పార్లమెంటు సమాచారం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశ వ్యాప్తంగా రికార్డు గరిష్ఠాలకు చేరిన నేపథ్యంలో, సహేతుక ధరలకు చమురు సరఫరా చేయాలని ముడిచమురు ...

Updated : 29 Jul 2021 07:58 IST

* పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశ వ్యాప్తంగా రికార్డు గరిష్ఠాలకు చేరిన నేపథ్యంలో, సహేతుక ధరలకు చమురు సరఫరా చేయాలని ముడిచమురు ఉత్పత్తిదార్లు, ఒపెక్‌ దేశాలకు విజ్ఞప్తి చేశామని, రుణకాల  గడువు పెంచమని అడిగినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి రాజ్యసభలో వెల్లడించారు.

* పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఈ నెల 14 వరకు 52,391 సంస్థలను అంకురాలుగా గుర్తించిందని వాణిజ్య, పరిశ్రమల సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ లోక్‌సభలో వెల్లడించారు.

* అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌ 2.0) కింద స్పైస్‌జెట్‌ రూ.127.51 కోట్లు, గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ (గతంలో గోఎయిర్‌) రూ.25.65 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు పౌర విమానయాన సహాయ మంత్రి వీకే సింగ్‌ వెల్లడించారు.

* దివాలా స్మృతి (ఐబీసీ) సవరణ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. కార్పొరేట్‌ వ్యవహారాల సహాయ మంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ బిల్లును ప్రవేశపెట్టారు.

* సులభతర వాణిజ్యం, అంకుర సంస్థలను ప్రోత్సహించే దిశగా లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ (ఎల్‌ఎల్‌పీ) చట్టానికి చేసిన సవరణలను కేంద్రం ఆమోదించింది.

* ఎయిరిండియా, బీపీసీఎల్‌, బీఈఎంఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను 2022 మార్చిలోపు ప్రైవేటీకరిస్తామని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు.


సైయెంట్‌ చేతికి ‘వర్క్‌ ఫోర్స్‌ డెల్టా’

ఈనాడు, హైదరాబాద్‌: ‘వర్క్‌ ఫోర్స్‌ డెల్టా’ అనే కన్సల్టింగ్‌ సేవల సంస్థను హైదరాబాద్‌కు చెందిన సైయెంట్‌ లిమిటెడ్‌ తన ఆస్ట్రేలియా సబ్సిడరీ అయిన సైయెంట్‌ ఆస్ట్రేలియా పీటీవై లిమిటెడ్‌ ద్వారా కొనుగోలు చేయనుంది. మొబైల్‌ వర్క్‌ఫోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సేవల్లో నిమగ్నమైన ఈ సంస్థను 2.7 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.21.5 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేయన్నుట్లు సైయెంట్‌ లిమటెడ్‌ వెల్లడించింది. దీనివల్ల ఫ్రంట్‌- ఎండ్‌ కన్సల్టింగ్‌ సేవలు అందించే సామర్ధ్యాన్ని విస్తరించుకునే అవకాశం కలుగుతుందని సైయెంట్‌ ఎండీ కృష్ణ బొదనపు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని