Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై తొలి ఛార్జ్‌షీట్‌.. దాఖలు చేయనున్న ఈడీ

Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఈడీ తొలిసారిగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated : 09 May 2024 15:12 IST

దిల్లీ: దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలి ఛార్జ్‌షీట్‌ (chargesheet) రూపొందిస్తున్నట్లు సమాచారం. దీన్ని శుక్రవారం కోర్టులో సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసులో కేజ్రీవాల్‌ను దర్యాప్తు సంస్థ (ED) తొలిసారి నిందితుడిగా పేర్కొననున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయనను ‘కీలక కుట్రదారు’గా పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనుంది. ఈ కేసులో దిల్లీ సీఎం (Delhi CM)కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించనుంది. అదే రోజున ఆయనపై ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలుకు సిద్ధమవడం గమనార్హం.

తెల్లపేపర్‌పై సంతకం చేయించి.. రేప్‌ కేసు పెట్టారు: సందేశ్‌ఖాలీ ఘటనలో కీలక మలుపు

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఇక, తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయన మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. బెయిలిస్తే సీఎంగా అధికారిక విధులు నిర్వహించకూడదని తెలిపింది. దీంతో బెయిల్‌పై ధర్మాసనం సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని