జీఎస్‌టీ నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం

రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో కేంద్ర, రాష్ట్రాల జీఎస్‌టీ ఉన్నతాధికారుల 3వ జాతీయ సమన్వయ సమావేశం శుక్రవారం జరగనుంది.

Published : 03 May 2024 03:24 IST

నేడు జీఎస్‌టీ ఉన్నతాధికార్ల సమావేశంలో చర్చ

దిల్లీ: రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో కేంద్ర, రాష్ట్రాల జీఎస్‌టీ ఉన్నతాధికారుల 3వ జాతీయ సమన్వయ సమావేశం శుక్రవారం జరగనుంది. పన్నుల ఎగవేత కోసం నకిలీ కంపెనీల ఏర్పాటును అరికట్టేందుకు, జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ నిబంధనలు కఠినతరం చేయడం సహా పలు అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్లకు చేరాక జరుగుతున్న ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, మరింత వృద్ధికి ఆస్కారం ఇస్తాయని భావిస్తున్నారు.

ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకునేందుకే కొందరు నకిలీ కంపెనీలను సృష్టిస్తున్నారు. పన్నులను ఎగ్గొట్టేందుకూ ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అందుకే నకిలీ కంపెనీల ఏర్పాటును నియంత్రించేలా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ నిబంధనలను మరింత కఠినం చేయనున్నారు. జీఎస్‌టీ మోసాలకు వ్యూహాలు రచించే వారిని (మాస్టర్‌మైండ్‌) కనిపెట్టేందుకు అనుసరించాల్సిన మార్గాలపైనా  చర్చించనున్నారు. తప్పుడు మార్గంలో ఐటీసీ క్లెయిమ్‌ చేసుకుంటున్నారని భావిస్తున్న వారిని  గుర్తించేందుకు డేటా అనాలటిక్స్‌, కృత్రిమ మేధ సాంకేతికతను వాడుతున్నారు. నకిలీ కంపెనీలను ప్రారంభంలోనే గుర్తించేందుకు కంపెనీలు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించడం, ఆధార్‌ ధ్రువీకరణనూ చేపడుతున్నారు. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తుల పరిశీలన కోసం గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరిలలో బయోమెట్రిక్‌ ఆధారిత ఆధార్‌ ధ్రువీకరణను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023 ఏప్రిల్‌- డిసెంబరు మధ్య 14,600 జీఎస్‌టీ ఎగవేత కేసులను కేంద్ర పన్నుల అధికారులు నమోదుచేశారు. వీటిల్లో అత్యధిక కేసులు మహారాష్ట్రలో (2,716) ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్‌ (2,589), హరియాణా (1,123), పశ్చిమ బెంగాల్‌ (1,098) ఉన్నాయి.  2023 ఏప్రిల్‌- డిసెంబరు మద్య 18,000 నకిలీ ఐటీసీ క్లెయిమ్‌ కేసులను జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు గుర్తించారు. 98 మంది మోసగాళ్లను అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని