Buy Now pay Later: చేతిలో డబ్బు లేకున్నా.. ఖర్చు చేస్తుంటే..!

చేతిలో డబ్బు ఉన్నప్పుడే కొనాలి అనే రోజులు ఎప్పుడో పోయాయి. ఖర్చు చేసేందుకు ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డులు, ఈఎంఐ కార్డులు, ఇప్పుడు కొనండి..

Updated : 13 Aug 2021 10:02 IST

చేతిలో డబ్బు ఉన్నప్పుడే కొనాలి అనే రోజులు ఎప్పుడో పోయాయి. ఖర్చు చేసేందుకు ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డులు, ఈఎంఐ కార్డులు, ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి అంటూ వస్తున్న కొత్త ఆఫర్లు... వినియోగదారులు వీటిలో ఏవి ఎంచుకుంటే.. లాభం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

క్రెడిట్‌ కార్డులతో..

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్చి 2021లో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో దాదాపు 6.2 కోట్ల క్రెడిట్‌ కార్డులు వాడుకలో ఉన్నాయి. ఇవి దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన చెల్లింపు సాధనాలుగా మారిపోయాయి. బిల్లు చెల్లించేందుకు 50 రోజుల పాటు వ్యవధి ఉండటం, కొన్ని ఖర్చులపై ఈఎంఐ సౌకర్యం కల్పించడం, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు, రివార్డు పాయింట్లు.. ఇలా కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు ఈ కార్డులు ఎన్నో వెసులుబాట్లను అందిస్తుంటాయి. కొన్ని కార్డుల వినియోగదారులకు విమానాశ్రయాల లాంజ్‌లను ఉచితంగా వినియోగించుకునే సౌలభ్యం లాంటివీ ఉంటాయి. ప్రయాణ బీమా పాలసీలనూ అందిస్తాయి.

ఇలా చెబుతూ వెళ్తే.. క్రెడిట్‌ కార్డులు ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అయితే, ఇదంతా మీరు బిల్లును గడువులోపు చెల్లించినప్పుడే. ఒకసారి బిల్లు చెల్లించకపోతే ఆలస్యపు రుసుములతో పాటు.. నెలకు 3-4శాతం వడ్డీని కూడా భరించాల్సిందే. కొన్ని ప్రీమియం కార్డులు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించినప్పటికీ.. వాటికి ఏడాదికి సభ్యత్వ రుసుము చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, మీకు అర్హత ఉన్న క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడమే మేలు. దీనిద్వారా కాస్త తక్కువ ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మీ అవసరాలకు సరిపోవచ్చు. క్రెడిట్‌ కార్డులను క్రమశిక్షణతో ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే.. వడ్డీ, జరిమానాలతోపాటు మీ క్రెడిట్‌ స్కోరునూ ఇది తగ్గిస్తుంది. వీలైనంత వరకూ మొత్తం బాకీని చెల్లించేందుకే ప్రయత్నించండి.

వాయిదాల్లో చెల్లించేలా..

ముందస్తుగానే మంజూరైన రుణంలాంటివి ఈఎంఐ కార్డులు. ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద.. కొన్ని వస్తువులను కొన్నప్పుడు ఈఎంఐ కార్డులను వినియోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి వడ్డీ లేకుండా వస్తువులను కొనుగోలు చేయొచ్చు. వీటిని అర్థం చేసుకోవడం, వినియోగించడం ఎంతో సులువు. సాధారణంగా క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే.. ఈ కార్డులను పొందడం చాలా సులువనే చెప్పాలి. నిబంధనలూ తక్కుగా ఉంటాయి. ఈఎంఐని వ్యవధినాడు చెల్లించకపోతే రుసుములు విధిస్తాయి. రుణాన్ని ముందుగానే చెల్లించినా.. ఎలాంటి ముందస్తు చెల్లింపు రుసుములు ఉండవు.


తర్వాత చెల్లించండి...

ప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి.. (బై నౌ, పే లేటర్‌- బీఎన్‌పీఎల్‌) ఇటీవల కాలంలో ఇది బాగా ఆదరణ పొందుతోంది. పలు బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. బిల్లు చెల్లించేందుకు సాధారణంగా 15 నుంచి 45 రోజుల వరకూ వ్యవధి ఇస్తున్నారు. చెల్లింపు తేదీన వినియోగదారుడి బ్యాంకు ఖాతా నుంచి నేరుగా డబ్బు డెబిట్‌ అయిపోతుంది. నిర్ణీత వ్యవధిలోగా చెల్లించకపోతే.. వర్తించే వడ్డీ రేట్ల ప్రకారం అపరాధ రుసుమును బ్యాంకు వసూలు చేస్తుంది.ఒకేసారి చెల్లించడం వీలుకాకపోతే ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటునూ కొన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.


మీరు ఖర్చు చేసే విధానాన్ని బట్టి, ఈ మూడింటిలో ఏది మీకు సరిపోతుందన్నది ఎంచుకోవాలి. దేనికి తక్కువ రుసుములు ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నగదు వెనక్కి, రివార్డు పాయింట్ల లాంటివి దీర్ఘకాలంలో మంచి ప్రయోజనం ఇస్తాయి. ఇలాంటి వాటితోపాటు మీరు తరచూ ప్రయాణాలు చేసే వారైతే క్రెడిట్‌ కార్డుల వాడకం ఉత్తమం. ఎంపిక చేసిన వ్యాపారుల నుంచి వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే.. ఈఎంఐ కార్డులు, బీఎన్‌పీఎల్‌లలో ఏది కలిసొస్తుందో బేరీజు వేసుకోవాలి. క్రెడిట్‌ కార్డులు లేని వారికి ఈ పద్ధతులు సరిపోతాయి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని