మన ఎలక్ట్రానిక్స్‌లో చైనా, హాంకాంగ్‌ నుంచే 56%

గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్‌, టెలికాం, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల దిగుమతులు 89.8 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి.

Updated : 03 May 2024 05:06 IST

ఇది ఆర్థిక భద్రతకు సవాలు: జీటీఆర్‌ఐ

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్‌, టెలికాం, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల దిగుమతులు 89.8 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా (56%) చైనా, హాంకాంగ్‌ దేశాల నుంచే దిగుమతి అయ్యాయని ఆర్థిక మేధో సంస్థ జీటీఆర్‌ఐ తన నివేదికలో పేర్కొంది. చైనా నుంచే 43.9% ఎలక్ట్రానిక్స్‌, టెలికాం, విద్యుత్తు ఉత్పత్తులు వచ్చాయని వివరించింది. ఈ ఉత్పత్తుల కోసం ఈ రెండు దేశాలపై ఎన్నో ఏళ్లుగా భారత్‌ ఆధారపడి ఉందని  తెలిపింది. ఈ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటేనే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు, భారత డిజిటల్‌, సాంకేతిక సార్వభౌమత్వాన్ని రక్షించుకోగలమని ఆ నివేదిక అభిప్రాయపడింది. ఈ వస్తువుల కోసం చైనాపై ఆధారపడటం కొనసాగితే, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, ఆర్థిక భద్రతకు సవాళ్లను విసరగలదని హెచ్చరించింది. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు, వివిధ వస్తువుల కోసం వ్యూహాత్మకంగా ఇతర దేశాల వైపు మళ్లాలని సూచించింది.

  • ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్ల దిగుమతి 2007-10 మధ్య 166.1 మి. డాలర్లు (సుమారు రూ.1380 కోట్లు)గా ఉండగా.. 2020-2022 కల్లా 4.2 బి. డాలర్ల (సుమారు రూ.35,000 కోట్ల)కు పెరిగింది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో వీటి వాడకం ఎక్కువ.
  • ఫోన్లు, ఇతర వైర్‌లెస్‌ పరికరాల వంటి కమ్యూనికేషన్‌ డివైజెస్‌ల దిగుమతులు 3.691 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.30,700 కోట్ల)కు పెరిగాయి. ఈ మార్కెట్‌లో సగం వాటా చైనాదే.
  • డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఇదే తరహా సెమీకండక్టర్‌ డివైజెస్‌ల దిగుమతులు కూడా 113.3 మి. డాలర్ల (సుమారు రూ.940 కోట్ల) నుంచి 2334.8 మి. డాలర్ల (సుమారు రూ.19,400 కోట్ల)కు దూసుకెళ్లాయి. ఇందులో చైనా వాటా 67.5%.
  • బ్యాటరీలు, ఇతరత్రా ఎలక్ట్రిక్‌ అక్యుములేటర్ల దిగుమతులు 254.2 మి. డాలర్ల (సుమారు రూ.2110 కోట్ల) నుంచి 1.4 బి. డాలర్ల (సుమారు రూ.11,600 కోట్ల)కు చేరగా.. ఇందులోనూ చైనాదే అధిక వాటా.

ఈ నేపథ్యంలో చైనాపై ఆధారపడడం తగ్గించుకోవాలని.. ఇది అత్యంత ప్రాధాన్యత, వ్యూహాత్మక అంశంగా గుర్తించాలని ఆ నివేదిక వివరించింది. దేశీయంగా సెమీకండక్టర్‌ తయారీని అభివృద్ధి చేసుకోవాలని తెలిపింది. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఎలక్ట్రిక్‌ అక్యుములేటర్ల స్థానిక తయారీ వేగవంతం చేయాలని.. ఇందు కోసం అంతర్జాతీయ టెక్‌ కంపెనీలతో సాంకేతిక బదిలీ/సంయుక్త సంస్థల స్థాపన దిశగా ఆలోచించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని