Reliance: లేటుగా వచ్చినా..లేటెస్టుగా.. అదే రిలయన్స్‌ వ్యూహం!

పాలియెస్టర్‌తో ప్రారంభమైన రిలయన్స్‌ ప్రస్థానం ఇప్పుడు అనేక రంగాలకు విస్తరించింది. ఒకప్పుడు అన్నింట్లో తానే ఉండాని తహతహలాడిన కంపెనీ ఇప్పుడు కాస్త వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది....

Updated : 12 Jan 2022 13:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాలియెస్టర్‌ వ్యాపారంతో ప్రారంభమైన రిలయన్స్‌ ప్రస్థానం ఇప్పుడు అనేక రంగాలకు విస్తరించింది. ఒకప్పుడు అన్నీ తానే ప్రారంభించి అభివృద్ధి చేయాలని తహతహలాడిన కంపెనీ ఇప్పుడు కాస్త వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది! టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పుల దృష్ట్యా ఆయా రంగాల్లోని ఇతర కంపెనీలతో కలిసి నడవాల్సిన అవసరమూ ఉందని గుర్తించినట్లు అర్థమవుతోంది. అందుకే గత నాలుగేళ్లుగా వివిధ రంగాల్లో పెట్టుబడులను ముమ్మరం చేసింది.

రూ.42.2 వేల కోట్లు...

వివిధ రంగాల్లో కొనుగోళ్లు, పెట్టుబడుల కోసం రిలయన్స్‌ గత నాలుగేళ్లలో 5.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.42.2 వేల కోట్లు) వెచ్చించింది. ఇటీవలే ‘మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌’ హోటల్‌లో 73.37 శాతం వాటా కొనుగోలు చేయడంతో ఆతిథ్య రంగంలో తన ఉనికిని విస్తరించింది. అలాగే క్షేత్రస్థాయి డెలివరీ ప్లాట్‌ఫాం డుంజోలో 200 మిలియన్‌ డాలర్లతో 25.8 శాతం వాటాలు సొంతం చేసుకుంది.

‘ఫ్యూచర్‌’ క్లియర్‌ అయితే.. రూ.66.60 వేల కోట్లు...

ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ బిజినెస్‌ను సొంతం చేసుకునేందుకు కుదిరిన ఒప్పందం కూడా క్లియర్‌ అయ్యి ఉంటే రిలయన్స్‌ పెట్టుబడులు 9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.66.60 వేల కోట్లు)కు చేరేవి. అయితే, అమెజాన్‌, ఫ్యూచర్ గ్రూప్ మధ్య నెలకొన్న న్యాయపరమైన చిక్కులు దీనికి బ్రేకులు వేశాయి.

గ్లోబల్‌ ప్లేయర్స్‌తో పోటీ...

మరోవైపు భారత కంపెనీల్లో గత కొన్నేళ్లుగా విరివిగా నిధులు కుమ్మరిస్తోన్న విదేశీ పెట్టుబడి సంస్థలకు రిలయన్స్‌ పోటీగా నిలుస్తోంది. గత దశాబ్ద కాలంగా భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ 14 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. 2005 నుంచి నాస్పర్స్‌ డిజిటల్‌ విభాగమైన ప్రోసస్‌ 6 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. బిల్‌ పే కొనుగోలుకు క్లియరెన్స్‌ లభిస్తే.. ప్రోసస్‌ పెట్టుబడుల విలువ 10 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. రిలయన్స్ మాత్రం నాలుగేళ్ల క్రితమే తన కొనుగోళ్లు, పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించింది. పైగా విదేశీ సంస్థల వలే మంచి రేటు వచ్చినప్పుడు వాటాలు అమ్ముకొని నిష్క్రమించే ఉద్దేశంతో మాత్రం ముందుకు వెళ్లడం లేదు. 

అందుకే ఈ మార్పు!

టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునే క్రమంలోనే రిలయన్స్‌ దీర్ఘకాల లక్ష్యంతో తన వ్యూహాన్ని మార్చిందని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొత్త రంగాల్లోకి ప్రవేశించి, విస్తరించేందుకు కావాల్సిన సమయమూ ఆదా అవుతుందని కంపెనీ భావిస్తున్నట్లుందని విశ్లేషించారు. అందుకే టెలికాం, రిటైల్‌, పునరుత్పాదక ఇంధనం, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో బలంగా ఉన్న భాగస్వాములతో చేతులు కలుపుతోందని పేర్కొన్నారు. 

వాటికేం తీసిపోదు...

2021లో రిలయన్స్‌ వివిధ కంపెనీల్లో 1.8 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. వీటిలో కొన్నింటిని పూర్తిగా కొనేస్తే.. మరికొన్నింటిలో గణనీయ వాటాలు సొంతం చేసుకుంది. వీటిలో ఆరు పునరుత్పాదక ఇంధన కంపెనీలతో పాటు జస్ట్‌ డయల్‌ (767 మిలియన్ డాలర్లు) కూడా ఉంది. 2021లో భారత్‌లో ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీల టాప్‌ 10 జాబితాలో టీఎఫ్‌సీసీ ఇంటర్నేషనల్‌, సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్‌, అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌, టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, బ్లాక్‌స్టోన్ వంటి కంపెనీలు ఉన్నాయి. వీటితో పోలిస్తే రిలయన్స్‌ పెట్టుబడులు తక్కువేం కాదనే చెప్పాలి!

ఈ రంగాలపై  దృష్టి...

పునరుత్పాదక ఇంధనంతో పాటు 2021లో రిలయన్స్‌ ఫ్యాషన్‌ అండ్‌ డిజైన్‌ రంగంలోకీ ప్రవేశించింది. రితు కుమార్‌, మనీశ్‌ మల్హోత్రా, అనామికా ఖన్నా వంటి ప్రముఖులు నిర్వహిస్తున్న కంపెనీల్లో వాటాలు సొంతం చేసుకుంది. అలాగే వస్త్ర రంగంలోకీ కొన్ని నిధులను మళ్లించింది. అయితే, ఈ ఒప్పందాల విలువను మాత్రం బయటకు వెల్లడించలేదు. మిల్క్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసిన విలువను సైతం బహిర్గతం చేయలేదు.

ఇప్పటికీ ఇంటర్నెట్‌, టెలికాం రంగంలోనే రిలయన్స్ పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. కంపెనీ వివరాలు, మోర్గాన్‌ స్టాన్లీ గణాంకాల ప్రకారం.. ఈ రెండు రంగాల్లో కంపెనీ దాదాపు 2.5 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టిందని అంచనా. తర్వాత ఇంధన రంగంపై దృష్టి సారించింది. క్రమంగా చమురు శుద్ధి నుంచి గ్రీన్‌ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగంలోని అనేక కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. దాదాపు 1.3 బిలియన్ డాలర్లను ఈ రంగానికి వెచ్చించింది. సోలార్‌ సెల్స్‌, ప్యానెల్స్‌ తయారు చేసే ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌ను 771 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. 

ఇక రిటైల్‌ రంగంలో పెట్టుబడులు డుంజోలో పెట్టిన నిధులతో కలిపినా ఇంకా 1 బిలియన్ డాలర్లకు చేరలేదు. అయితే, ఫ్యూచర్‌ రిటైల్‌ కొనుగోలుకు కుదిరిన ఒప్పందం ఓకే అయితే.. ఈ రంగంలో 3.3 బిలయన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టినట్లవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు