37% తగ్గిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లాభం

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.450.58 కోట్ల  ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.722.48 కోట్లతో పోలిస్తే ఇది 37% తక్కువ.

Published : 03 May 2024 03:25 IST

దిల్లీ: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.450.58 కోట్ల  ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.722.48 కోట్లతో పోలిస్తే ఇది 37% తక్కువ.  అక్టోబరు- డిసెంబరు లాభం రూ.1,888.45 కోట్లతో పోలిస్తే బాగా తగ్గింది. వాణిజ్య గనుల తవ్వకాలపై రూ.201.83 కోట్ల నష్టాన్ని చవిచూడటం, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి   సంబంధించి గత బకాయిల కోసం రూ.627 కోట్లు వెచ్చించాల్సి రావడం వల్లే, సమీక్షా త్రైమాసిక  లాభంలో క్షీణతకు కారణమైంది. ఏడాది వ్యవధిలో కార్యకలాపాల ఆదాయం రూ.28,943.84 కోట్ల నుంచి రూ.29,180.02 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం 31% వృద్ధితో రూ.3,240.78 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం మాత్రం రూ.1,27,539.50 కోట్ల నుంచి రూ.96,420.98 కోట్లకు తగ్గింది.

రాణించిన కొత్త విద్యుత్‌ వ్యాపారాలు: కంపెనీకి చెందిన కొత్త విద్యుత్‌ వ్యాపారాల విభాగమైన అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ ఎబిటా సమీక్షిస్తున్న త్రైమాసికంలో 6.2 రెట్లు పెరిగి రూ.641 కోట్లుగా నమోదైంది. విమానాశ్రయాల వ్యాపార ఎబిటా  రెట్టింపునకు పైగా పెరిగి రూ.662 కోట్లకు చేరింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వహణలోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ 19% పెరిగి 8.86 కోట్లకు చేరింది. ‘భారత్‌లో కొత్త వ్యాపారాల పరంగానే కాకుండా మౌలిక అభివృద్ధిలో అంతర్జాతీయంగాను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తన సత్తాను మరోసారి చాటినట్లు’ అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు. సౌర మాడ్యుళ్ల తయారీలో వాడే ఇన్‌గాట్‌, వేఫర్‌ విభాగాల కార్యకలాపాలు ప్రారంభించాయని.. 254 గాలిమరల తయారీ కోసం  ఆర్డర్లు లభించాయని కంపెనీ తెలిపింది. ఎడ్జ్‌కనెక్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ చెన్నైలో ఒక డేటా కేంద్రాన్ని ప్రారంభించిందని.. నోయిడా, హైదరాబాద్‌లలో డేటా కేంద్రాల నిర్మాణం 81-88%  పూర్తయ్యిందని వెల్లడించింది. డిజిటల్‌ సేవల గిరాకీ అవసరాలకు తగ్గట్లుగా మౌలిక వసతులను అందుబాటులో తెచ్చే నిమిత్తం 2030 కల్లా మొత్తంగా 1 గిగావాట్‌ సామర్థ్యమున్న 9 డేటా కేంద్రాలను నెలకొల్పే యోచనలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఉంది. లోహ వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు ముంద్రాలో రాగి విభాగాన్ని మార్చిలో సంస్థ ప్రారంభించింది.


అదానీ పోర్ట్స్‌ డివిడెండ్‌ 300%

దిల్లీ: అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,014.77 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.1,139.07 కోట్లతో పోలిస్తే ఇది 76.87%  అధికం. మొత్తం ఆదాయం రూ.6,178.35 కోట్ల నుంచి రూ.7,199.94 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.3,995 కోట్ల నుంచి రూ.4,450.52 కోట్లకు చేరాయి. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏపీఎస్‌ఈజెడ్‌ నికర లాభం 50% పెరిగి రూ.8,103.99 కోట్లుగా నమోదైంది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.6 (300%) చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది.

‘ఏపీఎస్‌ఈజెడ్‌ మంచి పని తీరు కనబరిచింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సరకు రవాణా, ఆదాయం, ఎబిటా అంచనా కంటే 6-8% అధికంగా నమోదైంది. నికర అప్పు-ఎబిటా నిష్పత్తి 2.5 రెట్లుగా అంచనా వేయగా, 2.3 రెట్లకు పరిమితం అయ్యింద’ని కంపెనీ పూర్తికాల డైరెక్టర్‌, సీఈఓ అశ్వినీ గుప్తా వెల్లడించారు. రెండేళ్లలోపే 100 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (ఎంఎంటీ) సంచిత సరకు రవాణా పరిమాణానికి చేరుకున్నామని, 2025లో 500 ఎంఎంటీ సరకు రవాణా పరిమాణ లక్ష్యాన్ని చేరుకుంటామని గుప్తా పేర్కొన్నారు. దేశ మొత్తం సరకు రవాణాలో 27%, కంటైనర్‌ కార్గోలో 44% వాటా ఏపీఎస్‌ఈజెడ్‌దేనని కంపెనీ తెలిపింది. కార్గో పరిమాణం 2023-24లో 21% పెరిగింది. 2024-25లో ఆదాయం రూ.29,000-31,000 కోట్లకు చేరుతందని, మూలధన వ్యయాలు రూ.10,500-11,500 కోట్ల మధ్య ఉండొచ్చని కంపెనీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని