Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్‌లోని మరిన్ని విశేషాలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగి చివరకు నష్టాల్లో ముగిశాయి......

Updated : 29 Dec 2021 16:00 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగి చివరకు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఒమిక్రాన్‌ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.


సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 57,892.31 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. అక్కడి నుంచి ఊగిసలాటలో పయనించిన సూచీ 58,097.07 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 90.99 పాయింట్ల నష్టంతో 57,806.49 వద్ద ముగిసింది. 17,220.10 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,285.95-17,176.65 మధ్య కదలాడింది. చివరకు 19.65 పాయింట్లు నష్టపోయి 17,213.60 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.72 వద్ద నిలిచింది.


మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు..

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు అదే బాటలో పయనించాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న సూచీలకు దేశీయంగా ఎలాంటి బలమైన మద్దతు లభించలేదు. దీంతో ఇక్కడి సూచీలు కూడా అదే ధోరణిలో కదలాడాయి. ఇక అక్టోబరు నాటి గరిష్ఠాల నుంచి క్రమంగా స్థిరీకరణ దిశగా సాగుతున్న సూచీలు గరిష్ఠాల వద్ద అమ్మకాలు, కనిష్ఠాల వద్ద కొనుగోళ్లను ఎదుర్కొంటున్నాయి.


మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* దేశ రాజధాని దిల్లీలో జనసమూహాలపై ఆంక్షలు విధించడంతో మల్టీప్లెక్స్‌ ఆపరేటర్లయిన ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌, పీవీఆర్‌ లిమిటెడ్‌ షేర్లు నష్టపోయాయి. 

* గత రెండు సెషన్లలో మ్యాప్‌మైఇండియా షేర్లు 20 శాతం ఎగబాకాయి. డిసెంబరు 21న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన ఈ షేరు ఇప్పటి వరకు 25 శాతం పుంజుకుంది. 

* శరీకా ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు ఈరోజు ట్రేడింగ్‌లో 10 శాతం ఎగబాకాయి. పవర్‌ గ్రిడ్‌ నుంచి కంపెనీకి రూ.1.74 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ అందింది.

* ఆటో స్టాక్స్‌ భారీగా లాభపడ్డాయి. ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్స్‌ ఆటో రంగ సూచీని ముందుకు నడిపించాయి.

* బ్యాంకింగ్‌ రంగ షేర్లన్నీ కుదేలవ్వడంతో నిఫ్టీ బ్యాంకు సూచీ భారీగా నష్టపోయింది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని