Corona Second Wave:కేంద్రం కీలక నిర్ణయం

రెండో దశలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోన్న వేళ.. వైద్యపరంగా ప్రజలపై పడుతోన్న భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్, కొవిడ్ టీకాల

Updated : 24 Apr 2021 17:10 IST

ఆక్సిజన్, కొవిడ్ టీకాల దిగుమతిపై కస్టమ్ డ్యూటీ మాఫీ

దిల్లీ: రెండో దశలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోన్న వేళ.. వైద్యపరంగా ప్రజలపై పడుతోన్న భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్, కొవిడ్ టీకాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, ఆరోగ్య సెస్‌ను తక్షణమే మాఫీ చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. మూడు నెలల కాలానికి ఇది అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై నేడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. 

తాజా నిర్ణయం వస్తువుల లభ్యతను పెంచడమే కాక చౌకగా లభించేలా చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే వాటికి త్వరగా కస్టమ్స్ అనుమతులు వచ్చేలా చూడాలని ప్రధాని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశలో ఏర్పడుతోన్న ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింగపూర్ నుంచి యుద్ధవిమానాల్లో ప్రాణవాయువు భారత్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేసింది. అలాగే దేశవ్యాప్తంగా వేగంగా సరఫరా చేసేందుకు భారత వైమానిక దళం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. 

కాగా, ప్రభుత్వం పేర్కొన్న జాబితాలో..ఆక్సిజన్, ఆక్సిజన్ క్యానిస్టర్, ఫిల్లింగ్ సిస్టమ్స్, కంటైనర్లు, ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకులు, ఆక్సిజన్ జనరేటర్లు, వెంటిలేటర్లు(వెంటిలేటర్స్ విత్ నాజల్ క్యాన్యులా) ఉన్నాయి. వాటితోపాటు కొవిడ్ టీకాల దిగుమతిపై కూడా కస్టమ్ డ్యూటీని మూడు నెలల కాలానికి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా సృష్టిస్తోన్న విలయానికి నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3.46లక్షల మందికి కరోనా సోకగా..2,624 మంది మరణించారు. క్రియాశీల కేసులు 25లక్షల మార్కును దాటడమే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా పరిణమించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని