CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువుంటే లోన్‌ తీసుకోవడం ఎలా?

సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉంటే పర్సనల్‌ లోన్ తీసుకోవడం ఎలా?మరి సిబిల్‌ స్కోర్‌ మెరుగుపరుచుకోవడం ఎలా?

Updated : 03 Sep 2021 14:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖరీదైన ఆస్తులు, వస్తువులు, వాహనాలు కొనాలంటే రుణం తీసుకోవడం తప్పనిసరి. మరి రుణం మంజూరు కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అందులో సిబిల్‌ స్కోర్‌ ఒకటి. అయితే, అనివార్య కారణాల వల్ల కొన్నిసార్లు సిబిల్‌ తగ్గుతుంటుంది. తెలిసో, తెలియకో చేసిన పొరపాట్లు సిబిల్‌ స్కోర్‌ను కిందకు లాగుతాయి. అలాంటప్పుడు అత్యవసర పరిస్థితి ఉంటే పర్సనల్‌ లోన్ తీసుకోవడం ఎలా?

మంచి సిబిల్‌ స్కోర్‌ అంటే ఎంత?

సిబిల్‌ స్కోరును క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(ఇండియా) లిమిటెడ్‌ (సిబిల్‌) నిర్వహిస్తుంది. వ్యక్తి రుణ చరిత్ర ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. పలు అంశాలను, ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. సాధారణంగా సిబిల్‌ 1000కి గానూ 550 కంటే ఎక్కువ ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అప్పుడే రుణం మంజూరులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఒక్కోసారి అంతకంటే తక్కువ ఉన్నా రుణం మంజూరు చేస్తారు. కానీ, వడ్డీరేటు ఎక్కవ ఉంటుంది! లేదా మంజూరు చేసే మొత్తం మన అవసరానికి సరిపోకపోవచ్చు!

సిబిల్‌ స్కోర్‌.. రుణ మంజూరుకు సంబంధం ఏంటి?

బ్యాంకులకు రుణగ్రహీతలను అంచనా వేయడానికి ఉపయోగపడే కీలక సాధనం సిబిల్‌ స్కోర్‌. స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత సులభంగా రుణం మంజూరవుతుంది. సిబిల్‌ స్కోర్‌ మన రుణ చరిత్రను ప్రతిబింబిస్తుంది. మీరు గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపుల వంటి ఆర్థిక లావాదేవీలను ఈ స్కోరు సూచిస్తుంది. మీ బ్యాంకుల ఖాతాల నిర్వహణను కూడా దీన్ని బట్టి అంచనా వేయొచ్చు. తద్వారా ఆర్థిక అంశాలపై మీరు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో తెలిసిపోతుంది.

సిబిల్‌ తక్కువుంటే.. పర్సనల్‌ లోన్‌ ఎలా?

వ్యక్తిగత రుణం(పర్సనల్‌ లోన్‌) ఎలాంటి తనఖా లేకుండానే ఇచ్చే అన్‌సెక్యూర్డ్‌ రుణం. అలాంటప్పుడు సిబిల్‌ స్కోరే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ స్కోర్‌ తక్కువుంటే పర్సనల్‌ లోన్‌ పొందడం కొంత సవాల్‌తో కూడుకున్నదే. ఒకవేళ ఇచ్చినా.. మనం అడిగిన దాని కంటే తక్కువ సొమ్ము, ఎక్కువ వడ్డీరేటు, తక్కువ కాలపరిమితితో కూడిన రుణాన్ని మంజూరు చేస్తారు. అయితే, కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థలు రూ.10,000-50,000 వరకు రుణాన్ని ఇస్తున్నాయి. సిబిల్‌ విషయంలో ఇవి కాస్త ఉదారంగానే ఉంటున్నాయి! సిబిల్‌కి బదులుగా ఈ సంస్థలు మన మొబైల్‌కి ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చే ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అంచనా వేస్తాయి. కొన్ని ఫిన్‌టెక్‌లైతే.. ప్రత్యేకంగా సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉన్నవాళ్లకే రుణాలు అందిస్తున్నాయి.

సిబిల్‌ మెరుగుపరుచుకునే చిట్కా..

సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉండి, రుణం తప్పనిసరైతే.. డిజిటల్‌ రుణ సంస్థలను ఆశ్రయించడం మేలు! వీటి నుంచి తీసుకొని సకాలంలో చెల్లిస్తే మీ సిబిల్‌ స్కోర్‌ కూడా మెరుగుపడుతుంది. తొలిసారి రుణం తీసుకుంటున్నవారు లేదా తక్కువ సిబిల్‌ స్కోర్‌ ఉన్నవారికి రుణం ఇవ్వడానికి సాధారణ బ్యాంకులు ఆసక్తి చూపవు. అలాంటి సందర్భంలో డిజిటల్‌ లెండర్ల నుంచి రుణం తీసుకొని సక్రమంగా చెల్లిస్తే.. మన సిబిల్‌ స్కోర్‌ పెరిగే అవకాశం ఉంది. అయితే, వీలైనంత వరకు తక్కువ మొత్తంలో రుణం తీసుకొని ఎప్పటికప్పుడు చెల్లించడం ఉపయోగకరంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని