Azim Premji: అజీమ్‌ ప్రేమ్‌జీ రోజుకు రూ.27కోట్లు దాతృత్వానికే! టాప్‌-5 దానకర్ణులు వీళ్లే!

‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అని మదర్‌ థెరిస్సా అంటారు. దేశంలో ఎంతో మంది సంపన్నులు తమ సంపదలో కొంతమొత్తాన్ని దానం చేస్తూ సహృదయాన్ని

Published : 29 Oct 2021 02:25 IST

ముంబయి: ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అని మదర్‌ థెరిస్సా అంటారు. దేశంలో ఎంతో మంది సంపన్నులు తమ సంపదలో కొంతమొత్తాన్ని దానం చేస్తూ సహృదయాన్ని చాటుకుంటున్నారు. ఈ విషయంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీ అందరికంటే ముందున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ.9,713కోట్లు దాతృత్వానికే వెచ్చించారు. అంటే సగటును రోజుకు రూ.27కోట్లు దానం చేస్తూ దాతలకే మహాదాత అయ్యారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆయన చేసే దాతృత్వం నాలుగింతలు పెరిగిందని ఎడిల్‌గివ్‌ హురన్‌ ఇండియా ఫిలాంత్రఫీ జాబితా-2021లో వెల్లడైంది.

అజీమ్‌ ప్రేమ్‌జీ తర్వాత హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ శివనాడర్ రూ.1,263 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. భారత దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్‌ ఇండస్ట్రీ ముఖేశ్‌ అంబానీ రూ.577 కోట్లతో మూడో స్థానంలో ఉండగా, కుమార మంగళం బిర్లా రూ.377 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక భారతదేశంలో రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్‌ అదానీ రూ.130 కోట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నందన్‌ నీలేకని రూ.183 కోట్లను దానం చేయడంతో ఐదో స్థానానికి చేరుకున్నారు.

ఇక ఈ జాబితాలో ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ ఝున్‌ వాలా కూడా వచ్చి చేరారు. ఆయన ఆర్జనలో నాలుగో వంతు దాదాపు రూ.50కోట్లు విద్యాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారు. వాతావరణ మార్పులు, కాలుష్య నివారణకు కృషి చేసే సంస్థలకు అండగా నిలవడానికి రాబోయే కొన్నేళ్లలో రూ.750 కోట్లు ఖర్చు చేయనున్నట్లు నితిన్‌, నిఖిల్‌ కామత్‌ సోదరులు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ జాబితాలో వారు 35వస్థానంలో ఉన్నారు. ఎల్‌ అండ్‌ టీ మాజీ ఛైర్మన్‌ ఏఎం నాయక్‌ రూ.112 కోట్లు(11వ స్థానం) ఖర్చు చేస్తున్నారు. హిందూజా కుటుంబం, బజాజ్‌ కుటుంబం, అనిల్‌ అగర్వాల్‌, బర్మన్ కుటుంబాలు కూడా దాతృత్వంలో ముందున్నారు. ఈ జాబితాలో మహిళలు కూడా ఉన్నారు. రోహిణి నీలేఖని, లీనా గాంధీ తివారి, అను అగా తదితరులకు చోటు లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని