స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డులు... ఈ త‌ప్పులు చేయ‌కండి

స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేముందు పూర్తి అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌టం చాలా అవ‌స‌రం......

Updated : 01 Jan 2021 19:54 IST

స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేముందు పూర్తి అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌టం చాలా అవ‌స‌రం.

రాజ్‌ వ‌య‌సు 36 సంవ‌త్స‌రాలు, గ‌త సెప్టెంబ‌ర్ వ‌ర‌కు పెట్టుబ‌డుల విష‌యంలో రిస్క్ తీసుకునేందుకు అస‌లు ఇష్ట‌ప‌డేవారు కాదు. అందుకే రిస్క్ లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవాడు. దీంతో వార్షికంగా 7 శాతం వ‌ర‌కు ఆదాయాన్ని పొందుతున్నాడు. అత‌డి స్నేహితులు మాత్రం స్టాక్ మార్కెట్ల పెట్టుబ‌డుల‌తో మంచి లాభాల‌ను పొందుతున్నార‌న్న విష‌యాన్ని గుర్తించాడు. అప్పుడు వారు చెప్పిన ఒక బ్రోక‌ర్‌ను క‌లిశాడు. అత‌డు చెప్పిన‌ట్లుగా ఫారంలు స‌మ‌ర్పించి డిమ్యాట్ ఖాతాను ప్రారంభించాడు. వారం రోజుల్లోనే అత‌నికి మంచి లాభాలు వ‌చ్చాయి. అక్టోబ‌ర్ 2017 లో రూ.5ల‌క్ష‌ల పెట్టుబ‌డులు చేసాడు, అవి జ‌న‌వ‌రి 2018 నాటికి 20 శాతం వృద్ధిని క‌న‌బ‌రిచాయి. వ‌స్తున్న లాభాల‌ను చూసి అత‌డు ఇప్పుడు ఉద్యోగం కంటే స్టాక్ మార్కెట్ మీదే ఎక్కువ దృష్టి వ‌హించాడు. అయితే ఈ ప్రాసెస్‌లో అత‌డు రిస్క్ గురించి ఆలోచించ‌డం మానేశాడు. పొదుపు ప‌థ‌కాల నుంచి డ‌బ్బు అంతా తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించాడు. ఇంత‌కుముందు అత‌ని పెట్టుబ‌డుల‌న్నీ డెట్ ఫండ్ల‌లో ఎక్కువ‌గా ఉండేవి ఇప్పుడు ఈక్విటీల‌లో కి చేరాయి. డ‌బ్బుని మ‌రింత సంపాదించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంత‌కుముందు కోల్పోయిన లాభాల‌న్ని తిరిగి పొందాల‌నే ఆతుర‌త‌తో రిస్క్ గురించి ఏ మాత్రం ఆలోచించ‌కుండా పెట్టుబ‌డులు కొన‌సాగించాడు. లార్జ్ క్యాప్ ఫండ్ల‌లో ఎక్కువ పెట్టుబ‌డులు పెట్ట‌డం కొన‌సాగించాడు. ఇత‌రులు అత‌డి ముందు ఉన్న ప్ర‌మాదం గురించి హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేడు.

జ‌న‌వ‌రిలో అత‌డి మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఫండ్లులో మ‌రిన్ని పెట్టుబ‌డులు చేశాడు. మార్కెట్లు మ‌రింత లాభ‌ప‌డ‌తాయ‌ని ఆశించాడు. అయితే అనుకోకుండా కేంద్రం బ‌డ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి మార్కెట్లు న‌ష్టాల్లోకి చేరుకున్నాయి. రాజ్‌ స్టాక్స్ ఇప్పుడు 50 నుంచి 60 శాతం వ‌ర‌కు న‌ష్ట‌పోయాయి. సంపాదించిన మొత్తం ఆవిరైపోయింది. మ‌రి ఇలా జ‌ర‌గుకూడ‌దంటే మీరు పెట్టుబ‌డులు పెట్టేముందు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

సాధార‌ణంగా పెట్టుబ‌డుదారులు చేసే త‌ప్పులు:

  1. స్టాక్ మార్కెట్ గురించి అవ‌గాహ‌న లేకుండా పెట్టుబ‌డులు పెట్ట‌డం

రాజ్‌ చేసిన పెద్ద త‌ప్పు ఏంటంటే మార్కెట్లు ఒడుదొడుకుల గురించి అర్థం చేసుకోకుండా పెట్టుబ‌డులు పెట్ట‌డం. అత‌డి చుట్టూ ఉన్న‌వారి మాట‌లు విని అత్యాశ‌కు పోవ‌డం. పెట్టుబ‌డులు ప్రారంభించే ముందు వివిధ ర‌కాల పెట్టుబ‌డి సాధ‌నాలు, రిస్క్ గురించి తెలుసుకోవ‌డం చాలా అవ‌స‌రం.

  1. ల‌క్ష్యం లేకుండా పెట్టుబ‌డులు చేయ‌డం

ఆర్థిక ప‌రిస్థితులు, లిక్విడిటీ, బీమా, పెట్టుబ‌డులు, ప‌ద‌వీ విర‌మ‌ణ‌, ప‌న్ను, ద్ర‌వ్యోల్బ‌ణం వంటివాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థిక అవ‌స‌రాలు, ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం పెట్టుబ‌డులను కొన‌సాగించాలి. ల‌క్ష్యం లేకుండా పెట్టుబ‌డులు పెడితే త‌ప్పుదారి ప‌ట్టే అవ‌కాశ‌ముంది. అందుకే ల‌క్ష్యాల‌ను దృష్టిలో పెట్టుకొని వాటిని చేరేందుకు ప్ర‌య‌త్నించాలి.

  1. ఆర్థిక స‌ల‌హాదారుల సూచ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం

ఈ బిజీ జీవితాల్లో పెట్టుబ‌డుల గురించి ఆలోచించ‌డం, స‌రైన నిర్ణ‌యాలు తీసుకునేంత స‌మ‌యం ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే ఆర్థిక స‌ల‌హాదారుని సంప్ర‌దించి మీ పెట్టుబ‌డులు, ల‌క్ష్యాల గురించి వివ‌రిస్తే దానికి త‌గిన‌ట్లుగా సూచ‌న‌లిస్తారు. చుట్టూ ఉన్న‌వారు చెప్పార‌ని తెలియ‌కుండా ఏదో ఒక‌దానిలో పెట్టుబ‌డులు పెడితే క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు వృథా అవుతుంది. రిస్క్ గురించి ఆలోచించి పెట్టుబ‌డులు కొన‌సాగించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని