Yadadri: భక్తజన.. నారసింహా

ఆరేళ్లుగా ఎదురుచూసిన మహోత్తర ఘట్టం రానే వచ్చింది..  కొండంతా ‘నమో నారసింహ’ మంత్రంతో మారుమోగింది.. ఆకాశమంతా అరుణ కాంతులు ప్రసరిస్తున్నవేళ యాదాద్రి క్షేత్రం దేదీప్యమానమైంది.. ఆలయమంతా పచ్చని తోరణాలు, పుష్పాలు, అరటి బోదెల అలంకరణలతో శోభాయమానమైంది.. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులంతా తరలి వచ్చారు.. రుత్వికులు మంత్రపఠనం చేశారు.. మహా సంప్రోక్షణ మొదలైంది.. బంగారు వాకిళ్లు తెరుచుకున్నాయి.. మూలవరుల పునర్దర్శనంతో భక్తులంతా తన్మయత్వం చెందారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వంతో మొదలైన క్రతువు సాయంత్రం జరిగిన శాంతికల్యాణంతో పరిపూర్ణమైంది.

Updated : 29 Mar 2022 05:55 IST

శోభాయమానంగా యాదాద్రి సమారోహం
మహాకుంభ సంప్రోక్షణ క్రతువులో  సతీసమేతంగా పాల్గొన్న సీఎం కేసీఆర్‌  
విమానగోపురంపై శ్రీచక్ర ప్రతిష్ఠాపన
స్వయంభువుల దర్శనాలు ప్రారంభం  
స్వామి సేవలో రాష్ట్ర మంత్రివర్గం,  అధికార యంత్రాంగం
ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట

ఆరేళ్లుగా ఎదురుచూసిన మహోత్తర ఘట్టం రానే వచ్చింది..  కొండంతా ‘నమో నారసింహ’ మంత్రంతో మారుమోగింది.. ఆకాశమంతా అరుణ కాంతులు ప్రసరిస్తున్నవేళ యాదాద్రి క్షేత్రం దేదీప్యమానమైంది.. ఆలయమంతా పచ్చని తోరణాలు, పుష్పాలు, అరటి బోదెల అలంకరణలతో శోభాయమానమైంది.. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులంతా తరలి వచ్చారు.. రుత్వికులు మంత్రపఠనం చేశారు.. మహా సంప్రోక్షణ మొదలైంది.. బంగారు వాకిళ్లు తెరుచుకున్నాయి.. మూలవరుల పునర్దర్శనంతో భక్తులంతా తన్మయత్వం చెందారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వంతో మొదలైన క్రతువు సాయంత్రం జరిగిన శాంతికల్యాణంతో పరిపూర్ణమైంది.


స్వయంభు దర్శనం.. సాకారం

స్తంభోద్భవుడైన నరసింహుడి లక్ష్మీ సమేత ఆవాసమైన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు సోమవారం శోభాయమానంగా జరిగింది. వేద మంత్ర ఘోషతో కొండంతా ఆధ్యాత్మికత ఉట్టిపడింది. వారం రోజులుగా సాగిన పంచకుండాత్మక మహాయాగంలో పూజించిన నదీజలాలతో కూడిన మహాకుంభ సంప్రోక్షణ పర్వం ఆలయ శిఖరాలపై ఏకకాలంలో కొనసాగింది. స్వామి విమానంపై శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారులకు పూజలు నిర్వహించి మహాకుంభ సంప్రోక్షణ పర్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేత ప్రధానార్చకులు నల్లంథిగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు జరిపించారు. మిగతా ఆరు గోపురాలు, అష్టభుజ మండప విమానాలపై ఉన్న కలశాల సంప్రోక్షణను ముఖ్యమంత్రి కేసీఆర్‌, అసెంబ్లీ స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ సహా రాష్ట్ర మంత్రులు వారి కుటుంబ సభ్యులతో నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు ఈ మహాక్రతువు కొనసాగింది. హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా పాల్గొనడం ఇదే ప్రథమమని ఆలయవర్గాలు పేర్కొన్నాయి.

కనుల పండువగా శోభాయాత్ర

అంతకుముందు బాలాలయంలో వారంరోజుల పాటు జరిగిన పంచకుండాత్మక మహాయాగం మహాపూర్ణాహుతితో ముగియగా.. సరిగ్గా ఉదయం 9.56 గంటలకు ఆ ప్రాంగణం నుంచి స్వామివారి శోభాయాత్ర మొదలైంది. ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ అనంతరం మూర్తులను గర్భాలయంలోకి చేర్చారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా స్వామి ప్రతిష్ఠామూర్తులను భుజానెత్తుకుని సేవలో పాల్గొన్నారు. నిర్ణయించిన ముహూర్తం మిథునలగ్నం, ఏకాదశి, సోమవారం ఉదయం 11.55 గంటలకు విమానంపై శ్రీ సుదర్శన చక్రం ప్రతిష్ఠాపన అనంతరం గర్భాలయంలో స్వయంభువుల దర్శనాలు మొదలయ్యాయి. సాయంత్రం జరిగిన శాంతికల్యాణంతో క్రతువు పరిపూర్ణమైంది.

తొలిపూజలో సీఎం దంపతులు

ప్రధానాలయ మహాముఖ మండపంలో మంత్రులు, ఇతర ముఖ్యులను, వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ గర్భాలయం వద్దకు చేరిన సీఎం సమక్షంలో అర్చకులు స్వర్ణ ద్వారాలను తెరిచారు. అనంతరం చేపట్టిన గడప పూజను సీఎం సతీమణి శోభ, కుమార్తె కవిత, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు నిర్వహించారు. అనంతరం పూజారులు నిర్వహించిన తొలి ఆరాధనలో పాల్గొని మూలవరులను సీఎంతో పాటు కుటుంబసభ్యులు దర్శనం చేసుకొని, ఆశీస్సులు పొందారు. అనంతరం ముఖమండపంలో వేచి ఉన్న వారంతా మూలవరుల దర్శనం చేసుకున్నారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వంతో మొదలైన క్రతువు సాయంత్రం శాంతికల్యాణంతో పరిపూర్ణమైంది.

క్షేత్రాభివృద్ధిలో పాల్గొన్నవారిని సత్కరించిన కేసీఆర్‌

యాదాద్రి క్షేత్రాభివృద్ధిలో శ్రమించిన వివిధ రంగాలకు చెందిన 44 మంది నిపుణులను సీఎం కేసీఆర్‌, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు సన్మానించారు. ప్రధాన స్థపతులు సుందర్‌రాజన్‌, ఆనందాచారి వేలు, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, ఈవో గీతతో పాటు ఇంజినీర్లు, శిల్పులు, ప్రభుత్వ అధికారులు, వాస్తు నిపుణులు సన్మానం అందుకున్నవారిలో ఉన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావును ప్రత్యేకంగా సీఎం కేసీఆర్‌ తన మెడలో ఉన్న కండువాతో సన్మానించారు. అనంతరం ఆలయం తరఫున సీఎం కేసీఆర్‌ను మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సహా ఆలయ ఈఓ గీత, వైటీడీఏ కిషన్‌రావు సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

భక్తులకు నిజదర్శనాలు ప్రారంభం

మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు మూలవరుల నిజదర్శనాలు మొదలయ్యాయి. ఉదయం నుంచి కొండ కింద వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా ఆలయానికి చేరుకోగా.. దర్శనానికి టోకెన్‌తోనే రావాలని పోలీసులు వెనక్కు పంపేశారు. దీంతో వారంతా కొండ దిగి కల్యాణకట్ట వద్దకు వెళ్లి అక్కడ ఇస్తున్న టోకెన్లు తీసుకుని వచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకున్నారు.

భద్రత బాధ్యత ఆక్టోపస్‌కు?

ఈనాడు, నల్గొండ: యాదాద్రి ఆలయ భద్రతను ప్రత్యేక పోలీసు విభాగమైన ఆక్టోపస్‌కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆలయ మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా సోమవారం ఆక్టోపస్‌ కమాండోలు ఆలయానికి భద్రత కల్పించారు. క్షేత్రాభివృద్ధికి సంకల్పించిన సమయంలోనే ఆలయానికి ప్రత్యేక విభాగం ద్వారా భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సైతం ఆక్టోపస్‌ బలగాలే భద్రత బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం క్షేత్రంలో జరుగుతున్న పనులతో పాటు ఆలయ నిర్వహణ బాధ్యతలను ఐఏఎస్‌ స్థాయి అధికారికి అప్పగించనున్నట్లు సమాచారం.


జీవితంలో మరచిపోలేని రోజు

- ఆనంద్‌సాయి, ఆర్కిటెక్ట్‌

ఇంతపెద్ద భవ్య ఆలయ నిర్మాణంలో నేనూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఉద్ఘాటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ సన్మానించిన ఈ రోజును నేను జీవితంలో మరచిపోలేను. ఈ జన్మకిది చాలు.


నారసింహుడి దయ

- కిషన్‌రావు, వైటీడీఏ వైస్‌ ఛైర్మన్‌

అద్భుత శిల్పాకళాసంపదతో కట్టిన ఈ ఆలయం అభివృద్ధి కమిటీకి సీఎం కేసీఆర్‌ ఛైర్మన్‌గా.. నేను వైస్‌ఛైర్మన్‌గా ఉండటం ఆ నారసింహుడి దయవల్లే అనుకుంటున్నా.


పూర్వజన్మ సుకృతం

- గీత, ఈవో, యాదాద్రి దేవస్థానం

ఆలయ ఉద్ఘాటన పర్వం నేను ఈవోగా ఉన్న సమయంలో జరగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సీఎం కేసీఆర్‌ వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. పునర్‌నిర్మాణం నుంచి ఉద్ఘాటన వరకు ఈవోగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని