బియ్యం, డెయిరీ ఉత్పత్తులపైనా నిఘా

దేశీయ మార్కెట్లో విక్రయమయ్యే పోషక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌), డెయిరీ ఉత్పత్తులు, మసాలాలపై నిఘా పెట్టాలని ఆహార నియంత్రణాధికార సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ భావిస్తోంది.

Published : 03 May 2024 03:26 IST

ఆహార నియంత్రణాధికార సంస్థ యోచన
బ్రాండెడ్‌ మసాలాలపై దర్యాప్తు నేపథ్యం

దిల్లీ: దేశీయ మార్కెట్లో విక్రయమయ్యే పోషక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌), డెయిరీ ఉత్పత్తులు, మసాలాలపై నిఘా పెట్టాలని ఆహార నియంత్రణాధికార సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ భావిస్తోంది. కొన్ని బ్రాండెడ్‌ మసాలా కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలు రావడంతో, ఇటీవలే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే పళ్లు-కూరగాయలు, చేపల ఉత్పత్తులు, మసాలాలు, వంటల్లో వాడే మూలికలు, పోషక బియ్యం, పాలు, పాల ఉత్పత్తుల పైనా నిఘా పెట్టాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అన్ని బ్రాండ్ల మసాలా పొడుల శాంపిళ్లను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దేశవ్యాప్తంగా సేకరించింది. ఇవి నిబంధనలకు లోబడి ఉన్నాయో, లేదో తనిఖీ చేయనుంది. ఎమ్‌డీహెచ్‌, ఎవరెస్ట్‌ బ్రాండ్లకు చెందిన కొన్ని మసాలా పొడుల్లో ఎథిలీన్‌ ఆక్సైడ్‌ అనే పురుగు మందు అవశేషాలున్నాయని ఆరోపించడమే కాకుండా.. వినియోగదార్లు కొనరాదని, వ్యాపారులు అమ్మరాదని హాంకాంగ్‌ సూచించింది. సింగపూర్‌ కూడా భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మాసాలను రీకాల్‌ చేసింది. మరో వైపు, నెస్లే ఇండియా సెరిలాక్‌ బేబీ ఉత్పత్తుల శాంపిళ్లనూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సేకరించింది. ఆసియా దేశాల్లో విక్రయిస్తున్న నెస్లే ఉత్పత్తుల్లో చక్కెర మోతాదు ఎక్కువగా ఉందని స్విస్‌ స్వచ్ఛంద సంస్థ ఒకటి ఆరోపించడం ఇందుకు నేపథ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని