IPO: ఐపీఓల్లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..

గ‌తేడాది స్టాక్ మార్కెట్ల దూకుడుతో, ఐపీఓలు కూడా మంచి జోరు మీద ఉండేవి.

Updated : 06 Jun 2022 15:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఓల‌లో పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు పెట్టుబ‌డిదారులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది. మీకు రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం తక్కువగా ఉన్నట్టయితే ఐపీఓల‌లో పెట్టుబ‌డి పెట్ట‌కుండా ఉండ‌డమే మంచిది. గ‌తేడాది స్టాక్ మార్కెట్ల దూకుడుతో, ఐపీఓలు కూడా మంచి జోరు మీద ఉండేవి. భార‌త స్టాక్ సూచీలు ప్ర‌స్తుతం ఊగిస‌లాట ధోర‌ణిలో ఉన్నందున ఐపీఓల‌లో పెట్టుబ‌డులకు మ‌దుపుదారులు కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఈ మ‌ధ్య‌న మార్కెట్‌లో వ‌చ్చిన అతిపెద్ద ఐపీఓ ఎల్ఐసీ కూడా మ‌దుపుదార్ల‌కు అంత‌గా మెరుగైన ఆర్థిక ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు.

ఏది ఏమైన‌ప్ప‌టికీ పెట్టుబ‌డుల మార్కెట్‌లో కొత్త‌గా ప్ర‌వేశించిన ప్ర‌తి ఒక్క‌రూ పెట్టుబ‌డి పెట్టే ముందు వివిధ అంశాల‌పై బాగా అధ్య‌య‌నం చేసి అంచ‌నాకు రావాలి. ఎందుకంటే అవి మార్కెట్ మ‌ధ్య‌వ‌ర్తులు చెప్పినంత ఆశాజనకంగా ఉండ‌క‌పోవ‌చ్చు. అందువ‌ల్ల ఐపీఓల‌లో పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు పెట్టుబ‌డిదారులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం తెలివైన ప‌ని. కొన్ని స‌మ‌యాల్లో ఇటువంటి పెట్టుబ‌డులు అనుకున్న‌దానికంటే లాభం చేకూర్చ‌ని సంద‌ర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

ఐపీఓ అంటే ఏమిటి?

పెట్టుబ‌డిదారుల‌కు షేర్ల‌ను జారీ చేసి, స్టాక్ మార్కెట్ నుంచి మూల‌ధ‌నాన్ని సేక‌రించ‌డం ద్వారా సొంతంగా నిర్వ‌హిస్తున్న కంపెనీని ప‌బ్లిక్‌గా మార్చే విధాన‌ప‌ర‌మైన ప్ర‌క్రియే ఐపీఓ. ఐపీఓల‌తో సంస్థ‌లు త‌మ రాబోయే ప్రాజెక్ట్‌లు లేదా విస్త‌ర‌ణ కోసం నిధుల‌ను సేక‌రిస్తాయి. అయితే, కంపెనీ స్థితిని తెలుసుకోవ‌డానికి, ప్ర‌జ‌ల ప‌రిశీల‌న‌కు ఆయా వివరాలను కంపెనీ అందుబాటులో ఉంచుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల‌లో షేర్ల లిస్టింగ్ కంపెనీ దాని విలువకు సంబంధించిన విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేస్తుంది.

పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • DRHP (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట‌స్‌)ని పూర్తిగా చ‌ద‌వాలి. మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ వద్ద దాఖలైన ఈ DRHP అనేది కంపెనీ ప‌నితీరు, ఆస్తులు, అప్పులు, భవిష్యత్‌ కార్యాచరణ వంటి కీల‌క‌మైన వివ‌రాల‌ను క‌లిగి ఉంటుంది. DRHP మీకు వ్యాపారాన్ని బాగా అర్థం చేసుకోవ‌డానికి, మీరు స‌రైన పెట్టుబ‌డిదారునిగా మార‌డానికి స‌హాయ‌ప‌డే క్లిష్ట‌మైన స‌మాచారాన్ని అందిస్తుంది. కాబ‌ట్టి, మీరు పెట్టుబ‌డి పెట్టాల‌ని నిర్ణ‌యించుకునే ముందు దాన్ని పూర్తిగా చ‌ద‌వ‌డం మ‌రిచిపోకూడ‌దు.
  • కంపెనీపై అప్పుల భారం ప‌డి, ఇప్ప‌టికే ఉన్న రుణాన్ని చెల్లించ‌డానికి దాని ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని DRHPలో పేర్కొన్న‌ట్ల‌యితే పెట్టుబ‌డిదారులు అటువంటి ఐపీఓల‌లో పెట్టుబ‌డుల‌ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. అయితే, కంపెనీ రుణ చెల్లింపు, కంపెనీ విస్త‌ర‌ణ లాంటి మిశ్ర‌మ ప్ర‌యోజ‌నం కోసం ఈ ఐపీఓ నిధులు వినియోగిస్తే పెట్టుబ‌డి పెట్ట‌డాన్ని స్వాగ‌తించ‌వ‌చ్చు.
  • ఒక కంపెనీలో ప్ర‌మోట‌ర్లగా పాత్ర నిర్వ‌హిస్తున్న వ్య‌క్తుల‌ను నిశితంగా ప‌రిశీలించాలి. ఏ సంస్థ‌కైనా ప్ర‌మోట‌ర్లు, నిర్వ‌హ‌ణ‌లోని ఇత‌ర ముఖ్య అధికారులు ఉంటారు. ఈ సిబ్బంది సంస్థ‌కు అత్యంత ముఖ్యులు కాబ‌ట్టి, స‌రైన వ్యాపార నిర్ణ‌యాలు తీసుకునే వారి సామ‌ర్థ్యంపై సంస్థ వృద్ధి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఆధార‌ప‌డి ఉంటాయి. కీల‌క‌మైన మేనేజ్‌మెంట్ అధికారులు కంపెనీతో ఎన్ని సంవ‌త్స‌రాలు గ‌డిపారో పెట్టుబ‌డిదారుడు గ‌మ‌నించాలి. అలాగే, కంపెనీలో ప్రమోటర్ వాటా కూడా తెలుసుకోవడం మంచిది. ప్రమోటర్ వాటా అధికంగా ఉన్నట్టయితే కంపెనీ మీద వారి విశ్వాసం దృఢంగా ఉందని అర్థం 
  • ఆర్థిక స్థితిగతులు కూడా చాలా కీలకమైనవి. గత కొద్దేళ్లుగా కంపెనీ లాభ, నష్టాలను కూలాంకుషంగా పరిశీలించాలి. నష్టాల్లో కూరుకుపోతున్నట్టయితే అందులో మదుపు చేయకపోవడమే మంచిది. డివిడెండ్, నెట్ ప్రాఫిట్ మార్జిన్‌ వంటి నిష్పత్తులను చూసి నిర్ణయం తీసుకోవచ్చు.
  • కంపెనీ సరైనది కావచ్చు. కానీ ఒక్కోసారి వారు భాగంగా ఉన్న రంగంలో అనేక ఇబ్బందులు ఉండవచ్చు. కాబట్టి, అలాంటి రంగంలో ఉన్న కంపెనీలో మదుపు చేయడం కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అలాగే, పోటీ కంపెనీల పని తీరుని కూడా పరిశీలించాలి.      

చివ‌ర‌గా: మీ రిస్క్‌ని బ‌ట్టి మీరు పెట్టుబ‌డి పెట్టాలి. మీరు సొంత‌గా మార్కెట్ల ప‌రిశోధ‌న చేయ‌డం కూడా చాలా మంచిది. ఐపీఓల‌ను త్వ‌ర‌గా డ‌బ్బు సంపాదించే సాధ‌నంగా చూడ‌కూడ‌దు. అదే స‌మ‌యంలో మీరు ప్ర‌తి ఐపీఓలో పెట్టుబ‌డి పెట్టాల్సిన అవ‌స‌రం కూడా లేదు. మ‌నం ఆర్థికంగా ఎంత రిస్క్ తీసుకోవ‌చ్చు అనేదానిపై ఆధార‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మంచిది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటేనే వీటిలో మదుపు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని