Price hike: ధరల పెంపు యోచనలో మరిన్ని వాహన సంస్థలు!

ముడి పదార్థాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు టాటా మోటార్స్‌, హోండా, రెనో తెలిపాయి....

Published : 05 Dec 2021 15:20 IST

దిల్లీ: ముడి పదార్థాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు టాటా మోటార్స్‌, హోండా, రెనో తెలిపాయి. జవనరి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇప్పటికే వచ్చే నెల నుంచి ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీతోపాటు విలాస కార్లను ఉత్పత్తి చేసే మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి సంస్థలు ప్రకటించాయి. ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌ సహా ఇతర లోహాల ధరలు పెరిగిన నేపథ్యంలోనే ధరల పెరుగుదల నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని ఆయా కంపెనీ యాజమాన్యాలు ప్రకటించాయి. రవాణా ఛార్జీలు కూడా ఈ మధ్య అధికమైన విషయం తెలిసిందే.

* మారుతీ సుజుకీ.. మోడల్‌ ఆధారంగా ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే కంపెనీ మూడు సార్లు కార్ల ధరల్ని పెంచింది. ఉత్పత్తి వ్యయం భారమైందని.. అందువల్లే మరోసారి ధరలు పెంచక తప్పట్లేదని మారుతీ పేర్కొంది.

* ఎంపిక చేసిన మోడళ్లపై జనవరి 1 నుంచి 2 శాతం వరకు ధరలు (ఎక్స్‌-షోరూమ్‌) పెంచుతున్నట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ తెలిపింది. అయితే ఇప్పటికే బుక్‌ చేసుకుని, వాహన డెలివరీ కోసం ఎదురు చూస్తున్న వారికి పాత ధరలే వర్తిస్తాయని పేర్కొంది.

* 2022 జనవరి 1 నుంచి తమ అన్ని మోడళ్లపై 3 శాతం వరకు ధరల పెంపు అమల్లోకి వస్తుందని ఆడి పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని