Haryana: హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్‌

Haryana: హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌కు జేజేపీ నాయకుడు దుశ్యంత్‌ చౌటాలా లేఖ రాశారు.

Published : 09 May 2024 13:57 IST

చండీగఢ్‌: హరియాణా (Haryana)లో రాజకీయ అస్థిరత కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వానికి ఇటీవల ముగ్గురు స్వతంత్రులు (Independent MLAs) మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ పరిణామాల వేళ సైనీ సర్కారు శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్‌ చౌటాలా (Dushyant Chautala) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.

‘‘ఎమ్మెల్యేల రాజీనామాలు, స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికార భాజపా (BJP) ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. అందువల్ల సైనీ సర్కారు బలాన్ని నిరూపించుకునేలా తక్షణమే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెస్తే మేం దానికి మద్దతిస్తాం. ఒకవేళ ప్రభుత్వం మెజార్టీ సాధించలేకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి’’ అని చౌటాలా లేఖలో కోరారు.

అసెంబ్లీలో బలాబలాలు ఇలా..

సైనీ ప్రభుత్వానికి తాము మద్దతు ఇవ్వబోమంటూ రెండు రోజుల క్రితం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబీర్‌ సాంగ్వాన్‌, రణధీర్‌ గోలెన్‌, ధరంపాల్‌ గోందర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల సంఖ్య (మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, మరో స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్‌ చౌటాలా రాజీనామాలతో) 88కు పడిపోయింది. ఇందులో భాజపాకు 40 మంది సభ్యుల బలం ఉంది. ఇద్దరు స్వతంత్ర శాసనసభ్యులు, హరియాణా లోక్‌హిత పార్టీ ఏకైక సభ్యుడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అయినప్పటికీ మెజార్టీకి ఇంకా ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం.

సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం

ఇక, కాంగ్రెస్‌ (Congress)కు 30 మంది సంఖ్యాబలం ఉంది. 10 మంది ఎమ్మెల్యేలున్న జేజేపీ, ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ బలం 43గానే ఉంటుంది. హస్తం అధికారంలోకి రావాలంటే మరో స్వతంత్ర ఎమ్మెల్యే, ఐఎన్‌ఎల్‌డీ సభ్యుడు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.

నాటి భాజపా మిత్రుడే..

ఈ ఏడాది మార్చి నెలలో హరియాణా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో భాజపా, మిత్రపక్షం జేజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అప్పటి మనోహల్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వానికి దుశ్యంత్‌ చౌటాలా పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఖట్టర్‌ సీఎం పదవికి రాజీనామా చేయడం.. కొత్త ముఖ్యమంత్రిగా సైనీ ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు రెండు నెలలు తిరగకుండానే రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని