Gautam Adani: ఆసియా కుబేరుడిగా మళ్లీ గౌతమ్‌ అదానీ

Gautam Adani: అదానీ గ్రూప్‌ గురించి హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై సిట్‌, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో అదానీ కంపెనీల షేర్లు దూసుకెళ్లాయి.

Updated : 05 Jan 2024 19:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదానీ గ్రూప్‌ (Adani Group) ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) తిరిగి ఆసియా కుబేరుడిగా అవతరించారు. అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలపై సెబీ విచారణను మినహాయించి ప్రత్యేకమైన దర్యాప్తులేమీ అవసరంలేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన సంపద గణనీయంగా పెరిగింది.

బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. గౌతమ్‌ అదానీ (Gautam Adani) సంపద ఒక్కరోజే 7.7 బిలియన్‌ డాలర్లు పెరిగి 97.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో ఆయన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని దాటేసి ప్రపంచ సంపన్నుల జాబితాలో 12వ స్థానానికి చేరారు. 97 బిలియన్‌ డాలర్లతో అంబానీ 13వ స్థానంలో కొనసాగుతున్నారు.

అదానీ గ్రూప్‌ (Adani Group) నమోదిత సంస్థల స్టాక్‌ విలువ పెంచేందుకు అవకతవకలు జరిగాయని.. అకౌంట్‌ మోసాలకూ పాల్పడినట్లు హిండెన్‌బర్గ్‌ గతేడాది ఆరంభంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఓ దశలో అదానీ కంపెనీల మార్కెట్‌ విలువ 150 బిలియన్‌ డాలర్ల మేర తగ్గిపోయింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అదానీ గ్రూప్‌ అనేక చర్యలు చేపట్టింది. రుణ వాయిదాలను గడువు కంటే ముందుగానే చెల్లించింది. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకు కొత్త పెట్టుబడిదారులతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. బ్యాంకుల నుంచి కొత్తగా రుణాలు సమీకరించుకుంది. దీంతో కంపెనీ షేర్లు తిరిగి గాడినపడ్డాయి.

అదానీ గ్రూప్‌పై ఇతర దర్యాప్తులేం అక్కర్లేదు

హిండెన్‌బర్గ్‌ నివేదికపై సెబీ దర్యాప్తు చేసి, అదానీ గ్రూప్‌పై (Adani Group) వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. సెబీ దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సెబీ దర్యాప్తుపై తమకు విశ్వాసం ఉందని తెలిపింది. విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు బదిలీ చేయడానికి నిరాకరించింది. అలాగే పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సెబీకి సూచించింది. దీంతో అదానీ గ్రూప్‌ షేర్లు పుంజుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని