Updated : 02 Nov 2021 16:48 IST

Term Policy: ట‌ర్మ్ పాల‌సీ ఎంపిక‌లో ఈ తప్పులు చేయొద్దు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధార‌ణంగా భ‌విష్య‌త్‌లో పూర్తి చేయాల్సిన బాధ్యతలు, ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఆర్థిక ప్ర‌ణాళికలు వేస్తుంటారు. అయితే, జీవితంలో ప్ర‌తి దాన్నీ పూర్తి స్థాయిలో ఊహించడం అసాధ్యం. అయిన‌ప్ప‌టికీ మనం వెళ్లే మార్గంలో ఎదుర‌య్యే ప్ర‌తి స‌వాలునూ ఎదుర్కునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఇందులో భాగంగా చేయాల్సిన మొట్ట‌మొద‌టి ప‌ని.. మీరు లేని స‌మ‌యంలో కూడా కుటుంబానికి ఆర్థిక భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌డం. ఇది ట‌ర్మ్ పాల‌సీతో సాధ్యం అవుతుంది. మ‌ర‌ణానంత‌రం ఎటువంటి ఇబ్బందులూ, స‌మ‌స్య‌లూ త‌లెత్త‌కుండా క్లెయిమ్ మొత్తం కుటుంబ స‌భ్యుల‌కు చేరాల‌ని కోరుకుంటారు పాల‌సీదారులు. అలా చేరాలంటే పాల‌సీ కొనుగోలు సమయంలో త‌ప్పులు చేయ‌కూడ‌దు. సాధార‌ణంగా చేసే త‌ప్పుల‌ను తెలుసుకుంటే వాటిని చేయ‌కుండా జాగ్ర‌త్త పడొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

తగినంత బీమా హామీ లేక‌పోవ‌డం: టర్మ్ పాలసీ కొనుగోలు వెనుక ఉన్న అస‌లు ల‌క్ష్యం.. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే, అతడు/ఆమె కుటుంబం మొత్తం ఆర్థిక విషయాల గురించి చింతించకుండా చ‌క్క‌గా జీవించగ‌ల‌గ‌డం. ఒక‌వేళ హామీ మొత్తం కుటుంబ భ‌విష్య‌త్‌ అవ‌స‌రాల‌కు స‌రిప‌డినంత లేక‌పోతే.. పాల‌సీ కొనుగోలు చేసిన ల‌క్ష్యం నెర‌వేర‌దు. ఆర్థిక ఇబ్బందులు త‌ప్ప‌వు. ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేసే వారిలో చాలా మంది ఈ త‌ప్పు చేస్తున్నారు. భ‌విష్య‌త్‌ అవ‌స‌రాల‌ను అంచ‌నా వేయ‌డంలో త‌డ‌బ‌డుతున్నారు. ముఖ్యంగా ద్ర‌వ్యోల్బణం, వివిధ‌ అనుబంధ అంశాల‌ను లెక్క‌లోకి తీసుకోవ‌డం లేదు. ట‌ర్మ్ పాల‌సీని ఎంచుకునేటప్పుడు ఈ త‌ప్పు చేయ‌కండి. వ్య‌క్తి ఆదాయం, ఖ‌ర్చులు, పెట్టుబ‌డులు, భ‌విష్య‌త్‌ అవ‌సరాలు, గృహ‌, వాహ‌న‌, వ్య‌క్తిగ‌త రుణాలు, కుటుంబ జీవ‌న ప్ర‌మాణాలు, ద్ర‌వ్యోల్బణం, వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని బీమా మొత్తాన్ని లెక్కించాలి. నిపుణుల ప్ర‌కారం ఒక వ్య‌క్తి వార్షిక ఆదాయానికి క‌నీసం 12-15 రెట్లు అధికంగా బీమా మొత్తం ఉండేలా ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేయాలి.

ప్రీమియం ఆధారంగా: సాధార‌ణంగా పాల‌సీ కొనుగోలు చేసేటప్పుడు ప్రీమియం ఎంత అనేది ప్ర‌ధానంగా చూస్తారు. కానీ ప్రీమియం మాత్ర‌మే ఆధారంగా చేసుకుని, పాల‌సీ కొనుగోలు చేయ‌డం స‌రికాద‌ని నిపుణులు చెప్తున్నారు. పాల‌సీ కొనుగోలుకు మంచి పేరున్న‌ బీమా సంస్థ‌ను ఎంచుకోవ‌డం చాలా ముఖ్యం. ప్రీమియం, హామీ మొత్తంతో పాటు సంస్థ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోని చూడాలి. బీమా సంస్థ‌లు మొత్తంగా ఎన్ని క్లెయిమ్‌ల‌ను తీసుకున్నాయి? అందులో ఎన్ని క్లెయిమ్‌ల‌ను సెటిల్‌చేశాయి? ఎంత మొత్తాన్ని క్లెయిమ్ రూపంలో చెల్లించాయి? అనే విష‌యాల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలుసుకుని బీమా సంస్థ‌ను ఎంచుకోవాలి.

కొనుగోలులో జాప్యం: ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు చేస్తున్నారంటే మ‌ర‌ణానంత‌రం కుటుంబానికి ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నార‌ని అర్థం. వ‌య‌సు పెరిగే కొద్ది రిస్క్ పెరుగుతుంది. రిస్క్ పెరిగే కొద్ది ప్రీమియం కూడా పెరుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు 25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో రూ.50 ల‌క్ష‌ల హామీ మొత్తంతో ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు చేస్తే చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం రూ.5వేలు ఉంటే.. 35 ఏళ్ల వ‌య‌సులో అంతే హామీ మొత్తంతో పాల‌సీ కొనుగోలు చేస్తే దాదాపు రూ.9వేలు చెల్లించాల్సి వ‌స్తుంది. అంటే కొనుగోలు ఆల‌స్యమయ్యే కొద్దీ ప్రీమియం మొత్తం పెరుగుతుంది.

వివ‌రాలు దాచిపెట్ట‌డం: ట‌ర్మ్ పాల‌సీ తీసుకున్న‌ప్పుడు వైద్య చ‌రిత్ర‌, ఆర్థిక స్థితి వంటి కీల‌క విష‌యాల‌కు సంబంధించి స‌మాచారాన్ని దాచిపెట్టి చాలా మంది త‌ప్పులు చేస్తుంటారు. ఈ ప్ర‌భావం క్లెయిమ్ సెటిల్‌మెంట్ స‌మ‌యంలో ప‌డే అవ‌కాశం ఉంది. ముందుగా నిర్ధారణ అయిన వ్యాధులు, ధూమ‌పానం, మధ్య‌పానం వంటి జీవన శైలి అల‌వాట్ల గురించి ముందుగానే వివ‌రించాలి. వీటి కార‌ణంగా ప్రీమియం కొంత‌ పెరిగినా క్లెయిమ్‌కు ఇబ్బంది ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ఏదైనా వ్యాధి కార‌ణంగా పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. ఈ విష‌యాన్ని దాచిపెట్ట‌డం వ‌ల్ల బీమా సంస్థ క్లెయిమ్ మొత్తాన్ని తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే పూర్తి వివ‌రాల‌ను బీమా సంస్థ‌కు అందించాలి.

ప‌న్ను ఆదా కోసం: ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి కింద‌ జీవిత బీమా పాలసీ ప్రీమియంపై రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం ఉంది. అలాగే సెక్ష‌న్ 10 (10D) ప్ర‌కారం మెచ్యూరిటీ స‌మ‌యం లేదా పాల‌సీదారుని మ‌ర‌ణం కార‌ణంగా చెల్లించే హామీ మొత్తం, బోన‌స్‌ (ఏదైనా వ‌ర్తిస్తే) కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు లోబ‌డి పూర్తి ప‌న్ను ర‌హితంగా వ‌స్తాయి. అయితే, ప‌న్ను ఆదా చేయ‌డమే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు చేయ‌డం మంచిది కాదు. ప‌న్ను ఆదా కోసం చివ‌రి నిమిషంలో పాల‌సీని కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ప్రీమియంపై మాత్ర‌మే దృష్టిపెడ‌తారు. ఎంత హామీ మొత్తం కావాలి వంటి అంశాల‌పై దృష్టిపెట్ట‌రు.

త‌క్కువ‌ కాల‌ప‌రిమితి: ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు చేస్తే బీమా చేసిన వ్య‌క్తి పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో మ‌ర‌ణిస్తే నామినీకి హామీ మొత్తం అందుతుంది. లేదంటే ఏమీ చెల్లించ‌రు. అయితే ప్రీమియం రిట‌ర్నుతో వ‌చ్చే ట‌ర్మ్ పాల‌సీల్లో మాత్రం ప్రీమియం తిరిగి చెల్లిస్తారు. వీటిలో కూడా పాల‌సీదారుడు కాల‌ప‌రిమితి వ‌ర‌కు జీవించే ఉంటే హామీ మొత్తం చెల్లించ‌రు. ప్రీమియం త‌గ్గించుకునేందుకు కొంత‌మంది స్వ‌ల్ప‌ కాల‌వ్య‌వ‌ధితో పాల‌సీని తీసుకుంటారు. ఒక‌వేళ మీరు కొనుగోలు చేసిన పాల‌సీ మీ 50 ఏళ్ల వ‌య‌సులో ముగిస్తే.. అప్ప‌టికి కుటుంబ భాద్య‌త‌లు తీర‌వు కాబ‌ట్టి పాల‌సీ అవ‌స‌రం ఉంటుంది. పాల‌సీ పునరుద్ధ‌రించినా, కొత్త పాలసీ కొనుగోలు చేసినా ప్రీమియం మొత్తం చాలా ఎక్కువ‌వుతుంది. అలాగ‌ని పాల‌సీ కొనుగోలు చేయ‌క‌పోతే ఆర్థిక భ‌ద్ర‌త ఉండ‌దు. అందువ‌ల్ల త‌క్కువ కాల‌వ్య‌వ‌ధితో పాల‌సీ తీసుకోవ‌డం స‌రికాదు. క‌నీసం 60 ఏళ్లు వచ్చే వ‌ర‌కు ట‌ర్మ్‌ పాల‌సీని కొన‌సాగించాలని నిపుణులు చెప్తుంటారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని