ఏఎమ్ఓల‌తో ఎప్పుడైనా ఆర్డ‌ర్లు

మార్కెట్ ట్రేడింగ్ వేళ‌ల్లో షేర్ల క్ర‌య‌విక్ర‌యాలు చేసేందుకు మ‌దుప‌ర్లు కొనుగోలు లేదా అమ్మ‌కం ఆర్డ‌ర్ల‌ను పెడుతుంటారు. వాటిని మార్కెట్ ఆర్డ‌రు, లిమిట్ ఆర్డ‌ర్లుగా పిలుస్తారు. ఆ ఆర్డ‌ర్లు నేరుగా ఎక్స్ఛేంజీకి చేరుతాయి. ఆ విధంగా మ‌దుప‌ర్లంద‌రూ చేసిన ఆర్డ‌ర్లు ఎక్స్ఛేంజీ సిస్ట‌మ్ కు చేరి అందులో స‌రిపోలే ఆర్డ‌ర్ల‌ను ఎంపిక చేసి ట్రేడ్ అమ‌లు జ‌రుపుతుంది. ఇది మార్కెట్ స‌మ‌యంలో షేర్ల‌ను కొనుగోలు లేదా విక్ర‌యాలు జ‌రిపే ప్ర‌క్రియ...

Published : 16 Dec 2020 11:53 IST

మార్కెట్ల ట్రేడింగ్ వేళ‌లు ముగిసిన త‌ర్వాత కూడా షేర్ల క్ర‌య‌విక్ర‌యాలకు మ‌దుప‌ర్లు ఆర్డ‌ర్లు పెడుతుంటారు. అలా చేసే ఆర్డ‌ర్ల‌నే ఆఫ్ట‌ర్ మార్కెట్ ఆర్డ‌ర్లు (ఏఎమ్ఓ) అంటారు.

మార్కెట్ ట్రేడింగ్ వేళ‌ల్లో షేర్ల క్ర‌య‌విక్ర‌యాలు చేసేందుకు మ‌దుప‌ర్లు కొనుగోలు లేదా అమ్మ‌కం ఆర్డ‌ర్ల‌ను పెడుతుంటారు. వాటిని మార్కెట్ ఆర్డ‌రు, లిమిట్ ఆర్డ‌ర్లుగా పిలుస్తారు. ఆ ఆర్డ‌ర్లు నేరుగా ఎక్స్ఛేంజీకి చేరుతాయి. ఆ విధంగా మ‌దుప‌ర్లంద‌రూ చేసిన ఆర్డ‌ర్లు ఎక్స్ఛేంజీ సిస్ట‌మ్ కు చేరి అందులో స‌రిపోలే ఆర్డ‌ర్ల‌ను ఎంపిక చేసి ట్రేడ్ అమ‌లు జ‌రుపుతుంది. ఇది మార్కెట్ స‌మ‌యంలో షేర్ల‌ను కొనుగోలు లేదా విక్ర‌యాలు జ‌రిపే ప్ర‌క్రియ.

స్టాక్ మార్కెట్లలో పెట్టుబ‌డి చేయాల‌నుకునే మ‌దుప‌ర్ల‌లో కొంత మందికి స‌మ‌యం (ఉద‌యం 9.15 నుంచి సాయంత్రం 3.30) అనుకూలించ‌క షేర్ల‌ను కొనుగోలు లేదా విక్ర‌యం చేయ‌డం కుద‌ర‌కపోవ‌చ్చు. వారికి ఆఫ్ట‌ర్ మార్కెట్ ఆర్డ‌ర్ విధానం ప్ర‌క్రియను సులభం చేస్తుంది.

ఈ క‌థ‌నంలో ఆఫ్ట‌ర్ మార్కెట్ ఆర్డ‌ర్లు (ఏఎమ్ఓ) గురించి తెలుసుకుందాం.

ఎందుకంటే ఏఎమ్ఓ ఆర్డ‌ర్లు…

స్టాక్ మార్కెట్ల లో పెట్టుబ‌డి చేయాల‌నుకునే మ‌దుప‌ర్ల‌లో కొంత మందికి స‌మ‌యం వీలుప‌డ‌కనో లేదా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లి తీరిగ్గా విశ్లేష‌ణ చేసుకుని ఎంపిక చేసిన షేర్ల‌ను కొనుగోలు చేయాల‌నుకునే వారికి ఈ ఏఎమ్ఓలు ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.

ఎప్పుడు మొద‌ల‌వుతుందంటే…

మార్కెట్ స‌మ‌యం ముగిసిన సాయంత్రం 4.15 నుంచి ఉద‌యం మార్కెట్ తెరిచే వ‌ర‌కు అంటే ఉద‌యం 9.00 ఏఎమ్ఓ ఆర్డ‌ర్లు చేసుకోవ‌చ్చు. ఈ ఆర్డ‌ర్లు నేరుగా ఎక్స్చేంజీకి చేరుతాయి. ఎక్స్ఛేంజీ సిస్ట‌మ్ లో వ‌చ్చిన ఆర్డ‌ర్ల‌ను ఎంత మంది అమ్మ‌కం ఆర్డ‌ర్లు చేశారు. ఎంత మంది కొనేందుకు ఆర్డ‌ర్లు చేశారు అనేది గ‌ణించి ఆర్డ‌ర్లు స‌రిపోలిన వాటిని అమ‌లు చేస్తారు.

ఆఫ్ట‌ర్ మార్కెట్ ఆర్డ‌ర్లో…

మార్కెట్లు ముగిసిన త‌ర్వాత మ‌దుప‌రి షేర్ల‌ను కొనుగోలు లేదా అమ్మ‌కం చేసేందుకు పెట్టే ఆర్డ‌ర్ ఆఫ్ట‌ర్ మార్కెట్ ఆర్డ‌ర్ (ఏఎమ్ఓ) లో రెండు ర‌కాలుగా ఆర్డ‌ర్లు పెట్టే అవ‌కాశం ఉంటుంది.

మార్కెట్ ఆర్డ‌ర్, లిమిట్ ఆర్డ‌ర్

ఈ విధానంలో మ‌దుప‌ర్ల‌కు ప్ర‌యోజ‌నంతో పాటు పొర‌పాటు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంటుంది. అదెలా అంటే…

ఉదాహ‌ర‌ణ‌:

ఒక షేరు ధ‌ర మార్కెట్ ముగిసే స‌మ‌యానికి ఒక కంపెనీకి చెందిన షేరు ధ‌ర రూ.1393.95. మ‌రుస‌టి రోజు మార్కెట్ ప్రారంభ‌మ‌య్యేస‌రికి రూ.1421.10 తో ట్రేడ్ అవుతుంది.
(పై ఉదాహ‌ర‌ణ క‌థ‌నం వివ‌రంగా తెలిపేందుకు తీసుకుంది మాత్ర‌మే.)

def.png

పై ఉదాహ‌ర‌ణ‌లో మ‌దుప‌రి రూ. 1396 కు లిమిట్ ఆర్డ‌రు చేసిన‌ట్ట‌యితే, ఆ ధ‌ర‌కు షేరు ల‌భిస్తేనే ట్రేడ్ అమ‌లు జ‌రుగుతుంది లేదంటే ఆ ట్రేడ్ అమ‌లు కాదు.

abc.png

మార్కెట్ ఆర్డ‌ర్ తో పొర‌బాటు జ‌ర‌గొచ్చు…

ఇదే ఉదాహ‌ర‌ణ‌లో మ‌దుప‌రి మార్కెట్ ఆర్డ‌రు కు షేరును కొన‌గోలు చేసేందుకు ఆర్డ‌ర్ చేశాడు. అప్పుడు మార్కెట్ అందుబాటులో ఉండే రూ.1,434 ధ‌ర‌కు ట్రేడ్ అమ‌ల‌యింది. దీంతో ఆ మ‌దుప‌రి అనుకున్న దాని కంటే ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేయాల్సి వ‌చ్చింది.

మార్కెట్ ప్రారంభ ధ‌ర రూ.1,421 అయిన‌ప్ప‌టికీ మార్కెట్ ఆర్డ‌రు పెట్టిన మ‌దుప‌రికి రూ.1,434 కు షేరు ల‌భించ‌డం ఏంట‌నే సందేహం వ‌స్తుంది. అలా ఎందుకు జ‌రిగిందంటే ప్రీ మార్కెట్ (9.00 - 9.15) స‌మ‌యంలో వ‌చ్చే డిమాండ్ స‌ప్లై ఆధారంగా షేరు ధ‌ర ఉంటుంది.

షేరు ధ‌ర క్రితం ముగింపున‌కు ప్ర‌స్తుత రోజు ప్రారంభ‌ ధ‌ర‌కు తేడా రూ. 1421-రూ.1394= రూ.27. స‌రే మ‌రుస‌టి రోజు మార్కెట్ ప్రారంభంలో కొనుగోలు చేద్దాం అనుకుంటే ధ‌ర అప్ప‌టికే పెరిగింది.

ఈ స‌మ‌స్య‌కు చెక్ చెప్పాలంటే

మ‌దుప‌రి ఏఎమ్ఓ చేసేట‌పుడు లిమిట్ ఆర్డ‌ర్ పెట్టుకుంటే కొంత ధ‌ర సూచించే ఆప్ష‌న్ ఉంటుంది. ఈ సంద‌ర్భంలో మ‌దుప‌రి లిమిట్ ధ‌ర‌ రూ. 1420 పెట్టారు. అపుడు మ‌దుప‌రికి ఆ ధ‌ర‌కు షేరు ల‌భిస్తేనే ట్రేడ్ అవుతుంది. లేదంటే ఆర్డ‌రు ర‌ద్ద‌వుతుంది. దీంతో మ‌దుప‌రికి ఆమోద్య‌యోగ‌మైన‌ ధ‌ర‌కు కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది.

చివ‌ర‌గా

​​​​​​​ఏఎమ్ఓ ఆర్డ‌ర్ల ద్వారా కొనుగోలు చేసే షేరు ధ‌ర మ‌రుస‌టి రోజుకు పెరిగిపోతుంద‌నో లేదా త‌గ్గిపోతుంద‌నేది న‌మ్మ‌కంగా చెప్ప‌లేం. మ‌దుప‌ర్లు త‌మ విశ్లేష‌ణ లేదా స‌ల‌హాదారుల సూచ‌న‌ల‌ను పాటించి నిర్ణయం తీసుకోవాలి.మార్కెట్ ముగింపు ప్రారంభానికి మ‌ధ్య‌లో షేర్లను కొనుగోలు లేదా అమ్మ‌కాలు చేసే అవ‌కాశంగా దీన్ని భావించాలి. మ‌దుప‌ర్లు ఏఎమ్ఓ ద్వారా పెట్టుబ‌డి చేసే ముందు ఏ ( మార్కెట్ లేదా లిమిట్ ) ఆర్డ‌రుకు చేస్తున్నార‌నేది చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని