icon icon icon
icon icon icon

మంగళగిరిలో గెలుపు లోకేశ్‌దే

గత రెండు ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓట్లేశాం. ఆయన మా గ్రామానికి చేసిందేమీ లేదు. జగన్‌ను వ్యతిరేకిస్తూ వైకాపాను వదిలి కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ ఎందుకు వైకాపాలోకి వెళ్లారు? ఎన్ని గిమ్మిక్కులు చేసినా మంగళగిరిలో ఈసారి లోకేశ్‌ ఖాయం. మా మద్దతు ఆయనకే.

Published : 09 May 2024 07:11 IST

ఐదేళ్లుగా స్థానికులతో మమేకం
సొంత డబ్బుతో పలు పథకాల్ని అమలుచేసిన యువనేత
నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  
వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  
ఆ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు పరిస్థితులు ప్రతికూలం

గత రెండు ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓట్లేశాం. ఆయన మా గ్రామానికి చేసిందేమీ లేదు. జగన్‌ను వ్యతిరేకిస్తూ వైకాపాను వదిలి కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ ఎందుకు వైకాపాలోకి వెళ్లారు? ఎన్ని గిమ్మిక్కులు చేసినా మంగళగిరిలో ఈసారి లోకేశ్‌ ఖాయం. మా మద్దతు ఆయనకే.

ఉండవల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకుడి మాట

మా భూములు జగన్‌ దగ్గర పెట్టాలంట. జిరాక్స్‌ కాపీలు ఇస్తారంట. సమస్యలు వస్తే ఆయన తీరుస్తారంట. అసలు సమస్యలు సృష్టించేదే ఆయన కదా? మా పాసు పుస్తకాలపై జగన్‌ బొమ్మలు వేసుకోవడమేంటి?

యర్రబాలెం గ్రామానికి చెందిన ఐదుగురు

వృద్ధుల అభిప్రాయం

ఒక్క ఛాన్స్‌ అని అడిగితే జగన్‌కు ఓట్లేశాం. ఏం చేశారు? ఎంతసేపూ చంద్రబాబు గొడవేనా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదా? ఒక్క రహదారి అయినా బాగుందా? సమస్యలున్నాయని చెప్పేందుకూ స్వేచ్ఛలేదు. ఇదెక్కడి పాలన?

నలుగురు ప్రైవేటు వాహనాల డ్రైవర్లు(మంగళగిరి)

మంగళగిరిలో తెదేపానే గెలుస్తుంది. గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతు పలికాం. జగన్‌ పాలన బాగోలేదు. ఈసారి లోకేశ్‌కు ఓట్లేయాలని అనుకుంటున్నాం. భాజపాతో తెదేపా పొత్తు అంశాన్ని పట్టించుకునే ముస్లింలు తక్కువే.

మంగళగిరికి చెందిన ఓ ముస్లిం యువకుడు

నేను తెదేపా సానుభూతిపరుడిని. ఒక్క ఛాన్స్‌ అని అడిగారని గత ఎన్నికల్లో వైకాపాకు ఓటేశా. జగన్‌ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఏమీ చేయలేదు. ఓడిపోయినా నియోజకవర్గ ప్రజలకు లోకేశ్‌ మేలు చేశారు.

దుగ్గిరాలకు చెందిన ఓ మధ్య వయస్కుడు

జగన్‌ పనులు ఇవ్వడం మానేసి ఫలహారాలు పంచారు. తిండి తినాలంటే పనులు ఉండాలి కదా? మాకూ పథకాలు అందాయి. కానీ ధరలు ఎంతలా పెరిగాయి?

తాడేపల్లిలో టీస్టాల్‌ నడుపుతున్న ఓ మహిళ ఆవేదన

ఈనాడు, అమరావతి: మూడున్నర దశాబ్దాల తర్వాత మంగళగిరిలో తెదేపా జెండా ఎగిరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా మెజారిటీ ప్రజల నాడి.. ఇదే వాణిని వినిపిస్తోంది. వైకాపా పాలనలో... రాజధాని తరలింపు నిర్ణయం, అభివృద్ధి మచ్చుకైనా కానరాక పోవడం, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినడం, ఉపాధి లేకపోవడం... ఇక్కడ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి... జగన్‌ అధికారంలోకి వచ్చిన జరిగిన విధ్వంసాన్ని ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైకాపాకు ఓట్లేసిన వారిలో చాలామంది ఇప్పుడు తెదేపాకు మొగ్గుచూపుతున్నారు. వారు బహిరంగంగానే తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈసారి ఇక్కడ లోకేశ్‌ తప్పక గెలుస్తారని స్పష్టం చేస్తున్నారు. యువత నుంచి పండుటాకుల వరకు అందరిలోనూ ఈ మార్పు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గంలో సొంత నిధులతో లోకేశ్‌ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువమందిని ఆకట్టుకున్నాయి. సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంతోపాటు నివాసమూ నియోజకవర్గంలో ఉన్నా... ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజల కష్టాలను పట్టించుకోక పోవడం వైకాపాకు ఎదురుదెబ్బగా మారింది. ఆ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య రాజకీయాలకు కొత్త. లావణ్య పూర్తిగా కుటుంబసభ్యులపైనే ఆధారపడటం, ఇప్పటికీ ఆమె గురించి ప్రజలకు పెద్దగా తెలియకపోవడం... ప్రతికూలంగా మారింది. మంగళగిరిలో ఈసారి లోకేశ్‌ గెలుపుపై కంటే... ఆయనకు వచ్చే మెజారిటీపైన పందేలు నడుస్తున్నాయని స్థానికులు చెప్పారు. 

వైకాపా అభ్యర్థి ఎంపికే ప్రహసనం

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి తెదేపా నుంచి వైకాపాలో చేర్చుకున్న గంజి చిరంజీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్‌ తొలుత ప్రకటించారు. గంజి చిరంజీవి కొద్ది రోజులు ఇంటింటి ప్రచారం నిర్వహించాక ఆయన్ను కాదని మురుగుడు లావణ్యను తెరమీదకు తెచ్చారు. ఈ మార్పులు జరిగేలోపే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైకాపాను వీడి కాంగ్రెస్‌లో చేరడం... మళ్లీ తిరిగొచ్చి వైకాపా తీర్థం పుచ్చుకోవడం జరిగిపోయాయి. ఈ పరిణామాలతో పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. లావణ్యను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి వర్గం గుర్రుగా ఉంది. ఆమెకు ఎంతమేర సహకరిస్తారనేది సందేహమే. రామకృష్ణారెడ్డిని తిరిగి వైకాపాలో చేర్చుకోవడాన్ని మంగళగిరి-తాడేపల్లి నగరం వైసీపీ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయన అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.

రచ్చబండ.. అపార్ట్‌మెంట్లలో సమావేశాలు

యువగళం యాత్రకు ముందే లోకేశ్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ఇంటింటికీ వెళ్లారు. ప్రజల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఊరూరా రచ్చబండ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. యువతకు ఉపాధి, సంక్షేమ పథకాలు, అమరావతి నిర్మాణం, రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు... తదితరాలపై అడిగే ప్రశ్నలకు సూటిగా, ధీమాగా సమాధానమిస్తున్నారు. ఇది ఆయనపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుతోంది. ఇప్పటివరకు 66 రచ్చబండ కార్యక్రమాలు, 12 అపార్ట్‌మెంట్లలో సమావేశాలు నిర్వహించారు.


అందరినీ కలుపుకొంటూ బ్రాహ్మణి ప్రచారం

మంగళగిరిలో అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొంటూ లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. చేనేతలు, స్వర్ణకారులతో మాటామంతీ నిర్వహించారు. డ్వాక్రా మహిళలు, గార్మెంట్స్‌, పచ్చళ్ల తయారీ పరిశ్రమల్లో పనిచేసే మహిళలు, పూలతోటల్లో మహిళా కూలీలను కలుస్తున్నారు. అపార్ట్‌మెంట్లకు వెళ్లి మహిళలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. మహిళామిత్ర సభ్యులతో సమావేశం అవుతున్నారు. క్రీడాకారులతో కలిసి ఆటల్లో పాల్గొంటున్నారు. ఐటీ ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. వైకాపా హయాంలో నియోజకవర్గం నష్టపోయిన తీరును వివరిస్తున్నారు.


సంక్షేమ పథకాలే లోకేశ్‌కు దన్ను

గత ఎన్నికల్లో లోకేశ్‌ ఓడిపోయినా... నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందున్నారు. సొంత నిధులతో 23 సంక్షేమ పథకాలను అమలు చేశారు. నూతన వధూవరులకు పెళ్లికానుక, అన్న క్యాంటీన్లు, స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఉపాధి శిక్షణ, సంజీవని ఉచిత వైద్యసేవ, యువతకు సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ, జలధార పేరుతో ట్యాంకర్లతో ఉచిత మంచినీరు పంపిణీ, వాటర్‌ప్లాంట్ల ఏర్పాటు, రజకులకు ఇస్త్రీ బండ్లు, నాయీ బ్రాహ్మణులకు సెలూన్‌ ఛైర్స్‌, శ్రామికులకు వెల్డింగ్‌ మెషిన్‌లు, చేనేతలకు ప్రత్యేక వీవర్స్‌ కేంద్రాలు, ఇలా అన్ని వర్గాలు, కులాలకు చెందిన వేల మందికి సహకారం అందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చుల కింద నగదును ఇచ్చారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. నియోజకవర్గానికి పరిశ్రమల్ని తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వటంతో ఎక్కువమంది ప్రభావితం అవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img