Inflation: ద్రవ్యోల్బణానికి చమురు సెగ

పెట్రోల్‌ ధరల సెగతో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. మే నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(డబ్ల్యూపీఐ) జీవనకాల గనిష్ఠాన్ని నమోదు చేసింది. గతేడాది మే నెలలో మైనస్‌

Published : 14 Jun 2021 14:39 IST

దిల్లీ: పెట్రోల్‌ ధరల సెగతో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. మే నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(డబ్ల్యూపీఐ) జీవనకాల గనిష్ఠాన్ని నమోదు చేసింది. గతేడాది మే నెలలో మైనస్‌ 3.37శాతంగా ఉన్న ఈ సూచీ.. ఈసారి ఏకంగా 12.94శాతానికి చేరింది. ముడిచమురు, ఉత్పత్తి ఆధారిత వస్తువుల ధరలు పెరగడమే ఇందుకు కారణం. కాగా.. టోకు ద్రవ్యోల్బణం పెరగడం వరుసగా ఇది ఐదో నెల కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా రెండంకెలు దాటి 10.49శాతంగా నమోదైంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది మే నెలలో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో ముడి చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. అలాగే ఉత్పత్తి ఆధారిత వస్తువుల గిరాకీ సైతం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ క్రమంలో టోకు ద్రవ్యోల్బణం పూర్తిగా పడిపోయింది. దాన్ని ఆధారంగా చేసుకొని లెక్కించడమే ద్రవ్యోల్బణం భారీ పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

మే నెలలో పెట్రో ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇంధన, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 37.61శాతం పెరిగింది. ఇక ఉత్పత్తి ఆధారిత వస్తువుల ద్రవ్యోల్బణం 10.83శాతంగా ఉంది. ఇక ఉల్లి ధరలు పెరిగినప్పటికీ ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌తో పోలిస్తే కాస్త క్షీణించింది. 

ఆర్‌బీఐ వడ్డీరేట్లను నిర్ణయించడంలో ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇటీవల జూన్‌ ఆరంభంలో జరిగిన ద్వైమాసిక సమావేశంలో కీలక వడ్డీరేట్లను రిజర్వు బ్యాంకు యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.1శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని