Data speed: డౌన్‌లోడ్‌లో జియో..అప్‌లోడ్‌లో వొడా

ప్రముఖ టెలికా సంస్థ రిలయన్స్‌ జియో 4జీ డేటా వేగం విషయంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. డౌన్‌లోడ్ల విషయంలో సెకండ్‌కు 20.1 మెగాబిట్‌ వేగంతో మిగతా నెట్‌వర్క్‌లకంటే.......

Updated : 13 May 2021 20:42 IST

దిల్లీ: ప్రముఖ టెలికా సంస్థ రిలయన్స్‌ జియో 4జీ డేటా వేగం విషయంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. డౌన్‌లోడ్‌ల విషయంలో సెకనుకు 20.1 మెగాబిట్‌ వేగంతో మిగతా నెట్‌వర్క్‌లకంటే ముందుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ  (ట్రాయ్‌) వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన డేటా వివరాలను వెలువరించింది. ఈ విషయంలో రెండోస్థానంలో నిలిచిన వొడాఫోన్‌ (7 ఎంబీపీఎస్‌) కంటే మూడు రెట్లు జియో ముందుండడం గమనార్హం. ఐడియా (5.8 ఎంబీపీఎస్‌), ఎయిర్‌టెల్‌ (5 ఎంబీపీఎస్‌) వేగంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వొడాఫోన్‌- ఐడియా విలీనం అయినప్పటికీ ట్రాయ్‌ మాత్రం వేర్వేరుగానే డేటాను విడుదల చేస్తుండడం గమనార్హం.

అప్‌లోడ్‌ల విషయంలో మాత్రం వొడాఫోన్‌ అగ్రస్థానంలో నిలిచినట్లు ట్రాయ్‌ పేర్కొంది. 6.7 ఎంబీపీఎస్‌ వేగంతో డేటా బదిలీ అవుతోందని తెలిపింది. ఈ విషయాల్లో ఐడియా 6.1 ఎంబీపీఎస్‌, జియో 4.2 ఎంబీపీఎస్‌, ఎయిర్‌టెల్‌ 3.9 ఎంబీపీఎస్‌ వేగాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు ట్రాయ్‌ వెల్లడించింది. ఇంటర్నెట్‌ నుంచి ఏదైనా సమాచారం పొందడానికి డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అవసరమవుతుంది. అలాగే ఏదైనా ఆడియో/ వీడియో, ఇతర ఫైళ్లను ఇతరులతో వేగంగా పంచుకోవడమనేది అప్‌లోడ్‌ స్పీడ్‌పై ఆధారపడి ఉంటుంది. దేశవ్యాప్తంగా ‘మైస్పీడ్‌’ యాప్‌ ద్వారా ఈ డేటాను ట్రాయ్‌ నెల నెలా సేకరిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని