Ola CEO: అందుకే భారత్‌కు సొంత టెక్నాలజీ అవసరం.. లింక్డిన్‌పై ఓలా సీఈఓ ఫైర్‌!

Ola CEO: ఓలా సీఈఓ చేసిన ఓ పోస్ట్‌ను లింక్డిన్‌ తొలగించింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌ సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

Published : 09 May 2024 14:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓలా సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) చేసిన ఓ పోస్ట్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డిన్‌ (LinkedIn) తొలగించింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లింక్డిన్‌ ఏఐ టూల్స్‌ భారత యూజర్లపై బలవంతంగా పాశ్చాత్య సిద్ధాంతాలను రుద్దుతున్నాయని అభిప్రాయపడ్డారు. అందుకే భారత్‌ సొంతంగా సాంకేతికతను, కృత్రిమ మేధను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే ఇతరుల రాజకీయ లక్ష్యాలకు బానిసలుగా మారాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవల లింక్డిన్‌లోని (LinkedIn) ఏఐ బాట్‌లో ‘‘భవీష్‌ అగర్వాల్‌ ఎవరు?’’ అని ఓలా సీఈఓ తన గురించి తాను వెతికారు. దీనికి బాట్‌ ఇచ్చిన సమాధానంలో సర్వనామాల (Pronouns) విషయంలో తప్పులు దొర్లాయి. ‘ఆయన’ అని ఉండాల్సిన చోట ‘వారు/వాళ్లు’ అని పేర్కొంది. దీన్ని స్క్రీన్‌షాట్‌ తీసిన భవీష్‌ లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు. పాశ్చాత్య విధానాలను గుడ్డిగా అనుసరిస్తే ఇలా ‘ప్రొనౌన్స్‌ ఇల్‌నెస్‌’ ఎదుర్కోవాల్సి వస్తుందని విమర్శించారు.

ఈ పోస్ట్‌ను లింక్డిన్‌ (LinkedIn) తొలగించింది. ఇది తమ విధానాలను విరుద్ధంగా ఉందని పేర్కొంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భవీష్‌.. తమ తప్పుని గుర్తించకుండా లింక్డిన్‌ ఇతరులను విమర్శించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే భారత్‌ సొంతంగా తమ సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే ఇతరుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని