తుగడ వేశారు. తన వద్దనున్న సిమ్‌ను సోమవారం వేరే అధికారికి ఇచ్చారు. దీంతో తాను గత బాధ్యతల నుంచి తప్పుకొన్నానని, ఆ కీలక విభాగంలో తన పాత్ర నామమాత్రమేనని ప్రతిపక్షాలకు భ్రమ కల్పిస్తున్నారు. తెరవెనుక చేయాల్సిందంతా చేస్తున్నారు.

ఐదేళ్లుగా చిత్తూరు జిల్లాలోనే పనిచేస్తున్న ఆయన్ను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని, ఆయన ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవని పలుమార్లు విపక్ష నాయకులు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదు. తాను లూప్‌లైన్‌లో ఉన్నానని చెప్పుకొంటూ అధికార పార్టీతో అంటకాగుతున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో వైకాపా తరఫున దాఖలు చేసిన నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయి, మిగిలినవి తిరస్కరణకు గురికావడంలో ఆ అధికారిదే కీలక పాత్ర. ఇప్పుడు ఆయన్ను కీలక విభాగంలోనే ఉంచి, వేరే చోటుకు బదిలీ చేసినా ప్రయోజనం ఉండదని విపక్షాల నేతలు వాపోతున్నారు.

డీవో ఇచ్చి.. విధులకు వెళ్లమని చెప్పి..

మార్చిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తున్నందున జనవరి 31లోగా బదిలీలు పూర్తి చేయాలని గతంలోనే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్‌ అమల్లోకి వచ్చాక బదిలీ చేయకూడదని ఆదేశాలిచ్చింది. ఇందుకు భిన్నంగా మార్చి 16న కోడ్‌ అమల్లోకి వచ్చాక చిత్తూరు జిల్లాలో స్పెషల్‌ బ్రాంచి (ఎస్బీ), వేర్వేరు స్టేషన్లలో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లలో కొందరిని డిపార్ట్‌మెంటల్‌ ఆర్డర్‌ (డీవో) ఇచ్చి వివిధ స్థానాలకు పంపారు. గత నెలలో ఇది వివాదాస్పదమైంది. అప్పటి ఎస్పీ జాషువా తీరును విపక్షాలు తప్పుపట్టాయి. తమ మాట వినరని భావించిన దాదాపు 15 మందికి డీవో ఇవ్వగా, వారిలో కొందరు మార్చి 21, 22 తేదీల్లో ఆయా స్టేషన్లు, ఎస్బీలో రిపోర్టు చేశారు. కోడ్‌ వచ్చాక ఎవరెవరు విధుల్లో చేరారు? ఇందుకు కారణాలేంటన్నది ఈసీ విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని