మల్లిక స్పైన్‌ సెంటర్‌కు అంతర్జాతీయ అవార్డు

స్పాండిలైటిస్‌ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్‌ సెంటర్‌ డైరెక్టర్‌, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్‌బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది.

Published : 30 Apr 2024 05:22 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: స్పాండిలైటిస్‌ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్‌ సెంటర్‌ డైరెక్టర్‌, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్‌బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. స్కోలియోసిస్‌ రీసెర్చ్‌ సొసైటీ ‘థామస్‌ ఈ వైట్‌క్లవుడ్‌’ పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డు దక్కిన తొలి భారతీయ వైద్యుడిగా ఆయన గుర్తింపు పొందారు. గుంటూరు కొత్తపేటలోని మల్లిక స్పైన్‌ సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం..‘మెడ, వెన్ను నొప్పి, చేయి జాలు, తిమ్మిర్లు, నడకలో ఇబ్బందులతో వచ్చిన పలువురు రోగులను పడుకోబెట్టి ఎంఆర్‌ఐ తీయగా వ్యాధికి సంబంధించి ఎలాంటి ఆధారం కనిపించలేదు. ఔషధాలు వాడినప్పటికీ ఫలితం ఉండటంలేదని, నొప్పులు భరించలేకపోతున్నామని పలువురు రోగులు వాపోయేవారు. దీంతో రోగిని కూర్చోబెట్టి, నిటారుగా నిలబెట్టి, తల ముందుకు, వెనక్కి వంచి ఇలా నాలుగు భంగిమల్లో డైనమిక్‌ ఎంఆర్‌ఐ యంత్రం ద్వారా స్కానింగ్‌ తీశారు. మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. ఈ విధానంలో తీసిన ఎంఆర్‌ఐలో రోగి తల బరువు, కదలికల ప్రభావం మెడలోని నరాలపై ఏమేరకు అదనంగా ఒత్తిడి కలగజేస్తుందో చాలా స్పష్టంగా గుర్తించగలిగారు. దీని ఆధారంగా వ్యాధిని నిర్ధారించి చికిత్స అందించగా రోగులు పూర్తిగా కోలుకున్నారు. ఈ విధానంలో వ్యాధి నిర్ధారణ చేయొచ్చనే విషయాన్ని ప్రపంచంలోనే మొదటిసారి డైనమిక్‌ పరిశోధన ద్వారా తెలిసింది. కాలిఫోర్నియాలో ఈనెల 10 నుంచి 15వరకు నిర్వహించిన స్కోలియోసిస్‌ రీసెర్చ్‌ సొసైటీ 31వ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును ఆ సొసైటీ అధ్యక్షుడు మారినస్‌ డీ క్లెవోర్‌ అందజేశారు’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని