గృహరుణం బదిలీతో లాభం ఉంటుందా? 

రుణం తీసుకున్న‌ తొలినాళ్లలో ఈఎమ్ఐలో అధిక భాగం వడ్డీ కిందే పోతుంది.

Updated : 29 Mar 2021 16:35 IST


గృహ రుణం… జీవితంలో తీసుకునే అతి పెద్ద… అతి ఎక్కువ కాలం కొనసాగే అప్పు. కొన్నేళ్లపాటు దీనికి వాయిదాలు చెల్లిస్తూనే ఉండాలి. ఈ దశలో దీనికి సంబంధించిన వడ్డీలో ఎన్నో హెచ్చుతగ్గులను చూస్తుంటారు. వడ్డీ రేట్లు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు తమపై భారం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి.

మీరు ఎంతో పరిశోధన చేసి, నిపుణుల సలహాలు తీసుకొని గృహ రుణం తీసుకొని ఉంటారు. అవేవీ ఇప్పుడు మీకు సమంజసంగా అనిపించ‌క‌పోవ‌చ్చు. రుణం తీసుకున్నప్పటి పరిస్థితులేమీ ఇప్పుడు కనిపించకపోవచ్చు. తీసుకున్న నాటి నుంచి వడ్డీ రేటు పెరగడమో… లేదా… తగ్గడమో క‌నిపిస్తుంటుంది. ముఖ్యంగా గృహరుణ వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు గృహరుణదారులు రుణ బదిలీ లేదా ప్రస్తుతం రుణం తీసుకున్న బ్యాంకుతో వడ్డీ రేట్ల విషయంలో బేరమాడటం… ఈ రెండింటిలో ఏది లాభదాయకమో చూసుకోవాల్సిన అవసరం ఉంది.

బదిలీ అంటే…

మిగిలిన గృహ రుణ అసలు మొత్తాన్ని తక్కువ వడ్డీ రేటు ఉన్న వేరే బ్యాంకు లేదా గృహ రుణ సంస్థకు మార్చుకోవచ్చు. ఇలా మారినప్పుడు మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్న బ్యాంకు/రుణ సంస్థ మీ రుణాన్ని కొత్త రుణంగా పరిగణనలోనికి తీసుకొంటుంది. మీరు పాత రుణ సంస్థకు బాకీ ఉన్న మొత్తాన్ని తీర్చేస్తుంది. కొత్త రుణం తీసుకుంటున్నప్పుడు వర్తించే వడ్డీ రేటు, ఈఎంఐలు ఇప్పుడు మీకూ వర్తిస్తాయన్నమాట. పాత రుణ ఖాతాను ముగించి, కొత్తగా మరో రుణం తీసుకోవడమే ఈ రుణ బదిలీ ఉద్దేశం.

ఏం చేయాలి?

రుణ బదిలీ అంటే… మళ్లీ మీరు కొత్తగా రుణం తీసుకుంటున్నట్లే అనుకున్నాం కదా… అయితే, దీనికి ముందుగా మీరు కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మొదలు పెట్టేందుకు తొలుత మీ ప్రస్తుత బ్యాంకును సంప్రదించి, రుణం బదిలీ చేసుకునేందుకు తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొంటూ ఇచ్చే నిరంభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని (ఎన్‌ఓసీ) పొందాలి. ఈ ఎన్‌ఓసీతోపాటు, బ్యాంకు బాకీ ఉన్న మొత్తానికి సంబంధించిన వివరాలు కూడా ఇస్తుంది. ఈ రెండు పత్రాలనూ మీరు కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటున్న బ్యాంకుకు సమర్పించాలి. ఆ తర్వాత కొత్త బ్యాంకు మీకు రుణం మంజూరు చేస్తే… ఆ మొత్తం పాత బ్యాంకుకు చెల్లిస్తారు. ఆ తర్వాత పాత బ్యాంకు మీ రుణ ఖాతాను రద్దు చేసి, పత్రాలను కొత్త బ్యాంకుకు అందిస్తుంది. అప్ప‌టి నుంచి ఈఎంఐలు రుణం బదిలీ చేసిన కొత్త బ్యాంకుకు జమచేయాలి.

అవసరం ఏమిటి?

గృహరుణం దీర్ఘకాలిక అప్పు. ఇలాంటపుడు వడ్డీ రేట్లలో ఎక్కువ తేడా ఉంటే ఆ భారం కొన్నేళ్లపాటు మోయాల్సి ఉంటుంది. కాబట్టి, వడ్డీ రేట్లలో గణనీయమైన తేడా ఉన్నప్పుడు కచ్చితంగా రుణ బదిలీ గురించి ఆలోచించాల్సిందే. అయితే, కొన్నిసార్లు ఇది అంత తేలికేమీ కాదు. పైగా ప్రయోజనమూ ఉండకపోవచ్చు. మీరు దీనిని రుణ బదిలీగానే పరిగణించినా… మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్న బ్యాంకు మిమ్మల్ని కొత్త ఖాతాదారుగానే చూస్తుంది. అందువల్ల కొత్త బ్యాంకు మీ దగ్గర్నుంచి పరిశీలనా రుసుము, లీగల్‌ ఫీజులు, విలువ కట్టేందుకు రుసుము, స్టాంపు డ్యూటీ ఇలా రకరకాల రుసుములను వసూలు చేస్తుంది. దీనివల్ల కొంత భారం పడే అవకాశం ఉంది.

ఎప్పుడంటే…

రుణం తీసుకున్న కొత్తలో అంటే… 1-5 ఏళ్ల లోపు రుణ బదిలీ చేసుకోవడం ద్వారా కొంత కలిసొస్తుంది. సాధారణంగా రుణం తొలినాళ్లలో మనం చెల్లించే వాయిదాల్లో ఎక్కువ మొత్తం వడ్డీ కిందే పోతుంది. ఇలాంటప్పుడు తక్కువ వ‌డ్డీ రేటు ఉన్న బ్యాంకుకు మారడం వల్ల ఈ భారం తగ్గుతుంది. అదే రుణ వ్యవధి మధ్యలో ఈ బదిలీ కోసం ప్రయత్నిస్తే… రుణగ్రహీతకు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే… ఇప్పటికే అధిక వడ్డీలు చెల్లించి ఉన్నారు కాబట్టి, కొత్తగా రుణం బదిలీ చేసుకుంటే… మళ్లీ వడ్డీ భారం మోయాల్సి వస్తుంది.

మీరు గృహరుణం తీసుకున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ వడ్డీ రేట్ల విషయంలో మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు రుణ బదిలీ చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు. అది కూడా రుణం తీసుకున్న తొలినాళ్లలోనే అయితేనే కలిసొస్తుంది. ప్రస్తుతం ఉన్న రుణానికీ, కొత్తగా మారే రుణానికీ మధ్య స్వల్ప తేడా ఉంటే మారడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి, బదిలీ నిర్ణయం తీసుకునేప్పుడు ఎంత భారం తగ్గుతుంది, ఎంత వ్యవధి తగ్గుతుంది, కొత్తగా చెల్లించాల్సిన రుసుములేమిటి?లాంటివన్నీ ఒకసారి చూసుకొని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని