Adani FPO: సంస్థాగతేతర మదుపర్ల సాయంతో గట్టెక్కిన ‘అదానీ’ ఎఫ్‌పీఓ!

హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ కంపెనీ షేర్లలో నష్టాలు కొనసాగుతున్నప్పటికీ.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓ (Adani Enterprises FPO) మాత్రం పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ కావడం గమనార్హం.

Published : 31 Jan 2023 18:11 IST

దిల్లీ: రూ.20,000 కోట్ల సమీకరణ నిమిత్తం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) ప్రారంభించిన ‘మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ (FPO)’ పూర్తిగా సబ్‌స్క్రైబైంది. రిటైల్‌యేతర విభాగాల నుంచి అధిక స్పందన లభించింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్నప్పటికీ ఎఫ్‌పీఓకు మాత్రం పూర్తిస్థాయి స్పందన లభించడం గమనార్హం.

మొత్తం 4.55 కోట్ల షేర్లు ఎఫ్‌పీఓలో విక్రయానికి ఉంచగా.. 4.62 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ‘సంస్థాగతేతర మదుపర్ల ( Non-institutional investors)’కు 96.16 లక్షల షేర్లు రిజర్వు చేయగా.. ఈ విభాగంలో మూడు రెట్ల షేర్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. మరోవైపు ‘అర్హతగల సంస్థాగత మదుపర్ల (Qualified institutional buyers)’ విభాగంలోని స్టాక్స్‌ పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. అయితే, రిటైల్‌ మదుపర్లు, కంపెనీ ఉద్యోగుల నుంచి మాత్రం పెద్దగా స్పందన లభించలేదు. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 2.29 కోట్ల షేర్లను కేటాయించగా.. కేవలం 11 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ఉద్యోగులు తమకు కేటాయించిన 1.6 లక్షల షేర్లలో 52 శాతం షేర్లకు బిడ్లు దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని