Metro Brands: లిస్టింగ్‌లో నిరాశపరిచి.. ట్రేడింగ్‌లో దూసుకెళ్లిన ‘మెట్రో’

ప్రముఖ ఫుట్‌వేర్‌ రిటైలర్‌ ‘మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌’ షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. 12.6 శాతం రాయితీతో ఆరంభంలోనే మదుపర్లను నిరాశపరిచాయి.....

Updated : 22 Dec 2021 14:27 IST

దిల్లీ: ప్రముఖ ఫుట్‌వేర్‌ రిటైలర్‌ ‘మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌’ షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. 12.6 శాతం రాయితీతో ఆరంభంలోనే మదుపర్లను నిరాశపరిచాయి. ఇష్యూ ధర రూ.500 కాగా 12.8 శాతం రాయితీతో రూ.436 వద్ద బీఎస్‌ఈలో.. 12.6 శాతం రాయితీతో రూ.737 వద్ద ఎన్‌ఎస్‌ఈలో షేర్లు నమోదయ్యాయి. ఐపీఓలో ఒక్కో లాట్‌కు 30 షేర్లు నిర్ణయించారు. అంటే ఒక్కో లాట్‌పై రూ.14,550 పెట్టుబడిగా పెట్టారు. దీంతో 12.6 శాతం రాయితీ లెక్కన ఒక్కో లాట్‌పై మదుపర్లు రూ.1,890 లిస్టింగ్ నష్టాల్ని మూటగట్టుకున్నారు. అయితే, సమయం గడుస్తున్న కొద్దీ ఈ స్టాక్‌కు కొనుగోళ్లు వెల్లువెత్తాయి. మధ్యాహ్నం 1:42 గంటల సమయంలో నిఫ్టీలో ఈ షేరు 0.30 శాతం లాభంతో రూ.500.95 వద్ద ట్రేడవుతుండడం విశేషం.

ప్రముఖ ఫుట్‌వేర్‌ రిటైలర్‌ ‘మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌’ ఐపీఓ డిసెంబరు 10న ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పబ్లిక్‌ ఇష్యూ డిసెంబరు 14న ముగిసింది. రూ.295 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 2.14 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించారు. ఈ ఐపీఓ ద్వారా ప్రమోటర్లు 10 శాతం వాటాను వదులుకున్నారు. దీంతో కంపెనీలో వీరి వాటా 75 శాతానికి రానుంది. ఈ సంస్థలో ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు కూడా వాటాలున్నాయి.

ఈ పబ్లిక్‌ ఇష్యూలో సమీకరించే నిధులతో మెట్రో, మోచి, వాక్‌వే, క్రోక్స్‌ బ్రాండ్ల పేరిట కొత్త స్టోర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కూడా కొన్ని నిధులను వినియోగించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 134 నగరాల్లో 586 స్టోర్లు ఉన్నాయి. గత మూడేళ్లలోనే 211 స్టోర్లను తెరిచారు. మిడ్‌, ప్రీమియం సెగ్మెంట్లే లక్ష్యంగా ఈ సంస్థ వ్యాపారాన్ని విస్తరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని