సంక్షిప్త వార్తలు( 7)

ఇండస్ట్రియల్‌ సాఫ్ట్‌వేర్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవల సంస్థ అవేవా, హైదరాబాద్‌లో కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి కేంద్రాల్లో ఇది ఆరోది.

Published : 03 May 2024 03:23 IST

అవేవా ‘కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’

ఈనాడు, హైదరాబాద్‌: ఇండస్ట్రియల్‌ సాఫ్ట్‌వేర్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవల సంస్థ అవేవా, హైదరాబాద్‌లో కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి కేంద్రాల్లో ఇది ఆరోది. ఇతర కేంద్రాల కంటే ఇది పెద్దదని, ఇక్కడ దాదాపు 1200 మంది ఐటీ నిపుణులు పనిచేసే అవకాశం ఉందని అవేవా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ సూ క్వెన్స్‌ తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో లభించే నిపుణులైన మానవ వనరులు తమకు ఎంతో మేలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్‌ను సందర్శించే తమ వినియోగదార్లకు తాము అందించే సేవలు, వాటి వల్ల కలిగే లాభాలపై పూర్తి అవగాహన వస్తుందని తెలిపారు.


బ్లూస్టార్‌ లాభంలో 29% క్షీణత

దిల్లీ: ఏసీలు, వాణిజ్య రిఫ్రిజిరేటర్ల సంస్థ బ్లూస్టార్‌ 2023-24 నాలుగో త్రైమాసికంలో రూ.159.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.225.29 కోట్లతో పోలిస్తే ఇది 29% తక్కువ. మొత్తం ఆదాయం రూ.2,830.48 కోట్ల నుంచి రూ.3,340.16 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.9,685.36 కోట్ల ఆదాయంపై రూ.414.31 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. 2022-23లో ఆదాయం రూ.7,977.32 కోట్లు, లాభం రూ.4,00.69 కోట్లుగా ఉన్నాయి.


స్వల్పంగా పెరిగిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం

ముంబయి: ఫెడరల్‌ బ్యాంక్‌, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.906 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.903 కోట్లతో పోలిస్తే ఈసారి అతి స్వల్పంగా పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 15% పెరిగి రూ.2,195 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.36% నుంచి 3.21 శాతానికి తగ్గింది. రుణ వృద్ధి 20 శాతంగా నమోదైంది. ప్రస్తుతం బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా శ్యామ్‌ శ్రీనివాసన్‌ పదవీ కాలం సెప్టెంబరుతో ముగియనుండగా, కొత్త ఎండీ, సీఈఓ ఎంపికపై బ్యాంక్‌ కసరత్తు చేస్తోంది. 2024 మార్చి 31 నాటికి స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.13 శాతానికి చేరింది.


సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ డివిడెండ్‌ 30%

దిల్లీ: సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, మార్చి త్రైమాసికంలో రూ.287.56 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ లాభం రూ.333.89 కోట్లతో పోలిస్తే ఇది 13.88% తక్కువ. మొత్తం ఆదాయం మాత్రం రూ.2,318 కోట్ల నుంచి రూ.2,621 కోట్లకు వృద్ధి చెందింది. రూ.1 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.0.30 (30%) డివిడెండ్‌ను బ్యాంక్‌ బోర్డు సిఫారసు చేసింది.


ఏప్రిల్‌లో రాణించిన తయారీ

దిల్లీ: ఏప్రిల్‌లో దేశీయంగా తయారీ రంగ కార్యకలాపాలు నెమ్మదించాయి. అయితే మూడున్నరేళ్లలోనే రెండో అధిక వృద్ధిని ఈ రంగం నమోదుచేసిందని ఓ సర్వే పేర్కొంది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ (పీఎంఐ) సూచీ, ఈ ఏడాది మార్చిలో 59.1 పాయింట్లుగా నమోదు కాగా, ఏప్రిల్‌లో 58.8 పాయింట్లకు తగ్గింది.  బలమైన గిరాకీ పరిస్థితుల నేపథ్యంలో, ఉత్పత్తి మరింతగా పెరిగిందని హెచ్‌ఎస్‌బీసీ భారత విభాగ ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్‌ భండారీ తెలిపారు.


ఎన్‌ఎండీసీ అధికోత్పత్తి, అమ్మకాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని (2024-25) ఆకర్షణీయ పనితీరుతో ప్రారంభించింది. ఏప్రిల్‌లో 34.8 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసి, 35.3 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని విక్రయించింది. 2023 ఇదే నెల అమ్మకాలతో పోల్చితే ఈసారి 3% వృద్ధి నమోదైంది. కిరండేల్‌, దోనిమలై గనుల నుంచి ఉత్పత్తి 12% పెరిగినట్లు ఎన్‌ఎండీసీ వెల్లడించింది. బచేలి కాంప్లెక్స్‌ నుంచి అమ్మకాలు 12% పెరిగినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 45 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్‌ టన్నులకు చేరుకుంటామని సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ వెల్లడించారు.


రూ.204 కోట్ల సైయెంట్‌ షేర్లు కొన్న హెచ్‌డీఎఫ్‌సీ ఎమ్‌ఎఫ్‌

దిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టెక్‌ కంపెనీ సైయెంట్‌లో 1.02% వాటాకు సమానమైన 11.33 లక్షల షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎమ్‌ఎఫ్‌) గురువారం బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది. సగటున ఒక్కో షేరును రూ.1800 వద్ద కొనుగోలు చేయడంతో మొత్తం లావాదేవీ విలువ రూ.204.10 కోట్లకు చేరింది. తాజా కొనుగోలుతో సైయెంట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఎమ్‌ఎఫ్‌ వాటా 1.08% నుంచి 2.1 శాతానికి చేరింది. షేర్ల విక్రేతల వివరాలు తెలియలేదు.
బీఎస్‌ఈలో గురువారం సైయెంట్‌ షేరు 0.67% నష్టపోయి రూ.1794.30 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని