Sandeshkhali Case: తెల్లపేపర్‌పై సంతకం చేయించి.. రేప్‌ కేసు పెట్టారు: సందేశ్‌ఖాలీ ఘటనలో కీలక మలుపు

Sandeshkhali Case: సందేశ్‌ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు.

Updated : 09 May 2024 14:04 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో సందేశ్‌ఖాలీ ఆందోళనల వ్యవహారం (Sandeshkhali Case) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదంతా భాజపా కుట్రేనని ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమపై అకృత్యాలకు పాల్పడ్డారంటూ టీఎంసీ నేతలపై ఫిర్యాదు చేసిన ముగ్గురు మహిళల్లో ఒకరు తాజాగా తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తాను ఎలాంటి వేధింపులకు గురికాలేదని, స్థానిక భాజపా కార్యకర్తలు తనతో బలవంతంగా తెల్ల కాగితంపై సంతకం చేయించారని ఆరోపించారు. (Women Protest In Sandeshkhali)

‘‘భాజపా (BJP) మహిళా మోర్చా విభాగానికి చెందిన కొందరు నేతలు, ఇతర కార్యకర్తలు ఆ మధ్య మా ఇంటికి వచ్చారు. పీఎంఏవైలో పేరును చేర్చుతామంటూ తెల్లకాగితంపై నా సంతకం తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి టీఎంసీ నేతలపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయించారు. నేనెప్పుడూ రాత్రివేళ ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లలేదు. నాపై ఎలాంటి అకృత్యాలు జరగలేదు’’ అని ఆ మహిళ పేర్కొన్నారు. తన వల్ల తప్పు జరిగిందని తెలుసుకుని ఇప్పుడు కేసును వెనక్కి తీసుకున్నానని చెప్పారు. ఈ విషయం తెలిసి కొందరు భాజపా నేతలు తనను బెదిరిస్తున్నానని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ఆరోపణలను భాజపా నాయకులు ఖండిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. సందేశ్‌ఖాలీ ఘటన భాజపా కుట్ర అని ఆరోపించిన టీఎంసీ.. ఇటీవల స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్‌ (West Bengal) అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి ఉన్నట్లు భాజపా మండల శాఖ అధ్యక్షుడు గంగాధర్‌ వ్యాఖ్యానించడం ఈ వీడియోలో కనిపించింది. షాజహాన్‌ షేక్‌ సహా ముగ్గురు తృణమూల్‌ నేతలపై అత్యాచార ఆరోపణలు చేసేలా స్థానిక మహిళలను ప్రేరేపించాలని సువేందు తనకు సూచించినట్లు అతడు ఆ వీడియోలో చెప్పారు.

సందేశ్‌ఖాలీ ఘటనలు భాజపా కుట్రే!

ఈసీని ఆశ్రయించనున్న టీఎంసీ..

ఈ నేపథ్యంలో సందేశ్‌ఖాలీ వ్యవహారంపై టీఎంసీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనుంది. వీడియో ఆధారంగా భాజపా నేత సువేందు, ఇతరులపై ఫిర్యాదు చేస్తామని టీఎంసీ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ మేరకు ఈసీకి లేఖ రాస్తామని తెలిపాయి. అయితే, ఈ వీడియోను భాజపా నేతలు ఖండిస్తున్నారు. అది మార్ఫింగ్‌ వీడియో అని, కృత్రిమ మేధ (ఏఐ)తో తన స్వరాన్ని రూపొందించి, అందులో పెట్టారని భాజపా మండల శాఖ అధ్యక్షుడు గంగాధర్‌ ఆరోపించారు. దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు