నష్టాల నుంచి లాభాల్లోకి

ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడం, సానుకూల తయారీ గణాంకాల మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి.

Updated : 03 May 2024 05:03 IST

సమీక్ష

ప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడం, సానుకూల తయారీ గణాంకాల మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 83.46 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.02% పెరిగి 84.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

  • సెన్సెక్స్‌ ఉదయం 74,391.73 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ, 74,812.43 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 128.33 పాయింట్ల లాభంతో 74,611.11 వద్ద ముగిసింది. నిఫ్టీ 43.35 పాయింట్లుపెరిగి 22,648.20 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,567.85- 22,710.50 పాయింట్ల మధ్య కదలాడింది.
  • జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎస్‌ మణియన్‌ రాజీనామా చేయడంతో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు ఇంట్రాడేలో 4.38% నష్టపోయి రూ.1552.55 వద్ద 52 వారాల కనిష్ఠానికి పడింది. చివరకు 2.95% తగ్గి రూ.1,575.80 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్‌ విలువ రూ.9,532.07 కోట్లు కోల్పోయి, రూ.3.13 లక్షల కోట్లకు చేరింది.
  • గోద్రేజ్‌ కుటుంబం ఆస్తులను విభజించుకుంటున్నట్లు ప్రకటించడంతో, గ్రూప్‌ సంస్థల షేర్లు మిశ్రమంగా ముగిశాయి. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ 8.60%, గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ 6.25%, ఆస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ 2.15% చొప్పున నష్టపోయాయి. గోద్రేజ్‌ అగ్రోవెట్‌ 5.58%, గోద్రేజ్‌ కన్జూమర్‌ 2.82% పెరిగాయి.
  • మార్చి త్రైమాసికంలో నికర లాభం 13.88% తగ్గడంతో, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ షేరు 5.10% కోల్పోయి రూ.29.20 దగ్గర స్థిరపడింది.
  • వచ్చే నాలుగేళ్లలో వ్యాపారాలపై 20 బి.డాలర్ల (సుమారు రూ.1.66 లక్షల కోట్ల) పెట్టుబడులు పెడతామని ప్రకటించడంతో, వేదాంతా షేరు 3.22% పెరిగి రూ.410.70 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,757.64 కోట్లు పెరిగి రూ.1.52 లక్షల కోట్లుగా నమోదైంది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 రాణించాయి. పవర్‌గ్రిడ్‌ 3.91%, ఏషియన్‌ పెయింట్స్‌ 3.36%, టాటా మోటార్స్‌ 1.99%, ఎన్‌టీపీసీ 1.72%, టాటా స్టీల్‌ 1.45%, ఎం అండ్‌ ఎం 1.31%, టీసీఎస్‌ 1.08%, సన్‌ఫార్మా 1.07%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.05% లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 1.41%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.26%, విప్రో 1.09%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.05% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. యుటిలిటీస్‌ 1.49%, విద్యుత్‌ 1.47%, సేవలు 1.24%, వాహన 1.17%, లోహ 1.03% పెరిగాయి.  

సందీప్‌ బక్షి తప్పుకోవడం లేదు..ఐసీఐసీఐ బ్యాంక్‌: తమ ఎండీ, సీఈఓ సందీప్‌ బక్షి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖండించింది. ఒక వెబ్‌సైట్‌లో వచ్చిన కథనంలో నిజం లేదని ఎక్స్ఛేంజీలకు బ్యాంక్‌ స్పష్టతనిచ్చింది. 2023 సెప్టెంబరులో ఎండీగా సందీప్‌ పదవీకాలాన్ని బ్యాంక్‌ మూడేళ్ల పాటు పొడిగించింది.

ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.300- 315గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ఈనెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.3000 కోట్లు సమీకరించనుంది. యాంకర్‌ మదుపర్లు మే 7న బిడ్‌లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్‌ మదుపర్లు కనీసం 47 షేర్లు దరఖాస్తు చేసుకోవాలి.

ట్రావెల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టీబీఓ టెక్‌ లిమిటెడ్‌ ఐపీఓ మే 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో 1.25 కోట్ల వరకు షేర్లను ప్రమోటర్లు, పెట్టుబడిదార్లు విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌ పరిమాణం దాదాపు రూ.600 కోట్లుగా ఉండొచ్చని, మొత్తం ఐపీఓ పరిమాణం రూ.1000 కోట్లు అని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

దిల్లీ- దుబాయ్‌ అంతర్జాతీయ మార్గంలో ఏ350 విమాన కార్యకలాపాలను ఎయిరిండియా బుధవారం ప్రారంభించింది. రాబోయే నెలల్లో మరిన్ని విదేశీ మార్గాల్లో వైడ్‌- బాడీ విమానాలను నడిపేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఇంజినీరింగ్‌ అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆటోమోటివ్‌ సరఫరా సంస్థ ఫోర్వియా నుంచి 45 మిలియన్‌ యూరోల (సుమారు రూ.400 కోట్లు) కాంట్రాక్టును ఐటీ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ అందుకుంది.


నేటి బోర్డు సమావేశాలు: టైటన్‌ కంపెనీ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, బ్రిటానియా, గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌, ఎంఆర్‌ఎఫ్‌, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా, ఎంఆర్‌పీఎల్‌, టాటా టెక్‌, రేమండ్‌, గో ఫ్యాషన్‌, ఐనాక్స్‌ గ్రీన్‌ ఎనర్జీ, విరించి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు