
టీకా కొరతకు ‘కొవిడ్ సురక్షా’తో చెక్!
దేశీయ టీకాల తయారీకి ఆయా సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం
దిల్లీ: దేశంలో కరోనా టీకాల కొరత వేధిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద కొవిడ్ సురక్షా పథకాన్ని ప్రకటించింది. దీన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగా దేశీయంగా రూపొందించిన కొవిడ్ టీకాల ఉత్పత్తి పెంపును ప్రోత్సహించనున్నారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆయా తయారీ సంస్థలకు ఏప్రిల్‌లో ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం అందించింది. సెప్టెంబరు నాటికి కొవాగ్జిన్ టీకా తయారీని 10 కోట్ల డోసులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా భారత్ బయోటెక్ సహా ఇతర ప్రభుత్వ రంగ తయారీ సంస్థలను కావాల్సిన వసతులతో అభివృద్ధి చేస్తున్నారు. బెంగళూరులో రూపుదిద్దుకొంటున్న భారత్ బయోటెక్ కొత్త తయారీ కేంద్రానికి రూ.65 కోట్లను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో అందజేసింది.
* అలాగే మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆఫ్కిన్ బయోఫార్మాకు రూ.65 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందించింది. దీంతో ఈ సంస్థ తయారీ సామర్థ్యం నెలకు 20 మిలియన్ డోసులకు పెంచనున్నారు.
* హైదరాబాద్‌లో జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్)కు రూ.60 కోట్లు అందించనున్నారు.
* డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్ కు రూ.30 కోట్లు గ్రాంట్ల రూపంలో అందించనున్నారు. దీంతో ఇక్కడి తయారీ సామర్థ్యాన్ని నెలకు 10-15 మిలియన్ డోసులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
* వీటితో పాటు గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చి సెంటర్, హెస్టర్ బయోసైన్సెస్, ఓమ్నీబీఆర్‌ఎక్స్‌తో కలిసి గుజరాత్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్ వంటి సంస్థలు భారత్ బయోటెక్‌తో చర్చలు జరుపుతున్నాయి. ఇవన్నీ కలిపి నెలకు మరో 20 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నాయి.